రాష్ట్రం బండి కదిలేది కేంద్రం తోస్తేనే...!

ABN , First Publish Date - 2022-10-04T06:55:32+05:30 IST

కేంద్రం రాబోయే ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలవి మాలిన ‘ఆర్థిక ప్రేమ’ చూపిస్తుందా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ వర్గాలకే కాదు, తల పండిన ఆర్థికవేత్తల ఎదుట కూడా ఉన్న ప్రశ్న...

రాష్ట్రం బండి కదిలేది కేంద్రం తోస్తేనే...!

కేంద్రం రాబోయే ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలవి మాలిన ‘ఆర్థిక ప్రేమ’ చూపిస్తుందా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ వర్గాలకే కాదు, తల పండిన ఆర్థికవేత్తల ఎదుట కూడా ఉన్న ప్రశ్న! ఒకవేళ అలాంటి ఆర్థిక ప్రేమ కేంద్రం చూపించకపోతే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబోయే ఆరు నెలల పాటు, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక బండి నడవాలంటే, అది కేవలం కేంద్రం దయాదాక్షిణ్యాలపై మాత్రమే ఆధారపడి ఉంది. ఏ రాష్ట్రానికీ ఇవ్వనంతటి కరుణ మన మీద చూపిస్తేనే రాష్ట్ర ఆర్థిక బండి నడుస్తుంది. వేరొక దారి కనపడటం లేదు.


కేంద్రం కరుణ చూపించటం అంటే, ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)తో సంబంధం లేకుండా, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వని వెసులుబాటు ఇచ్చి, ఇంకొక యాభై వేల కోట్లు అప్పు తెచ్చుకో పో, అని రాష్ట్రానికి పర్మీషన్ ఇస్తేనే రాష్ట్రం ముందుకు పోతుంది.


అంటే కేంద్రం సాలుకు నిర్దేశించిన అప్పు తీసుకొన్న తర్వాత కూడా, నెలకు కనీసం అయిదు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తేనే కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక బండి ముందుకు పోవటం లేదు అన్నది స్పష్టం. మంగళవారం నాడు కూడా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రెండు వేలు కోట్లు కావాలని ఆర్బీఐ దగ్గర ఇండెంట్ పెట్టింది. తీసుకోగలిగిన మార్కెట్ అప్పులు పరిధికి మించి ఎప్పుడో తీసేసుకున్నాము. కేంద్రం పెట్టిన తొమ్మిది నెలల అప్పు పరిధిని ఆరు నెలల్లోనే దాటేసాము. దానికి తోడు కేంద్రానికి తెలియకుండా, మన ఎక్సైజ్ శాఖ నుంచి రాబోయే నెలల్లోని ఆదాయాన్ని బ్యాంకులకు తనఖా పెట్టి ఎనిమిది వేల కోట్లు తీసుకొన్నాం. ఇవి కాకుండా కేంద్రం నుంచి, నాబార్డ్ నుంచి వచ్చిన ఇంకొన్ని చిల్లర అప్పులు.


రాబోయే ఆరు నెలలు ఆర్థిక బండి నడవటం ఎలా? కేంద్రం రాష్ట్రానికి 2022–23 ఆర్థిక సంవత్సరానికి గానూ, ఏప్రిల్‌లో తొమ్మిది నెలలకు రూ.43,803 కోట్లు బహిరంగ మార్కెట్ ఋణాలకు అనుమతించింది. రాష్ట్రం ఆరు నెలల్లోనే రూ.51,100 కోట్లు అప్పు చేసింది. అంటే ఇప్పటికే తొమ్మిది నెలల అప్పు అనుమతిని, ఆరునెలల్లోనే దాటేసింది, పైగా ఏడు వేల కోట్ల రూపాయల అప్పు అదనంగా చేసింది.


