సంక్షోభ సుడిలో జీవన భారతం

ABN , First Publish Date - 2020-05-26T09:23:20+05:30 IST

స్వతంత్ర భారతదేశ ప్రస్థానం తొలి నాటినుంచి తరచు కష్టాల బాటలో సాగింది. దేశ విభజన కలుగజేసిన యాతనలు; 1960 దశకపు కరువుకాటకాలు, సరిహద్దు యుద్ధాలు; 1970ల్లో ఇందిరాగాంధీ ‘చీకటిరోజుల’ పాలన; 1980ల తుదినాళ్ళలోనూ,..

సంక్షోభ సుడిలో జీవన భారతం

కరోనా విపత్తు వేళ భారతీయ వైద్య వ్యవస్థ తన సామర్థ్యానికి మించిన బరువు బాధ్యతలను మోస్తోంది; భారత ఆర్థిక వ్యవస్థ అపాయంలో పడింది; భారతీయ సమాజం కుల, మత, వర్గ ఇత్యాది సంకుచితత్వాల ప్రాతిపదికన విభజితమై బలహీనపడింది; భారత సమాఖ్య విధానం ఇంతకుముందుకంటే దుర్బలమైపోయింది; భారత రాజ్యం అంతకంతకూ నిరంకుశాధికార వ్యవస్థగా పరిణమిస్తోంది. ఈ కారణాల సమష్టి ప్రభావమే బహుశా కొవిడ్ -౧9ను దేశ విభజన దరిమిలా స్వతంత్ర భారతదేశ మహా సంక్షోభంగా చేసింది. దీనిని అధిగమించేందుకు మన పురానవ నాగరికతా విజ్ఞత, మన సమస్త వనరులు, మనలో ప్రతి ఒక్కరి మానవతా సంవేదన ఎంతైనా అవసరం. 


స్వతంత్ర భారతదేశ ప్రస్థానం తొలి నాటినుంచి తరచు కష్టాల బాటలో సాగింది. దేశ విభజన కలుగజేసిన యాతనలు; 1960 దశకపు కరువుకాటకాలు, సరిహద్దు యుద్ధాలు; 1970ల్లో ఇందిరాగాంధీ ‘చీకటిరోజుల’ పాలన; 1980ల తుదినాళ్ళలోనూ, 1990ల తొలి నాళ్ళలోనూ మతతత్వ అల్లర్ల గురించి ఆలోచించినప్పుడు ఆవేదన ఆవహించదూ? ఇప్పుడు మళ్ళీ కష్టకాలం దాపురించింది. ప్రస్తుత సంకటాలు, సవాళ్ళు ఇంతకు మందెన్నడూ సంభవించనవి. కారణమేమిటి? కొవిడ్-19. ఈ మహమ్మారి కనీసం ఆరు ప్రత్యేక సంక్షోభాలను సృష్టించింది. 


స్పష్టంగా కన్పిస్తున్న మొదటి ఉపద్రవం వైద్య సంక్షోభం. కరోనా వైరస్ బారిన పడినవారి కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, ఇప్పటికే సామర్థ్యానికి మించి బరువు బాధ్యతలను మోస్తున్న ఆరోగ్య భద్రతా వ్యవస్థపై ఒత్తిడి అధికమవుతోంది. అదే సమయంలో, మహమ్మారిని నియంత్రించడంలో సకల వైద్య నిపుణులు నిమగ్నమవ్వడం వల్ల ఇతర ప్రధాన రోగాలనుంచి ఉపశమనం కలిగించవలసిన బృహత్తర బాధ్యతలు ఉపేక్షకు గురవుతున్నాయి. క్షయ, హృద్రోగాలు, రక్తపోటు మొదలైన రుగ్మతలతో బాధపడుతున్న సంఖ్యానేక భారతీయులకు డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు; ఆసుపత్రి సేవలు అసాధ్యమైపోతున్నాయి. మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే ప్రతినెలా ఈ దేశంలో జన్మించే లక్షలాది పసిబిడ్డల యోగక్షేమాలకు భరోసా కొరవడడం. 


రెండోది ఆర్థిక సంక్షోభం. ఇది అందరికీ అనుభవేక వేద్యమేనని మరి చెప్పనవసరం లేదు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న జౌళి పరిశ్రమలు, విమానయానం, పర్యాటకం, ఆతిథ్య రంగాలు మహమ్మారి మూలంగా కుదేలయ్యాయి. అనియత రంగంపై లాక్‌డౌన్ ప్రభావం మరింత మిక్కుటంగా ఉన్నది. కోట్లాది కూలీలు, విక్రేతలు, చేతి వృత్తుల వారికి ఎటువంటి పని లేకుండాపోయింది. ఆదాయం కొరవడి ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. నిరుద్యోగిత రేటు 2020 మార్చి తొలివారంలో 7 శాతంగా ఉండగా అది ఇప్పుడు దాదాపు 25 శాతానికి పెరిగింది. 


