రోడ్డుపై గుంత, ఆర్టీసీ బస్సు అతి వేగం.. మహిళ ప్రాణాలను బలిగొన్నాయి

ABN , First Publish Date - 2022-06-30T06:33:42+05:30 IST

రోడ్డుపై గుంత, ఆపై ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

రోడ్డుపై గుంత, ఆర్టీసీ బస్సు అతి వేగం..  మహిళ ప్రాణాలను బలిగొన్నాయి
అరుణ మృతదేహం

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 29:  రోడ్డుపై గుంత, ఆపై ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. అలిపిరి ఎస్‌ఐ ఇమ్రాన్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి ఆటోనగర్‌కు చెందిన తుపాకుల అరుణ(40) రేణిగుంట ఎస్టేట్‌లో పనిచేస్తోంది. బుధవారం ఆమె విధులకు హాజరయ్యేందుకు స్కూటీపై ఇంటినుంచి ఎస్టేట్‌కు బయలుదేరింది. నారాయణాద్రి హాస్పిటల్‌ సమీపంలో వెళుతుండగా రోడ్డుపై  గుంత ఉండటంతో ఆమె వాహన వేగాన్ని తగ్గించింది. ఇంతలో వెనుకే వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అరుణ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. అరుణ బస్సు వైపు పడిపోవడంతో తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లిపోయాయి. ఈ దుర్ఘటనలో అరుణ అక్కడికక్కడే మృతిచెందింది. అలిపిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అరుణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఎస్‌ఐ ఇమ్రాన్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అరుణ భర్త సుబ్రహ్మణ్యం కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఇద్దరు పిల్లలను ఆమె పోషిస్తూ వస్తోంది. అరుణ మృతితో వారు అనాథలుగా మిగిలారు.

Updated Date - 2022-06-30T06:33:42+05:30 IST