ప్రచారం ఐదుగురితోనే..!

ABN , First Publish Date - 2020-09-24T08:59:35+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో త్వరలో జరగనున్న గ్రేటర్‌ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి

ప్రచారం ఐదుగురితోనే..!

నామినేషన్‌ ఇద్దరితో

ఓటర్లకు థర్మల్‌ స్ర్కీనింగ్‌.. గ్లౌస్‌లూ 

బీహార్‌ ఎన్నికల కోసం ఈసీఐ మార్గదర్శకాలు

గ్రేటర్‌ ఎన్నికల్లోనూ అమలు చేసే అవకాశం..?


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌  23 (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో త్వరలో జరగనున్న గ్రేటర్‌ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ అంశాలను పక్కన పెడితే.. ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. నామినేషన్‌ దాఖలు నుంచి ప్రచారం, పోలింగ్‌ వరకు పకడ్భందీగా ప్రక్రియ ముగించేందుకు కసరత్తు చేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. కొవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన మార్గదర్శకాలను ఎన్నికల విభాగం అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం తమకు అప్పగించిన బాధ్యతల్లో పాటించాల్సినవి ఏంటి..? అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నోడల్‌ అధికారులు దృష్టి సారించారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకనుగుణంగా మార్గదర్శకాలపై ఎస్‌ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ‘సన్నాహక చర్యల్లో భాగంగా ఇటీవలి మార్గదర్శకాలను పరిశీలిస్తున్నాం. తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది’ అని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారొకరు తెలిపారు. 


బీహార్‌ ఎన్నికల నేపథ్యంలో ఈసీఐ గత నెలలో విడుదల చేసిన మార్గదర్శకాలు...

  • ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దరఖాస్తు తీసుకోవాలి. ఇద్దరితో కలిసి మాత్రమే అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేందుకు అనుమతినిస్తారు. ప్రస్తుతం ఐదుగురితో కలిసి నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. 
  • డిపాజిట్‌ చేయాల్సిన నగదూ ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ట్రెజరీలో జమచేసే వెసులుబాటూ ఉంటుంది. 
  • ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో కలిపి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంగరక్షకులకు మినహాయింపునిస్తారు. 
  • రోడ్‌ షోల్లో ఐదు వాహనాల చొప్పున కాన్వాయ్‌లకు అనుమతి ఉంటుంది. ఒక కాన్వాయ్‌ ప్రారంభమైన అరగంట తర్వాత మరో కాన్వాయ్‌ వెళ్లేందుకు అవకాశమిస్తారు. 
  • ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఏర్పాట్లు జరిగే చోట శానిటైజర్‌, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిన తర్వాతే వారిని విధుల్లోకి అనుమతించాలి. 
  • పోలింగ్‌ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటర్‌ను ప్రవేశ ద్వారం వద్ద పోలింగ్‌ సిబ్బంది లేదా పారామెడికల్‌ స్టాఫ్‌/ఆశా వర్కర్లు తప్పనిసరిగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలి. మాస్క్‌లు ధరించిన ఓటర్లనే లోనికి అనుమతించాలి. 
  • పోలింగ్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది పీపీఈ కిట్‌లు ధరించాలి. 
  • ప్రతి ఓటర్‌కూ గ్లౌజులు ఇవ్వాలి. ఈవీఎంల బటన్‌ నొక్కినా.. బ్యాలెట్‌ పేపర్‌పై ముద్ర వేసినా.. అవి ధరించడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. భౌతిదూరం పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. 
  • 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌  అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల విధులు, ఆర్మీలో పనిచేసే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంది. 


ఈవీఎంలా...? బ్యాలెటా..? 

ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగిస్తారా..? బ్యాలెటా..? అన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 30వ తేదీ వరకు అభిప్రాయం చెప్పాల్సిందిగా గుర్తింపు పొందిన పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు పంపింది. ఆ తరువాతే ఓటింగ్‌ ఎలా నిర్వహించాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈవీఎంలు అయితే బటన్‌ నొక్కాల్సి ఉంటుంది. తద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో బ్యాలెట్‌ అయినా.. స్టాంపుతో ముద్ర వేసే క్రమంలోనూ వైరస్‌ సోకవచ్చు కదా అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.


ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం మాత్రం ఓటర్లు గ్లౌజులు వినియోగించడం తప్పనిసరి. ఈ క్రమంలో ఈవీఎంలు వాడినా, బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించినా అంత ఇబ్బంది ఉండదని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారొకరు తెలిపారు. ఈవీఎంలు వినియోగించిన పక్షంలో వీవీ ప్యాట్‌ యంత్రాలు అవసరం. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద సరిపడా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ యంత్రాలు లేవని సమాచారం. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ యంత్రాల కోసం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అక్కడి నుంచి ఈసీఐకి ప్రతిపాదన వెళ్లనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంటే రాష్ర్టానికి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ యంత్రాలు వస్తాయి. లేని పక్షంలో బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల నిర్వహణ తప్పదని ఓ అధికారి చెప్పారు. 

Updated Date - 2020-09-24T08:59:35+05:30 IST