మానవసేవే మాధవ సేవ అని మన ధార్మిక చరిత్ర ఉద్ఘోషిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఎలాంటి మానవ సేవా వ్రతులం? వందలాది మైళ్ళ దూరంలో ఉన్న స్వస్థలాలకు కాలినడకన పయనమైన లక్షలాది వలస కార్మికుల దృశ్యాలు కరోనా పీడిత భారతదేశానికి విస్పష్టంగా దర్పణం పట్టడం లేదూ? చెప్పవచ్చినదేమిటంటే ఇప్పుడు మనం ఒక మహా మానవతా సంక్షోభంలో ఉన్నాం. ఇది మనం ఎదుర్కొంటున్న మూడో ఉపద్రవం. మహమ్మారిని నియంత్రించేందుకు తాత్కాలికంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడం అనివార్యమూ, సహేతుకమే. అయితే ఇటువంటి అసాధారణ చర్యను చేపట్టే ముందు ఆ విషయమై ప్రజలను సరైన విధంగా అప్రమత్తం చేయవద్దూ? లాక్‌డౌన్ పర్యవసానాలకు సంసిద్ధమయ్యేందుకు వారికి తగు వ్యవధినివ్వవలసిన అవసరం లేదూ? దురదృష్టవశాత్తు మన పాలకులు ఈ వాస్తవాలను విస్మరించారు.


మన ప్రజల జీవనరీతుల గురించి ఏ మాత్రం ప్రాథమిక అవగాహన ఉన్న వారికైనా మన తోటి కోట్లాది భారతీయులు వలస జీవులని, జీవనోపాధికి కన్న ఊళ్ళకు సుదూరంలోని పట్టణాలు, నగరాలకు అందునా కుటుంబాలను విడిచి, వలస వచ్చిన వారనే యథార్థం అవగతమవుతుంది. మరి ప్రధానమంత్రి, ఆయన సలహాదారుల దృష్టి నుంచి ఈ వాస్తవం ఎలా కనుమరుగయింది? మహారాజశ్రీ పాలకులకు ఈ ప్రజా జీవిత వాస్తవం తెలియదనేది ముమ్మాటికీ విశ్వసించలేని విషయం. దేశప్రజలకు కేవలం నాలుగు గంటలు కాకుండా వారం రోజుల వ్యవధినిచ్చి వున్నట్టయితే అందుబాటులో ఉన్న రైళ్ళు, బస్సుల ద్వారా వారు తమ స్వస్థలాలకు సురక్షితంగా వెళ్ళిపోయివుండేవారు. 


నాలుగో సంక్షోభం అస్పష్ట మానసిక సంక్షోభం. మొదటి మూడు సంక్షోభాల వలే ఇది స్పష్టంగా కన్పించడం లేదు. అయితే ఈ సంక్షోభ తీవ్రతను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎందుకని? ఉద్యోగాలు కోల్పొయిన వారిలో తమకు తిరిగి ఉద్యోగాలు రాగలవనే నమ్మకం కొరవడింది; కాలినడకన స్వస్థలాలకు వెళ్ళక తప్పనివారిలో తాము వదిలివేసిన పట్టణాలు, నగరాలకు తిరిగి రాగలమనే విశ్వాసం ఎంత మాత్రం వ్యక్తం కావడం లేదు. భారత సమాఖ్య విధానం బలహీపడింది. ఇది ఐదో సంక్షోభం. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద లాక్‌డౌన్‌ను విధించారు. ఈ చట్టం సాకుతో కేంద్రం ఎక్కడలేని అధికారాలు చెలాయిస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కరోనా కట్టడికి తగు చర్యలు చేపట్టేందుకు అవసరమైన స్వతంత్ర ప్రతిపత్తిని రాష్ట్రాలకు ఇవ్వడానికి కేంద్రం తొలుత నిరాకరించింది. తనకు తోచిన విధంగా ప్రకటనలు చేస్తూ, రాష్ట్రాలకు పరస్పర విరుద్ధ ఆదేశాలు జారీచేయడం కేంద్రానికి పరిపాటి అయింది. 


