Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 13 Jul 2021 00:00:00 IST

పిల్లల భవితకు సారథి

twitter-iconwatsapp-iconfb-icon
పిల్లల భవితకు సారథి

బడికి వెళ్లలేని పిల్లల ఇంటికి వెళ్లి చదువు చెబుతాడు. చదువుకున్న తల్లులకు ఉపాధి కల్పిస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు నగదు బదిలీ చేస్తాడు. పట్టణాల్లోని పేదల అభ్యున్నతికి రాజీ లేని ప్రయత్నం అతడిది. వేల మంది చిన్నారుల భవితకు ‘సారథి’గా మారిన అంకిత్‌ అరోరా కథ ఇది... 


‘‘జీవిత సత్యాలెన్నిటినో బోధిస్తుంది భగవద్గీత. ఆ మహాగ్రంథం స్ఫూర్తితో నెలకొల్పిందే ‘సారథి ఎడ్యుకేషన్‌’. ఇది పట్టణ ప్రాంతంలోని బడి మానేసిన పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ. ఇప్పటికి మూడేళ్లకు పైగా విరామం లేని ప్రయాణం. దీనికి ముందు ఎంతో పరిశోధన చేశాను. దేశ వ్యాప్తంగా అనేక మందిని కలిశాను. పలు ప్రాంతాలు తిరిగాను. అభిప్రాయాలు తీసుకున్నాను. నాకు అర్థమైందేమిటంటే... పిల్లలు చదువు నేర్చుకొనే క్రమంలో తల్లితండ్రుల పాత్ర కీలకమని! వారి సహకారం, ప్రోత్సాహం లేకపోతే అది తరువాత చిన్నారులు భవితవ్యంపై పెను ప్రభావం చూపుతోంది. అందుకే ఏదో మొక్కుబడిగా చదువు చెబితే సరిపోదని, ఈ ప్రాజెక్టులో వారి తల్లులను కూడా భాగస్వాములను చేస్తే సరైన ప్రయోజనం ఉంటుందనిపించింది. 

పిల్లల భవితకు సారథి

విద్య... ఉపాధి... 

పేద కుటుంబాల్లో ప్రధాన సమస్య ఆర్థిక వనరులు. చాలీచాలని సంపాదనతో ఇల్లు గడవడమే కష్టం వారికి. దీంతో పిల్లల్ని కూడా బడి మాన్పించి పనులకు పంపిస్తున్నారు. అలాంటి పిల్లలను మళ్లీ బడి బాట పట్టించడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. దీనికి పరిష్కారం ఏమిటని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన తట్టింది. తల్లులకు ఉపాధి కల్పిస్తే, ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరుకుతుందనిపించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. మాది ఢిల్లీ. అలాంటి మహానగరంలో ఎక్కడో ఒకచోట బడి పెట్టి, పిల్లల్ని రమ్మంటే ఎన్నో వ్యయప్రయాసలు పడాలి. కనుక వారి ఇంటికే వెళ్లి బోధిస్తే బాగుంటుందనిపించింది. దీని కోసం పేద కుటుంబాల్లో చదువుకున్న మహిళలను ‘రిలేషన్‌షిప్‌ మేనేజర్‌’ (ఆర్‌ఎం)గా తీసుకున్నాం. వారికి శిక్షణనిచ్చాం. విద్యార్థుల ఇంటికి వెళ్లి పాఠాలో చెప్పడం వీరి విధి. దీనికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోని 150 మందికి పైగా మహిళలు ఆర్‌ఎంలుగా ఉపాధి పొందుతున్నారు. 


8 వేల మంది విద్యార్థులు... 

మా ఆలోచన వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఒనగూరాయి. బడికి వెళ్లలేని పిల్లలకు విద్య అందుతోంది. మహిళలకు సంపాదనతో ఇల్లు గడుస్తోంది. ప్రస్తుతం మా సంస్థ ద్వారా ఐదు నుంచి పదేళ్ల లోపు వయసు గల 8 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో బోధిస్తున్నాం. ఢిల్లీలోనే కాకుండా డెహ్రాడూన్‌, మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలు, ఫరీదాబాద్‌ తదితర ప్రాంతాల్లో క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం. 


