Abn logo
Apr 22 2021 @ 05:15AM

పంట బోదెలోకి బస్సు బోల్తా

  • బస్సులో 28 మంది ప్రయాణికులు 
  • స్వల్పగాయాలతో అందరూ క్షేమం
  • కృష్ణాజిల్లా మానికొండలో ప్రమాదం 


ఉంగుటూరు, ఏప్రిల్‌ 21: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి పంటబోదెలోకి వెళ్లి బోల్తాపడింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉంగుటూరు పోలీసుల కథనం ప్రకారం గుడివాడ డిపోకు చెందిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ నుంచి 28 మంది ప్రయాణికులతో గుడివాడకు బయలుదేరింది. మానికొండ గ్రామం దాటాక సమాధుల సమీపంలో ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని తప్పించబోయి డ్రైవర్‌ బస్సును రోడ్డు అంచుకు పోనిచ్చాడు.


రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంటబోదెలోకి వెళ్లి బోల్తాపడింది. ఈ పరిణామంతో భయకంపితులైన ప్రయాణికులు పెద్దపెట్టున హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తూ అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఉంగుటూరు హెడ్‌కానిస్టేబుల్‌ అబ్దుల్‌ సత్తార్‌, ఇతర సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను వేరే బస్సులో ఎక్కించి గమ్యస్థానాలకు పంపించారు. అనంతరం క్రేన్‌సాయంతో బస్సును బయటికి తీశారు.

Advertisement