ప్రతి నెలా కనీసం ఆరేడు వేల కోట్లు అప్పు తేలేకపోతే, రాష్ట్ర ఆర్థిక బండి ముందుకు నడవటం లేదు. ఎందుకు నడవటం లేదు, ఎందుకు అప్పులు కచ్చితంగా తేవాల్సిన పరిస్థితి ఎదురయ్యిందీ అంటే మన రాష్ట్ర ఆదాయానికన్నా, రాష్ట్రం పెట్టే ఖర్చు రెండింతలు ఉంది కాబట్టి. ఆగస్టు వరకు రాష్ట్ర స్వంత ఆదాయం, కేంద్ర పన్నుల వాటాతో కలిపి రూ.45,190 కోట్లు. చేసిన అప్పు రూ.44,582 కోట్లు. అంటే ఎంత సంపాదిస్తే అంత మొత్తాన్ని అప్పుగా తెచ్చామన్నమాట. మరొక చిత్రమేమిటంటే, ఆగస్టు వరకు రాష్ట్రం ఆదాయం– కేంద్ర పన్నులు, గ్రాంటులు, స్వంత ఆదాయం అన్నీ కలుపుకొని, రూ.59,381 కోట్లు. ఖర్చు మాత్రం రూ.1,03,975 కోట్లు. నలభై అయిదు వేల కోట్లు లోటు. మరెలా అంటే నలభై అయిదు వేల కోట్లు అప్పుచేసి బండిని లాగారు. కేంద్రం ఆగస్టు వరకు తీసుకోవచ్చని చెప్పిన అప్పు, కేవలం ఇరవై నాలుగు వేల కోట్లు మాత్రమే. ఆగస్టు వరకు చేసిన అప్పు, రూ.నలభై అయిదు వేల కోట్ల పైచిలుకు. అంటే కేంద్ర అనుమతి లేకుండా అయిదు నెలల్లోనే రాబోయే కాలానికి తీసుకోవాల్సిన అప్పుని ముందే తీసుకొన్నారు.


ఇక్కడ కేంద్రం నిర్ణయం కీలకం. ఎందుకంటే, రాష్ట్రాలు ఎంత అప్పులు తీసుకోవాలో నిర్ణయించేది రాజ్యాంగం ప్రకారం కేంద్రమే. రాష్ట్రాల స్థూల ఉత్పత్తిని, ఇప్పటికి ఉన్న అప్పుల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుంది. అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రానికి ఏమి చెబుతుంది? ‘నువ్వు చెయ్యాల్సిన అప్పు ఇరవై తొమ్మిది వేల కోట్లే అయినప్పటికీ, ఆరునెలల్లో ఇప్పటికి యాభై వేల కోట్లు పైనే అప్పు చేసావు, అయినా ఫర్లేదులే, రాగల ఆరు నెలల్లో ఇంకొక యాభై వేల కోట్లు అప్పు చేసుకోలే, నేను చూసుకొంటాలే’ అని ఊరడిస్తుందా? లేక, ‘నీది సవ్యమైన ఆర్థిక విధానం కాదు, నీ ప్రాధామ్యాలు సరి చూసుకో, ఇంతకంటే అప్పులు చేయడానికి వీల్లేదు’ అని కరాఖండిగా చెప్తుందా?


పైపెచ్చు, క్రితం వారం కేంద్రం తీసుకొన్న నిర్ణయం ప్రకారం, రాగల ఆరు నెలల్లో బహిరంగ మార్కెట్ నుంచి కేంద్రం తీసుకోదల్చుకున్న అప్పుల్లో కొంత మేర కోత వేయాలని నిర్ణయించింది. ఎందుకంటే, గత నాలుగైదు నెలల్లో రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం రావడంతో, చేయాలి అనుకొన్న అప్పులని కొంత తగ్గించుకొంది. ఈ నేపథ్యంలో అత్యవసర ఖర్చులు కాకుండా తాను నిర్ణయించుకొని ఆ మేరకు ఇస్తున్న సబ్సిడీల కోసం, రాగల ఆరు నెలలకి దాదాపు యాభై వేల కోట్ల అప్పులను అదనంగా తెచ్చుకోమని, కేంద్రం రాష్ట్రానికి అనుమతిస్తుందా అన్నది ఒక క్లిష్టమైన ప్రశ్నే. పైగా, ఇది జాతీయ స్థాయిలో జరిగే విధాన నిర్ణయం. రేపటి నుంచి ప్రతి రాష్ట్రమూ, నాక్కూడా ఆంధ్రప్రదేశ్ పద్ధతిలో రాష్ట్ర జీఎస్డీపీలో అనుమతించినమేర కంటే ఎక్కువ మార్కెట్ ఋణాలు కల్పించమని పోటీ పడితే, కేంద్రం అనుమతించే పరిస్థితి ఉంటుందా? క్రిందటి ఆర్థిక సంవత్సరంలో కూడా రాష్ట్రానిది ఇదే పరిస్థితి. కానీ కేంద్రానికి చెప్పకుండా, అనుమతించిన బహిరంగ మార్కెట్ ఋణాలతో పాటుగా, ఆంధ్రరాష్ట్రం తన స్వంత కార్పొరేషన్ల నుంచి బ్యాంకుల్లో అప్పులు తెచ్చేసుకొని నెట్టుకొచ్చింది. కేంద్రం విధించిన అప్పుల పరిమితి దాటలేదు అని వాదించింది. ఖంగుతిన్న కేంద్ర ఆర్థిక శాఖ, ఇక నుంచి రాష్ట్రాలు చేసే ఏ అప్పులైనా, కార్పొరేషన్లు, ఇతర రాష్ట్ర పబ్లిక్ సంస్థల అప్పులతో సహా ఆ ఆర్థిక సంవత్సరంలో ఆయా రాష్ట్రాలకు ఇచ్చే అప్పు పరిమితిలకు లోబడే ఉంటాయి అని మొన్నటి జూన్‌లో లోక్‌సభలో స్పష్టం చేసింది. ఆ మేరకు రాష్ట్రాల అకౌంట్లను ప్రచురించే ‘కాగ్’ ఫార్మాట్ లలో కూడా రాష్ట్రాల కార్పొరేషన్లు, పబ్లిక్ సంస్థల కోసం విడిగా సమాచార ఫార్మాటును ఏర్పరచింది.