కరోనాను లెక్క చేయకుండా... 

గత ఏడాదిన్నర కాలంలో విద్యా వ్యవస్థ రూపు మారిపోయింది. బడులు తెరుచుకోక, విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలకు సరే... ఆన్‌లైన్‌ పాఠాలు సాగుతున్నాయి. మరి స్థోమత లేనివారి పరిస్థితి ఏమిటి? దీని కోసం వాట్సప్‌ ఆధారిత కార్యక్రమం ఒకటి తీసుకువచ్చాం. ఇందుకు గంటలకు గంటలు స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించక్కర్లేదు. మెగాబైట్ల కొద్దీ ఇంటర్నెట్‌ డేటా ఖర్చు చేయనవసరం లేదు. మా ఆర్‌ఎంలు ఒక్కొక్కరూ యాభై మంది విద్యార్థుల బాధ్యత తీసుకున్నారు. వర్క్‌షీట్లను తల్లితండ్రుల ఫోన్లకు పంపిస్తారు. దానికి తమ పిల్లలు రాసిన జవాబులను ఫొటో తీసి తల్లితండ్రులు మాకు వాట్సప్‌ చేస్తారు. అలా సులువైన పద్ధతిలో చిన్నారులకు పాఠాలు దూరం కాకుండా చర్యలు తీసుకున్నాం. 


ఆపదలో అండగా... 

అంతే కాకుండా ఆపదలో ఉన్న కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం కూడా చేశాం. వారి ఖాతాలకే నగదు బదలాయించాం. మా ప్రయత్నం వల్ల మహిళల ఆదాయం 40 శాతం పెరిగింది. అలాగే 90 శాతానికి పైగా పిల్లలు చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నారు. చదువుపై శ్రద్ధ చూపుతున్నారు. ఇలాంటి మార్పే మేం కోరుకున్నది. అలాగే ఈ విపత్కాలంలో ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అవసరమైన వారికి చేరవేశాం. వ్యాక్సినేషన్‌కు కూడా చాట్‌బోర్డ్‌ పెట్టాం. 


అందరి సహకారంతో... 

నా బాల్యం, విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్‌ అయిపోయిన తరువాత ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’ సంస్థ కోసం గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని బస్తీల్లో విస్తృతంగా పర్యటించాను. ‘సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌’లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా నూతన విద్యా పద్ధతులపై పరిశోధనలు చేశాను. ఆ సమయంలో ప్రత్యక్షంగా చూసిన అంశాలెన్నో ‘సారథి ఎడ్యుకేషన్‌’ నెలకొల్పడానికి కారణమయ్యాయి. దీనికి ముందున్నది నేనే అయినా ఎంతో మంది వెనక నుంచి మద్దతునిస్తున్నారు. నిధులు అందించి ఆదుకొంటున్నారు. కనుకనే తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిరంతరాయంగా నిర్వహించగలుగుతున్నా.  


సవాళ్లెన్నో... అయినా... 

‘సారథి ఎడ్యుకేషన్‌’ను నడిపించాలంటే అడుగడుగునా సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. మొదటిది పిల్లలకు మెరుగైన పద్ధతుల్లో చదువు చెప్పడం. రెండోది వారి తల్లితండ్రులను ఒప్పించడం. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఆన్‌లైన్‌ పాఠాలు బోధించడం పెద్ద సవాలే. ఎందుకంటే చాలా కుటుంబాలకు స్మార్ట్‌ఫోన్లంటే తెలియదు. కొంతమంది వద్ద ఉన్నా మొబైల్‌ డేటా కొనే స్థోమత లేదు. ఇక ఇళ్లకు వెళ్లి పాఠాలు చెప్పే మహిళలకు భద్రత కల్పించాలి. అయితే సమస్యలు ప్రతిచోటా ఉంటాయి. వాటిని ప్రతిబంధకాలుగా భావిస్తే ముందడుగు వేయలేం. వీటన్నిటినీ అధిగమించాలంటే సంకల్పం ఒక్కటే సరిపోదు... సహనం, కష్టపడే తత్వం కూడా ఉండాలి. అప్పుడే లక్ష్యం చేరుకోగలుగుతాం.’’

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.