ఇంటర్‌ పుస్తకాల భారం దేవుడిపైనే!

ABN , First Publish Date - 2022-07-02T08:33:56+05:30 IST

ఇంటర్‌ పుస్తకాల భారం దేవుడిపైనే!

ఇంటర్‌ పుస్తకాల భారం దేవుడిపైనే!

పుస్తక ప్రసాదం కింద ఇవ్వాలని టీటీడీకి విజ్ఞప్తి

16 కోట్లు ఇవ్వలేక చేతులెత్తేసిన ప్రభుత్వం

కొత్త కాలేజీల ఏర్పాటుపైనా గందరగోళం

హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్లపై స్పష్టత కరువు

అయినా అక్కడి విద్యార్థులకు టీసీలు ఇవ్వని హెచ్‌ఎంలు

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలు


అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): రూ.16 కోట్లు ఖర్చుచేసి ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని ప్రభుత్వం.. ఆ భారాన్ని తిరుమల వెంకన్నపై వేసేసింది. ‘పుస్తక ప్రసాదం’ అనే పాత పథకాన్ని పునరుద్ధరించి పుస్తకాలు పంపాలని టీటీడీని కోరుతోంది. ఈ మేరకు ఇంటర్‌ విద్యాశాఖ టీటీడీకి లేఖ రాసినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఇంటర్‌ కళాశాలలు తెరుచుకున్నాయి. కానీ  పుస్తకాల ప్రింటింగ్‌ ప్రక్రియ ఇంకా టెండర్ల ఖరారు దశలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పట్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలో గురుకులాలు సహా మొత్తం 472 ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉన్నాయి. వాటికి పుస్తకాలు పంపిణీ చేయాలంటే సుమారు రూ.16 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆ ఖర్చుకు వెనకాడుతున్న ప్రభుత్వం మొత్తం భారాన్ని టీటీడీపై వేయాలని చూస్తోంది. సుమారు పదేళ్ల కిందట టీటీడీ పుస్తక ప్రసాదం పథకం కింద ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసేది. కానీ ఆ తర్వాత ప్రభుత్వ నిధులతోనే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. కళాశాలలకు సెలవులు ఇవ్వగానే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ప్రింటింగ్‌కు ఆర్డర్‌ ఇస్తే తరగతులు మొదలయ్యే సమయానికి విద్యార్థులకు పుస్తకాలు అందేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ విద్యా సంవత్సరంలో పుస్తకాలు ఎప్పటికి అందుతాయో స్పష్టత లేకుండా పోయింది. దీంతో పాత పుస్తకాలతోనే విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కళాశాలల ఏర్పాటుపైనా గందరగోళం

ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ విద్యపై ప్రభుత్వం ప్రయోగాలకు దిగింది. సరైన వసతులు లేకపోయినా, బోధించే అధ్యాపకులు కరువైనా కొత్తగా 800కు పైగా జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అందులో 292 బాలికల కళాశాలలు ఉంటాయని తెలిపింది. అయితే బాలికల కళాశాలల ఏర్పాటులో గందరగోళం నెలకొంది. పలుచోట్ల బాలురు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని బాలికల కళాశాలలుగా మార్చడమే ఇందుకు కారణం. దీంతో అక్కడి బాలురు వేరే కాలేజీలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఉర్దూ కాలేజీలను కూడా బాలికల కళాశాలలుగా మార్చేసి అస్తవ్యస్తం చేశారు. మరోవైపు ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేసి ఇంటర్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ ఇంతవరకూ అక్కడ మౌలిక వసతులు లేవు. ముఖ్యంగా ఇంటర్‌కు బోధించే ప్రావీణ్యం ఉన్న అధ్యాపకులు అందుబాటులో లేరు. ఉన్నత పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇస్తామని చెప్పినా, ఇంతవరకూ దానిపై చర్యలు లేవు. మరోవైపు హైస్కూళ్ల అప్‌గ్రెడేషన్‌పై చర్యలు చేపట్టకముందే అప్‌గ్రెడేషన్‌కు ఎంపిక చేసిన అనేక ఉన్నత పాఠశాలల్లో పది పూర్తయిన విద్యార్థులకు ఇంటర్‌ ఇక్కడే చదవాలంటూ టీసీలు ఇవ్వడం లేదు. టీసీ తీసుకోకుండా వేరే కాలేజీకి వెళ్లకుండా అక్కడే ఉండిపోతే... చివరికి ఏవైనా కారణాలతో అక్కడ ఇంటర్‌ లేదంటే విద్యార్థులు ఏంచేయాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


ప్రైవేటు కంటే వెనక

ఇప్పటికే ఇంటర్‌ విద్యలో ప్రభుత్వ కళాశాలలకు ఆదరణ తగ్గిపోయింది. చాలా వరకు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ఖర్చైనా ప్రైవేటులోనే చదివించడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తే ఆదరణ పెరిగే అవకాశం ఉంది. పాఠ్య పుస్తకాలు అందకపోవడం, అధ్యాపకుల కొరత, వసతుల లేమి లాంటి సమస్యలు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ఇంకా దిగజారుస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

Updated Date - 2022-07-02T08:33:56+05:30 IST