బహుశా ఈ పరిస్థితిని ఊహించేనేమో, కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐ ద్వారా, జూన్ నెలలో, శ్రీలంక ఆర్థిక సమస్య నేపథ్యంలో, రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య పరిస్థితి మీద ఒక సవివరమైన పరిశోధన పత్రం వెలువరించింది. ఆ పత్రం ప్రకారం, అప్పుల భారం అత్యధికంగా, రెవెన్యూ లోటు ఎక్కువగా (ఆగస్టు దాకా– 217 శాతం రెవెన్యూ లోటు), ఆదాయం – వడ్డీ చెల్లింపులు నిష్పత్తి 10శాతం కంటే దాటిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. పదిహేనవ ఆర్థిక సంఘం విధించిన టార్గెట్ సాధించని నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. స్వంత ఆదాయం యాభై శాతం కంటే దిగువన కలిగి, మిగిలిన యాభై శాతం కేంద్ర గ్రాంటులు, పన్నుల వాటాల మీద ఆధారపడే పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. స్వంత ఆదాయంలో సబ్సిడీల మీద 30శాతం ఖర్చు పెడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానంలో ఉంది. మొత్తం ఖర్చులో రెవెన్యూ ఖర్చు ఎనభై శాతానికి పైగా ఉన్న పది రాష్ట్రాల్లో ఆంధ్రా ఒకటి. అంటే క్యాపిటల్ ఖర్చు చాలా తక్కువ, (ఆగస్టు దాకా కేవలం రూ.5856 కోట్లు – బడ్జెట్ అంచనాలో 19 శాతం మాత్రమే) రెవెన్యూ ఖర్చు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టినా, ఆ ప్రభావం ఆ సంవత్సరం మేరకు మాత్రమే అని ఆర్బీఐ వివరించింది. క్యాపిటల్ పనుల మీద ఖర్చుతో రెండు మూడేళ్ళలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠి చెందడం ప్రారంభిస్తుంది అని ఆర్బీఐ పత్రం వివరించింది. ఇవన్నీ ఆర్థిక ఆరోగ్యాన్ని సూచించేందుకు ఆర్బీఐ పెట్టుకొన్న సూచికలు. మరి ఏ విధంగా, ఏ ప్రాతిపదికన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, వెలిగిపోతోంది, వృద్ధిలో దూసుకుపోతోంది అని ఇటీవల శాసనసభలో ఎలా చెప్పారో తెలీదు. రాష్ట్ర ప్రజలు తమకు తెలియకుండా, పైకి లేవలేనంత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు అన్నది మాత్రమే వాస్తవం. ఈ ‘అప్పులతో అభివృద్ధి’ అనే విచిత్ర భావన మీద, కేంద్రం సరైన నిర్ణయం తీసుకొంటుందని ఆశిద్దాం.

నీలయపాలెం విజయ్ కుమార్

తెలుగుదేశం పార్టీ

Updated Date - 2022-10-04T06:55:32+05:30 IST