లారీ కిందకు దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2022-08-09T09:57:44+05:30 IST

అసలే వర్షం.. బురద కొట్టుకుని లారీకి వెనుక రేడియం స్టిక్కర్లు, లైట్లు కనిపించకపోవడం..

లారీ కిందకు దూసుకెళ్లిన కారు

  • ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం
  • నుజ్జయిన కారులో చిక్కుకుని మృతి
  • మృతులంతా పల్నాడు జిల్లా వాసులు
  • ప్రకాశం జిల్లా కంభం వద్ద ప్రమాదం
  • వర్షంలో ముందున్న వాహనాన్ని గుర్తించని డ్రైవర్‌
  • తిరుమల దైవదర్శనానికి వెళుతుండగా దుర్ఘటన


బేస్తవారపేట, ఆగస్టు 8: అసలే వర్షం.. బురద కొట్టుకుని లారీకి వెనుక రేడియం స్టిక్కర్లు, లైట్లు కనిపించకపోవడం.. దానికితోడు అతివేగం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. ముందువెళ్తున్న సిమెంట్‌ లారీని.. వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందిన దుర్ఘటన ప్రకాశం జిల్లా కంభం రైల్వేగేటు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతులంతా పల్నాడు జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామానికి చెందిన ఓ కుటుంబమంతా రెండు కార్లలో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి బయల్దేరింది. అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై  సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చిన్నగా వర్షం పడుతుండగా.. ప్రకాశం జిల్లా కంభం రైల్వేగేటు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న సిమెంట్‌ లారీని బలంగా ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో కారు లారీ కిందకు చొచ్చుకుపోవడంతో అందులో ఉన్న ఐదుగురు ఇరుక్కుపోయి మృతిచెందారు. ప్రమాదంలో కారు నడుపుతున్న జూలకంటి నాగిరెడ్డి (22), తాతయ్య, అమ్మమ్మలు చిలకల హనిమిరెడ్డి (70), ఆదిలక్ష్మీ (62), చిన్న అమ్మమ్మలు భూమిరెడ్డి గురవమ్మ (60), పల్లె అనంతరామమ్మ (55) మృతిచెందారు. నాగిరెడ్డి లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కంభం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక వైద్యశాలకు తరలించారు.

Updated Date - 2022-08-09T09:57:44+05:30 IST