భారత ప్రజాస్వామ్యం దుర్బలమయింది. ఇది ఆరో సంక్షోభం. ఉపా మొదలైన భయానక చట్టాల కింద మేధావులు, రాజకీయ, సామాజిక క్రియాశీలురను అరెస్ట్ చేస్తున్నారు. ఆర్డినెన్స్‌లు జారీ చేస్తున్నారు. పార్లమెంటులో చర్చించకుండానే కీలక విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురించకూడదని మీడియా సంస్థల యాజమాన్యాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇక ప్రభుత్వ యంత్రాంగమూ, పాలక పక్షం నేతలు ప్రధానమంత్రి వ్యక్తి పూజను ముమ్మరం చేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో ఒక్క దేవకాంత్ బారువా మ్రాతమే ‘ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిర’ అని ప్రలాపించాడు. అయితే ఇప్పుడు కేబినెట్ మంత్రులందరూ ప్రధానమంత్రి భజన చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు! 


కరోనా విపత్తు వేళ భారతీయ వైద్య వ్యవస్థ తన సామర్థ్యానికి మించిన బరువు బాధ్యతలను మోస్తోంది; భారత ఆర్థిక వ్యవస్థ అపాయంలో పడింది; భారతీయ సమాజం కుల, మత, వర్గ ఇత్యాది సంకుచితత్వాల ప్రాతిపదికన విభజితమై బలహీనపడింది; భారత సమాఖ్య విధానం ఇంతకు ముందుకంటే దుర్బలమైపోయింది; భారత రాజ్యం అంతకంతకూ నిరంకుశాధికార వ్యవస్థగా పరిణమిస్తోంది... ఈ కారణాల సమష్టి ప్రభావమే బహుశా కొవిడ్ -19ను దేశ విభజన దరిమిలా స్వతంత్ర భారతదేశ మహా సంక్షోభంగా చేసింది. 


ఈ అసాధారణ దుష్కర పరిస్థితులను ఒక జాతిగా మనం ఎలా అధిగమించాలి? మన దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు (పరస్పర సంబంధిత) సమస్యల బహుముఖ రీతులను ప్రభుత్వం తొట్ట తొలుత స్పష్టంగా గుర్తించాలి. నెహ్రూ, పటేల్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా వున్నది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో సమస్యలు సంక్లిష్టతను అర్థం చేసుకున్న ఆ మహా నాయకులు డాక్టర్ అంబేడ్కర్ లాంటి ప్రత్యర్థికి కేంద్ర కేబినెట్‌లో సముచిత స్థానం కల్పించారు. ఆ తరహా జాతీయ ప్రభుత్వం ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. అయితే సమస్యలపై సమగ్ర అవగాహన, పాలనా దక్షత ఉన్న ప్రతిపక్ష నాయకులతో ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుండాలి.


అర్థ శాస్త్రం, వైజ్ఞానిక సాంకేతిక రంగాల, ప్రజారోగ్య నిపుణులను గౌరవించి, వారి సలహాలు, సూచనలు స్వీకరించడాన్ని ప్రధానమంత్రి నేర్చుకోవాలి. సంభావ్య నాటకీయ ప్రభావాన్ని ఆశించి తోచిన విధంగా ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే పద్ధతికి పాలకులు స్వస్తి చెప్పితీరాలి. కేంద్ర ప్రభుత్వమూ, జాతీయ పాలకపక్షమూ బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలను వేధింపులకు గురిచేసే వైఖరులను విడనాడాలి. సివిల్ సర్వీసులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలకు సంపూర్ణ స్వతంత్ర ప్రతిపత్తినివ్వాలి. అధికారంలో ఉన్నవారి ప్రయోజనాలకు అనుగుణంగా ఆ వ్యవ్థలను ఉపయోగించుకోవడాన్ని మానుకోవాలి. 


 ఈ దేశ గతమూ, వర్తమానంపై అవగాహనతో చేసిన సూచనలివి. ఇది పాక్షిక జాబితా మాత్రమే. కొవిడ్-19తో మనం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి ఏ విధంగానూ సామాన్యమైనది కాదు. అందుకు విరుద్ధంగా భారత గణతంత్ర రాజ్య చరిత్రలోనే అది ఒక పెను సవాల్ అవ్వనున్నది. దీనిని అధిగమించేందుకు మన పురానవ నాగరికతా విజ్ఞత, మన సమస్త వనరులు, మనలో ప్రతి ఒక్కరి మానవతా సంవేదన మనకు ఎంతైనా అవసరం.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2020-05-26T09:23:20+05:30 IST