Abn logo
May 17 2021 @ 00:06AM

అవుషాపూర్‌ సమీపంలో కారు బోల్తా

  •  బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం
  •  మహబూబాబాద్‌ నుంచి హైద్రాబాద్‌కు వస్తుండగా ఘటన

ఘట్‌కేసర్‌ రూరల్‌ : కారు ప్రమాదంలో బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. సీఐ ఎన్‌ చంద్రబాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ సతీమణి జమున, డ్రైవర్‌ కందిక సుమన్‌తో కలిసి ఆదివారం సాయంత్రం తన కారు(టీఎస్‌ 03 ఈక్యూ 1234)లో మహబూబాబాద్‌ నుంచి హైద్రాబాద్‌కు వస్తుండగా మేడ్చల్‌-మల్కాజిగిరి జల్లా ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి అవుషాపూర్‌ సమీపంలో వరంగల్‌-హైద్రాబాద్‌ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని హుస్సేన్‌నాయక్‌ అతడి భార్యను కారులో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్‌లోని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని, అతివేగంతోనే కారు బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. కాగా హుస్సేన్‌నాయక్‌ స్వగ్రామం ముచ్చెర్ల, గూడూరు మండలం, మహబూబాబాద్‌ జిల్లాకు చెందినవాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబును తెలిపారు.

Advertisement
Advertisement