Abn logo
Sep 21 2021 @ 02:06AM

ఆగి ఉన్న కోళ్లలారీని ఢీకొన్న కారు

ప్రమాదంలో బోల్తాపడిన కోళ్ల లారీ.. నుజ్జునుజ్జయిన కారు ముందుభాగం

ఏడుగురికి తీవ్ర గాయాలు

రూ.5 లక్షల విలువైన కోళ్ల మృతి


చంద్రగిరి, సెప్టెంబరు 20: చంద్రగిరి మండలం రవణప్పగారిపల్లె వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న కోళ్ల లారీని కారు వేగంగా వచ్చి ఢీ కొంది. ఈప్రమాదంలో ఏడుగురుకి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం అర్ధరాత్రి నేండ్రగుంట నుంచి సూళ్లూరుపేటకు కోళ్ల లారీ బయలుదేరింది. రవణప్పగారిపల్లె వద్ద లారీ టైరు పంచరు కావడంతో రోడ్డు పక్కన ఆపి డ్రైవర్‌ మనోహర్‌, క్లీనర్‌ గణేశ్‌ టైరు మారుస్తున్నారు. ఆ సమయంలో చిత్తూరు నుంచి తిరుపతి వైపు వేగంగా వస్తున్న కారు..  కోళ్ల లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, లారీ బోల్తా పడింది. లారీ టైరు మారుస్తున్న డ్రైవర్‌ మనోహర్‌, క్లీనర్‌ గణేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ రమణ వాహనంలోనే ఇరుక్కుపోయారు. కారులోని సత్యనారాయణ, గీతాశ్రీ, శాంతాదేవి, ప్రసాద్‌కు గాయాలయ్యాయి. చంద్రగిరి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను ఎక్స్‌కవేటర్‌ సాయంతో బయటకు తీయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. అనంతరం రమణను ఆసుపత్రికి తరలించారు. లారీలోని సుమారు రూ.5 లక్షల విలువైన కోళ్లు మృతి చెందాయని లారీ యజమాని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.