కళకళలాడుతున్న గౌతమీ గ్రంథాలయం

ABN , First Publish Date - 2021-07-16T08:10:04+05:30 IST

ఈ నెల 10వ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వకుళాభరణం రామకృష్ణ వ్యాసం చదివాను. చివరి పేరాలో ‘‘పరిశోధకులకు కామధేనువు లాంటి వేటపాలెం సరస్వతీనిలయం...

కళకళలాడుతున్న గౌతమీ గ్రంథాలయం

ఈ నెల 10వ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వకుళాభరణం రామకృష్ణ వ్యాసం చదివాను. చివరి పేరాలో ‘‘పరిశోధకులకు కామధేనువు లాంటి వేటపాలెం సరస్వతీనిలయం గ్రంథాలయం, రాజమహేంద్రవరంలోని గౌతమీ గ్రంథాలయం, నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం ఇవాళ కళాకాంతులు లేక వెలవెల పోతున్నాయి’’ అని రాశారు. ఎప్పటి విషయమో గుర్తు పెట్టుకుని గౌతమీ గ్రంథాలయం గురించి రామకృష్ణ రాసి ఉంటారనుకుంటున్నాను.


2017 సంవత్సరం నుంచి గౌతమీ గ్రంథాలయం రూపురేఖలు మారాయి. శిథిలావస్థలో ఉన్న బాబాయమ్మ మెమోరియల్‌ హాల్‌ స్థానంలో అధునాతన సౌకర్యాలతో గ్రంథాలయం తీర్చిదిద్దబడింది. ఈ వ్యాసకర్త సూచనలతో నాటి స్థానిక శాసనసభ్యులు డా. ఆకుల సత్యనారాయణ చొరవ వల్ల రూ.3కోట్ల వ్యయంతో (75లక్షల ఎంపీ నిధులు,  రెండు కోట్ల సిఎం నిధులు, 30 లక్షలు కార్పొరేషన్‌ నిధులు) నూతన భవనం సమకూరింది. నిధులు సమకూర్చడంలో డా. ఆకుల వారి కృషి కొనియాడదగింది. కేవలం భవనం సమకూరడమే కాదు, నిత్యం 250, 300 మంది విద్యార్థులతో పరిశోధకులతో గ్రంథాలయం కళకళలాడుతోంది.


ప్రాచీన గ్రంథాలకు, పత్రికలకు శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం నిలయం. వాటిని డిజిటలైజేషన్‌ ద్వారా భద్రపరచాలని డా. ఆకుల సత్యనారాయణను కోరగా, సొంత నిధులతో పరికరాలు, జీతాలు సమకూర్చారు. ఇప్పటికి సుమారు 20వేల గ్రంథాలు, పత్రికలను డిజిటలైజ్‌ చేశాం. కరోనా ఉపద్రవం తగ్గిన తరువాత మిగిలిన పుస్తకాలను కూడ డిజిటలైజ్‌ చేస్తాం. దానికి కూడా డా. సత్యనారాయణ నిధులు సమకూరుస్తానని మాటిచ్చారు. బెంగళూరు ‘మనసు ఫౌండేషన్‌’ ప్రతి అంశంలోనూ డా. ఎం.వి. రాయుడు, వారి మిత్రబృందం సహకారాన్ని అందజేస్తున్నారు. వెబ్‌సైట్‌కు అనుగుణంగా కేటలాగ్‌ తయారవుతున్నది.


పోటీ పరీక్షలకు చదివే విద్యార్థుల సంఖ్య పెరగడంతో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (గుడా) నుంచి మాజీ ఎపిపిఐసి చైర్మన్‌ శీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్‌ ప్రసాదుల హరనాథ్‌ కృషి వల్ల 72 లక్షల నిధులతో ఒక అంతస్తు నిర్మాణమవుతున్నది. గ్రంథాలయ సుందరీకరణకు, బాలల గ్రంథాలయం ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చారు. అది కూడ త్వరలో ప్రారంభం కానుంది. 


ఇటీవల రాష్ట్రప్రభుత్వం వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంటు అవార్డును శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయానికి ప్రకటించింది. 10 లక్షల రూపాయలు, జ్ఞాపిక, సర్టిఫికెట్‌ వచ్చే నెలలో అందజేయబోతున్నట్లు ప్రకటించింది. గ్రంథాలయ అభివృద్ధి విషయంలో లైబ్రేరియన్‌ ఆర్‌సిహెచ్‌ వేంకటరావు, సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారు.

డా. అరిపిరాల నారాయణరావు

విశ్రాంత ఉపన్యాసకుడు

Updated Date - 2021-07-16T08:10:04+05:30 IST