బావిలోకి దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2021-12-02T08:35:48+05:30 IST

ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కూతుర్ని.. ఇంటికి తీసుకురావడానికి కొడుకుతో సహా బయల్దేరిందా తల్లి! కానీ..

బావిలోకి దూసుకెళ్లిన కారు

  • కారులో ఉన్న తల్లీకొడుకులు జలసమాధి
  • సహాయక చర్యలకు వెళ్లిన ఈతగాడి కాలికి తాడు బిగుసుకోవడంతో బావిలోనే మృతి
  • తల్లీకొడుకుల మృతదేహాలు మార్చురీకి
  • ఇంకా నూతిలోనే ఈతగాడి మృతదేహం
  • దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో విషాదం


దుబ్బాక, డిసెంబరు1: ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కూతుర్ని.. ఇంటికి తీసుకురావడానికి కొడుకుతో సహా బయల్దేరిందా తల్లి! కానీ.. దారిలోనే మృత్యువు వారిని కబళించింది!! ముందు టైరు పేలిపోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు.. 19 అడుగుల లోతున్న బావిలోకి నిట్టనిలువునా పడిపోయింది. అందులో ఉన్న తల్లీ కొడుకులు జలసమాధి అయిపోయారు! సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చిట్టాపూర్‌ గ్రామశివార్లలో బుధవారం మధ్యాహ్నం జరిగిందీ విషాదం. ఇంకా విషాదమేంటంటే.. సహాయక చర్యల కోసం వచ్చిన గజ ఈతగాళ్లలో ఒకరు కారును బావిలోంచి తీయడానికి ఉపయోగించిన తాడు బిగుసుకోవడంతో బావిలోనే మృతిచెందాడు!! పెద్దనిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన ఆకుల ప్రశాంత్‌ (25), ఆయన తల్లి భాగ్యలక్ష్మి (55) బుధవారం మధ్యాహ్నం కారులో హుస్నాబాద్‌కు బయల్దేరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామ సమీపంలోని కూడవెళ్లి చిన్నవాగు బ్రిడ్జి వద్దకు వెళ్లేసరికి.. ఒక్కసారిగా టైర్‌ పేలడంతో కారు బ్రిడ్జి కిందికి దూసుకెళ్లింది. వాగు పక్కనే బ్రిడ్జి కింద ఉన్న వ్యవసాయ బావిలో పడింది. అక్కడున్న రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు కారును వెలికితీసే ప్రయత్నం మొదలుపెట్టారు.


 బావిలోని నీళ్లను తోడటానికి సుమారు 5 మోటర్లను ఏర్పాటు చేశారు. సిద్దిపేట ఏసీపీ చల్లా దేవారెడ్డితోపాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. సుమారు 7 గంటల పాటు బావిలోని నీళ్లు తోడుతూనే ఉన్నారు. కానీ.. పక్కనే వాగు ఉండడంతో ఎంత తోడినా నీటి ఊటలు పైకి వస్తూనే ఉన్నాయి. బావిలోని నీరు తగ్గుముఖం పట్టలేదు. దీంతో స్థానిక ఈతగాళ్లను తాళ్లతో బావిలోకి దింపి.. ఆ తాళ్లను కారుకు తగిలించి రెండు క్రేన్‌లతో పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో.. దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన ఈతగాడు బండకాడి నర్సింహులు బావిలో ఉండగా అతడి కాలుకు తాళ్లు బిగుసుకుని పోయాయి. దీంతో అతడు నీళ్లలోనే చిక్కుకున్నాడు. ఈ విషయం తెలియక పైనున్న ఈతగాళ్లు, క్రేన్‌ సహాయంతో కారును బయటకు లాగారు. ఈ క్రమంలో కారుపై ఉన్న నర్సింహులు శవం బావిలో పడిపోయింది. దీంతో, కారులోని ఇద్దరి మృతదేహాలే బయటకు వచ్చాయి. అప్పటికే రాత్రి కావడంతో నర్సింహులు మృతదేహాన్ని వెతికే పనిని నిలిపివేశారు. అతడి మృతదేహం ఇంకా బావిలోనే ఉంది. భాగ్యలక్ష్మి, ప్రశాంత్‌ మృతదేహాలను మార్చురికీ తరలించారు. తమ కుమార్తెను తీసుకురావడం కోసం తన భార్య, కుమారుడు హుస్నాబాద్‌కు బయల్దేరారని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని భాగ్యలక్ష్మి భర్త సుధనం రాములు విలపించారు. కాగా.. సహాయక చర్యలకు వెళ్లి మృత్యువాత పడిన నర్సింహులు కుటుంబాన్నీ ఆదుకోవాలని బుధవారం రాత్రి ఎనగుర్తి గ్రామస్థులు సిద్దిపేట, రామాయంపేట రహదారిపై ధర్నాకు దిగారు.

Updated Date - 2021-12-02T08:35:48+05:30 IST