కొవిడ్‌ కేసుల లెక్కలు వాస్తవం కాదు

ABN , First Publish Date - 2022-01-26T08:28:29+05:30 IST

రోజూ నమోదవుతున్న కొవిడ్‌ కేసుల సంఖ్య విషయంలో ప్రభుత్వం అందజేస్తున్న లెక్కలు వాస్తవం కాదని...

కొవిడ్‌ కేసుల లెక్కలు వాస్తవం కాదు

  • జ్వర సర్వేలో లక్షల సంఖ్యలో కిట్లు పంపిణీ చేశామంటున్నారు... 
  • అలాంటప్పుడు సగటున రోజూ 3వేల కేసులే ఎలా వస్తాయి?
  • హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో పిటిషనర్ల వాదన
  • కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయండి: హైకోర్టు


హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రోజూ నమోదవుతున్న కొవిడ్‌ కేసుల సంఖ్య విషయంలో ప్రభుత్వం అందజేస్తున్న లెక్కలు వాస్తవం కాదని... హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్లు పేర్కొన్నారు. కొవిడ్‌ పరీక్షలు, చికిత్స, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై దాఖలైన ఈ వ్యాజ్యాన్ని చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌. రవిచందర్‌, న్యాయవాది కౌటూరు పవన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేలో లక్షల మందికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు తేలుతున్నదని తెలిపారు. 1.78 లక్షల కొవిడ్‌ కిట్లు పంపిణీ చేసినట్లు ప్రభుత్వమే పేర్కొందని.. అలాంటప్పుడు రోజుకు సగటున 3వేల కేసులు మాత్రమే ఎలా వస్తాయని ప్రశ్నించారు. 


నీలోఫర్‌ హాస్పిటల్‌కు ప్రత్యామ్నాయంగా పిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయాలపై ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పేర్కొన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో టెస్ట్‌లు, పాజిటివిటీ రేటు, మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న బెడ్స్‌, వాక్సినేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖకు ఆదేశాలు జారీచేసింది. పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు తమకు ఎక్కడా కనిపించలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సామాజిక దూరం, మాస్క్‌ నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏజీకి సూచించింది.  తదుపరి విచారణలో డీహెచ్‌ లేదా ఆ స్థాయి అధికారులు హాజరుకావాలని పేర్కొంటూ విచారణను ఈ నెల 28కి వాయిదావేసింది. 


రోజూ లక్ష టెస్ట్‌లు చేస్తున్నాం: డీహెచ్‌ 

రోజూ లక్ష కొవిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నామని డీహెచ్‌ గడల శ్రీనివాసరావు హైకోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడు రోజుల నుంచి సగటున లక్షకుపైనే పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే కొవిడ్‌ లక్షణాలను గుర్తించేందుకు జ్వర సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. 42 లక్షలకు పైగా ఇళ్లలో సర్వే చేసి, లక్షణాలు ఉన్న 1.78 లక్షల మందికి మెడికల్‌ కిట్లు అందజేసినట్లు వెల్లడించారు. ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. సభలు, సమావేశాలపై విధించిన ఆంక్షలను ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సగటు పాజిటివిటీ రేటు 3.38 మాత్రమేనని, నైట్‌ కర్ఫ్యూ విధించే స్థాయిలో పాజిటివిటీ రేటు ఏ జిల్లాలోనూ లేదని పేర్కొన్నారు.


కొత్త కేసులు 4,559.. 3 లక్షల మందికి టీకా

రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ మొదలైన తర్వాత మంగళవారం అత్యధిక కేసులొచ్చాయి. 1,13,670 మందికి టెస్టులు చేయగా.. 4,559 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. గతేడాది మే 13 తర్వాత ఇవే గరిష్ఠం. వైర్‌సతో మరో ఇద్దరు చనిపోయారు. 1,961 మంది కోలుకున్నారు. 36,269 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్త కేసుల్లో హైదరాబాద్‌లో 1,450, మేడ్చల్‌లో 432, రంగారెడ్డిలో 322, హనుమకొండలో 201, నల్లగొండలో 138, ఖమ్మంలో 145 నమోదయ్యాయి. మంగళవారం 3.23 లక్షల మందికి టీకా వేశారు. 2.53 లక్షల మందికి రెండో, 10,175 మందికి ముందుజాగ్రత్త డోసు ఇచ్చారు. హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ ఠాణా సీఐ సహా 40 మంది సిబ్బందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మరోవైపు రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి రేటు 3.38గా ఉన్నట్లు హైకోర్టుకు వైద్య శాఖ నివేదిక ఇచ్చింది. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం ఉండగా, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1.14 శాతం ఉందని పేర్కొంది. కామారెడ్డిలో 6.20, ఆసిఫాబాద్‌లో 5.87, నిజామాబాద్‌లో 5, సంగారెడ్డిలో 5.33, వికారాబాద్‌లో 5.54 శాతం వ్యాప్తిరేటు ఉన్నట్లు తెలిపింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, యాదాద్రి, రంగారెడ్డి, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌,  మేడ్చల్‌, మంచిర్యాలలో 4 శాతంపైగా పాజిటివిటీ ఉన్నట్లు వెల్లడించింది. 


కరీంనగర్‌ జిల్లాలో టీకా వంద శాతం పూర్తి

కరోనా వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ జిల్లా రికార్డు సృష్టించింది. మంగళవారంతో ఈ జిల్లాలో రెండో డోసు పంపిణీ 100 శాతం పూర్తయింది. తెలంగాణలో ఈ ఘనత సాధించిన తొలి జిల్లాగా, బెంగళూరు అర్బన్‌ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డుల్లోకెక్కింది. కరీంనగర్‌ జిల్లాలో 7,92,922 మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా.. దీనికిమించి 8,27,103 మంది(104 శాతం)కి తొలి డోసు వేశారు. ఇక 7,94,404 మందికి రెండో డోసు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో ఇప్పటికే మొదటి డోసు 100 శాతం లక్ష్యాన్ని చేరిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-01-26T08:28:29+05:30 IST