బార్‌లపై భారం

ABN , First Publish Date - 2020-09-22T07:51:08+05:30 IST

జిల్లాలోని పట్టణాలు, నగరాలను విభజించి మూడు విధాలుగా స్లాబులు నిర్ణయించారు. ఆ మేరకు ఫీజు చెల్లిస్తేనే బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి జారీ

బార్‌లపై భారం

భారీగా పెరిగిన లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు

వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ

జనాభా దామాషా ప్రకారం మూడు స్లాబులుగా ధరవతు

వ్యాపారంలో నష్టపోతాం అంటున్న నిర్వాహకులు


(కాకినాడ, ఆంధ్రజ్యోతి) 

జిల్లాలోని పట్టణాలు, నగరాలను విభజించి మూడు విధాలుగా స్లాబులు నిర్ణయించారు. ఆ మేరకు ఫీజు చెల్లిస్తేనే బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి జారీ చేయనుంది. ఇందులో భాగంగా 50వేల జనాభా కలిగిన పట్టణంలో బార్‌ నిర్వహణ లైసెన్స్‌ ఫీజు రూ.1,41,439, రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.5,65,755గా నిర్ణయించారు. దీంతో ఆ జనాభా కలిగిన మునిసిపాలిటీలో బార్‌ నిర్వహించాలంటే మొత్తం రూ.7,07,194 ప్రభుత్వానికి చలానా రూపంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం ఇదే జనాభా దామాషా కలిగిన ప్రాంతంలో బార్‌ నిర్వహించ డానికి లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు మొత్తం కలిపి ఏడాదికి రూ.4 లక్షలు చెల్లించారు.


ఇప్పుడు మరో రూ.3 లక్షలు పెరగడంతో వ్యాపారులు ఆసక్తి కనబరచట్లేదు. పైగా ఇప్పుడు రూ.7 లక్షలు చెల్లిస్తే కేవలం జూన్‌ 30 వరకే బార్ల నిర్వహణకు అనుమతి ఉంటుందా, లేక కనీసం రెండేళ్లయినా ఈ ఫీజుతో కానిచ్చే స్తారా అనేది స్పష్టత లేకపోవడంతో వ్యాపారం చేయాలా, వద్దా అనే మీమాంసలో వ్యాపారులు తర్జనభర్జన పడుతున్నారు. అలాగే 50,001 నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతా ల్లో బార్ల నిర్వహణకు లెసెన్స్‌ ఫీజు రూ.1,41,439, రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.12,72,949 మొత్తం రూ.14,14,388 చలానా తీయాల్సి ఉంటుంది. అయితే కాకినాడ, రాజమహేంద్రవరంల్లో ఐదు లక్షల జనాభా లేదు. దీంతో ఈ రెండు నగరాల్లో బార్‌ తెరవాలంటే నిర్వాహకుడు రూ.14 లక్షలు పెట్టుబడి పెట్టక తప్పదు. ఈ మొత్తం కూడా భారమేనని, గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు పెంచిన ఫీజులు 40 శాతం అధికంగా ఉన్నాయని పలువురు వ్యాపారులు చర్చించుకుంటున్నారు. 


కొవిడ్‌ ఆంక్షలు అదనం 

బార్ల నిర్వహణకు పెంచిన ఫీజులతో పాటు, అదనంగా కొవిడ్‌ ఫీజు రూపేణా మరో 20శాతం ఫీజు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ప్రతీ బార్‌లో గేటు బయట సెక్యురిటీ సిబ్బంది వద్ద శానిటైజర్‌ బాటిళ్లు, థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.  బార్‌లోకి వెళ్లే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి, చేతులు శుభ్రం చేసుకున్నాక మాత్రమే లోపలికి అనుమతించాలని సూచించింది. మద్యం సేవించే వారికి ఏర్పాటుచేసే  టేబుళ్లను భౌతిక దూరం మార్గనిర్దేశకాల ప్రకారం  అమర్చాలని, ప్రతీ గంటకు బార్‌ను శానిటైజ్‌ చేయాలని ఆదేశించింది. హైజెనిక్‌ వాతావరణంలో బార్లు నిర్వహించాలని, ఎస్‌ఈబీ సిబ్బంది తరచూ తనిఖీలు చేస్తారని, బార్ల యాజమాన్యాలు సహకరించాలని జీవోలో స్పష్టం చేసింది. 

Updated Date - 2020-09-22T07:51:08+05:30 IST