Sep 16 2021 @ 12:56PM

కోలీవుడ్‌లో కొత్త సినిమాల సందడి

కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. ఒకవైపు కొత్త సినిమాల పూజా కార్యక్రమాలతో పాటు మరోవైపు కొత్త చిత్రాల విడుదలతో పండగ వాతావరణం ముందుగానే వచ్చింది. కరోనా రెండో వ్యాప్తి తర్వాత 50 శాతం ఆడియన్స్‌ ఆక్యుపెన్సీలో గత నెల 23వ తేదీ నుంచి రాష్ట్రంలో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో నిర్మాతలు తమతమ చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ శుక్రవారం రెండు చిత్రాలు విడుదలకానున్నాయి. వీటిలో ఒకటి ‘కోడియిల్‌ ఒరువన్‌’, రెండోది ‘ఫ్రెండ్‌షిప్‌’. ఈ నెల 10న ‘తలైవి’తో విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘లాభం’ చిత్రం థియేటర్‌లో విడుదలైన విషయం తెల్సిందే. 

అదేవిధంగా విశాల్‌ హీరోగా నటించిన ‘ఎనిమి’, శివకార్తికేయన్‌ నటించి ‘డాక్టర్‌’ చిత్రాలు కూడా థియేటర్‌లో విడుదలకానున్నాయి. ఈ రెండు చిత్రాలు అక్టోబరులో ప్రేక్షకుల ముందుకురానున్నాయి. వీటితో పాటు పలు చిత్రాలు వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫాంమ్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అలాగే నవంబరులో అసలుసిసలైన దీపావళి పండుగ రానుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘అణ్ణాత్త’, శింబు నటించిన ‘మానాడు’ చిత్రాలు ఒకే రోజున నవంబరు 4వ తేదీ రిలీజ్‌కానున్నాయి. అయితే, అదే తేదీన అజిత్‌ హీరోగా నటించిన ‘వలిమై’ కూడా విడుదల అవుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆ చిత్ర నిర్మాతలు వెనక్కితగ్గారు. హీరో అజిత్‌ సూచన మేరకు రిలీజ్‌ తేదీని మార్చినట్టు సమాచారం. మొత్తంమీద కరోనా రెండు దశ వ్యాప్తి తర్వాత సినీ పరిశ్రమలో సందడి వాతావరణం క్రమంగా పుంజుకోవడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.