ప్రజలపై భారం

ABN , First Publish Date - 2022-01-26T04:09:22+05:30 IST

రాష్ట్రంలో భూముల ధరలు మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధం చేయడంతో ప్రజలపై భారం పడనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసింది.

ప్రజలపై భారం
మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

- భూముల ధరలు పెంచేందుకు రంగం సిద్ధం
- గణనీయంగా పెరగనున్న రిజిస్ట్రేషన్‌ చార్జీలు
- రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం

మంచిర్యాల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల ధరలు మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధం చేయడంతో ప్రజలపై భారం పడనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువను పెంచ బోతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలతోపాటు రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. భూముల మార్కెట్‌ ధరలను ఆర్నెళ్ల కిత్రమే పెంచిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ పెంచాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జూలైలో మార్కెట్‌ ధరలు 30 నుంచి 50 శాతం మేర పెరిగాయి.  మళ్లీ మార్కెట్‌ విలువలు పెరిగితే ముఖ్యంగా సామాన్యులు, మధ్య తరగతి వారిపై మరింత భారం పడే పరిస్థితులు ఉన్నాయి. కరోనా కారణంగా గత రెండు సంవత్స రాలుగా రియల్‌ ఎస్టేట్‌ రంగం అతలాకుతలం కాగా, ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు, భూముల క్రయ విక్రయాలు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటా యని ఆ రంగంపై ఆధారపడ్డవారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలు ఇక ఆస్తుల కొనుగోలు చేసేందుకు ముందుకు రారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ధరల పెరుగుదల ఇలా..
ప్రభుత్వం నిర్ణయం మేరకు భూములు, స్థలాల విలువలు పెరిగితే రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా అదే నిష్పత్తిలో పెరుగుతాయి. ఉదాహరణకు మంచిర్యాల మున్సిపాలిటీలో 200 చదరపు గజాల స్థలానికి గజం ఒక్కంటికి మార్కెట్‌ విలువ రూ. 1,750 ఆధారంగా మొత్తం రూ. 3,50,000 ఉంటుంది. స్థలం ధరపై..
స్టాంప్‌ డ్యూటీ 5.5 శాతం కింద రూ. 19,250,
ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5 శాతం     రూ. 5,250,
రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 0.5 శాతం  రూ. 1,750,
యూజర్‌ చార్జీలు                రూ. 500,
మ్యూటేషన్‌ చార్జీలు             రూ. 1000
            ------------------------
              మొత్తం రూ. 27,750
            -----------------------
ప్రభుత్వ నిర్ణయం మేరకు 30 శాతం ధరలు పెంచితే గజానికి కనీసం రూ. 1,750పై రూ. 2,275 అవుతుంది. దాని ప్రకారం.. 200 చదరపు గజాల స్థలం విలువ రూ. 4,55,000 అవుతుంది. దానిపై..
స్టాంప్‌ డ్యూటీ             -రూ. 25,025
ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ          -రూ. 6,825
రిజిస్ట్రేషన్‌ చార్జీలు           -రూ. 2,275
యూజర్‌ చార్జీలు            -రూ. 500
మ్యూటేషన్‌ రుసుము           -రూ. 1000
            ----------------------------
                  మొత్తం ధర రూ. 35,625
            --------------------------------
అలాగే 50 శాతం ధరలు పెంచితే గజానికి కనీసం రూ. 1,750పై రూ. 2,625 అవుతుంది. దాని ప్రకారం 200 చదరపు గజాల స్థలం విలువ రూ. రూ. 5,25,000 అవుతుంది. దానిపై...
స్టాంప్‌ డ్యూటీ 5.5 శాతం కింద రూ.  28,875
ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5 శాతం     రూ. 7875
రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 0.5 శాతం  రూ. 2625
యూజర్‌ చార్జీలు                రూ. 500,
మ్యూటేషన్‌ చార్జీలు             రూ. 1000
                                       
                               ------------------------
                          మొత్తం రూ. 40,875
                            ------------------------
అంటే మార్కెట్‌ విలుల చదరపు గజం ఒక్కంటికి రూ. 1,750 ఉన్న చోట ప్రస్తుతం రూ. 27,750 చార్జీలు అవుతుండగా 30 శాతం పెంచితే రూ. 35,625, అదే 50 శాతం పెంచితే రూ. 40,875 చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.  ఈ క్రమంలో ప్రజలపై మోయలేని భారం పడుతుంది.


ప్రభుత్వ నిర్ణయం సరికాదు..
- వూడెం వెంకటస్వామి, తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ అసోసియేయన్‌ జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం భూముల ధరలను పెంచాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఆరు నెలల కాలంలో మళ్లీ భూముల ధరలు పెంచుతున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. కొవిడ్‌ దెబ్బ నుంచి కోలుకోకముందే ఇలా ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్లాట్లు కొనుగోలు చేసేవారు ఉండరు. తద్వారా ఆ రంగంపై ఆధారపడ్డ లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు.

రిజిస్ట్రేషన్లు తగ్గే అవకాశం..
విజయ్‌కుమార్‌, డాక్యుమెంట్‌ రైటర్‌

భూముల ధరలు పెంచితే రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ప్రజలపై మోయలేని భారం పడింది. మళ్లీ ధరలు పెంచితే రిజిస్ట్రేషన్లకు ఎవరూ ముందుకు రారు. కొవిడ్‌ కారణంగా డబ్బులు ఆచితూచి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇప్పుడు భూముల ధరలు పెంచితే భూముల క్రయ, విక్రయాలకు ప్రజలు ముందుకు రారు.

Updated Date - 2022-01-26T04:09:22+05:30 IST