సీఎం కాన్వాయ్‌...క్రౌర్యం

ABN , First Publish Date - 2022-04-22T08:14:28+05:30 IST

సీఎం కాన్వాయ్‌ కోసం ఏకంగా ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారునే అధికారులు లాగేసుకుని వారిని నడిరోడ్డుపై వదిలేశారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన..

సీఎం కాన్వాయ్‌...క్రౌర్యం

తిరుమల భక్తుల కారు లాగేసుకున్నారు

అర్ధరాత్రి నడిరోడ్డుపై వారిని వదిలేశారు

ఒంగోలు బస్టాండ్‌లో రాత్రంతా అవస్థలు 


తిరుమల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): సీఎం కాన్వాయ్‌ కోసం ఏకంగా ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారునే అధికారులు లాగేసుకుని వారిని నడిరోడ్డుపై వదిలేశారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీనివాస్‌ శ్రీవారి దర్శనం కోసం తన భార్య పార్వతి, మరో జంట, ఇద్దరు పిల్లలతో ట్రావెల్స్‌లో కారు బుక్‌ చేసుకుని బయలుదేరారు. బుధవారం రాత్రి 7 గంటలకు వినుకొండలో బయలుదేరిన వీరు 10 గంటల సమయంలో ఒంగోలు సిటీ చేరుకున్నారు. అక్కడ ఓ డాబాలో టిఫిన్‌ చేశారు. అంతలో అసిస్టెంట్‌ ఎంవీఐ సంధ్య, హోంగార్డు అక్కడకు వచ్చి ‘మీ లగేజీ కారు నుంచి దించుకోండి. ఈ వెహికల్‌ సీఎం కాన్వాయ్‌ కోసం ఉంచుకుంటున్నాం’’ అని చెప్పి.. కారు తీసుకుని వెళ్లిపోయారు. తాము తిరుపతికి వెళుతున్నామని, ఇలా రోడ్డుపై వదిలేస్తే ఎలా సార్‌ అని బతిమలాడినా వినలేదు. ఆ సమయంలో మరో కారు లభించకపోవడంతో రోడ్డుపైనే చాలాసేపు శ్రీనివాస్‌ కుటుం బం ఉండిపోయింది. ఆ తర్వాత అర్ధరాత్రి వరకూ ఒంగోలు బస్టాండ్‌లో తలదాచుకుంది. ‘‘వినుకొండ నుంచి మరోకారును బుక్‌ చేసుకున్నప్పటికీ కారును ఒంగోలు సిటీలోకి రావొద్దని చెప్పాం. సిటీలోకి వస్తే మళ్లీ  అధికారులు ఆ కారును కూడా తీసుకుంటారేమోనని భయపడ్డాం. అందుకుని ఒంగోలు శివార్లకు వెళ్లి కారు ఎక్కాం’’ అని శ్రీనివాస్‌ వాపోయారు.

Updated Date - 2022-04-22T08:14:28+05:30 IST