Grama, Ward Sachivalayam ఉద్యోగులకు గడ్డు పరిస్థితులు.. జీతం మూరెడు.. ఒత్తిడి బారెడు!

ABN , First Publish Date - 2021-08-25T05:00:11+05:30 IST

సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఇటీవల పరిణామాలు వారిని కుంగదీస్తున్నాయి. జీతం చూస్తే స్వల్పం...ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటోందని భావిస్తున్నారు.

Grama, Ward Sachivalayam ఉద్యోగులకు గడ్డు పరిస్థితులు.. జీతం మూరెడు.. ఒత్తిడి బారెడు!

  •  కొలువు భారం!
  • ముప్పేట ఒత్తిళ్లు
  • సమీక్షలు, క్షేత్రస్థాయి సందర్శనలతో బిజీబిజీ
  • కత్తిమీద సాములా విధులు
  • ప్రభుత్వ అస్పష్ట విధానాలతో అయోమయం
  • ఉద్యోగాలపై అయిష్టత పెంచుకుంటున్న వైనం


సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఇటీవల పరిణామాలు వారిని కుంగదీస్తున్నాయి. జీతం చూస్తే స్వల్పం.. ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటోందని భావిస్తున్నారు. మండల స్థాయి అధికారుల నుంచి గ్రామస్థాయిలో వీఆర్వో వరకూ వారిపై అన్నిరకాలుగా ఒత్తిడి పెంచుతున్నారు. సమీక్షలు, క్షేత్రస్థాయిలో పరిశీలనలు అంటూ క్షణం తీరిక లేకుండా గడపాల్సి వస్తోంది. మండల అధికారులు పిలిచిన వెంటనే హాజరుకావాలి. అటు సచివాలయాల్లో రోజువారీ విధులు నిర్వహించాలి. అసలు తాము ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తున్నామో వారికే తెలియని పరిస్థితి నెలకొంది.


నెల్లిమర్ల, ఆగస్టు 24 : ప్రభుత్వ అస్పష్ట విధానాలతో సచివాలయ ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. అధికారుల ముప్పేట ఒత్తిడితో చాలామంది ఉద్యోగంపై విసుగు చెందుతున్నారు. తప్పక కొందరు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. కుటుంబసభ్యుల ఒత్తిడితో నెట్టుకొస్తున్నారు. నెల్లిమర్ల మూడో వార్డు సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ముప్పిడి చిరంజీవి బలవన్మరణం వెనుక అధికారుల ఒత్తిడే కారణమన్న ఆరోపణలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అటు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌తో పాటు డిజిటల్‌ అసిస్టెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడంతో అతను కొద్దినెలలుగా ఇబ్బంది పడుతున్నాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. మనస్తాపంతోనే ఆత్మహత్య నిర్ణయానికి వచ్చినట్టు అంతర్గత సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. నెల్లిమర్లలో గతంలో కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. సచివాలయంలో ఓ అధికారి తీరుపై పారిశుధ్య కార్మికులు నిరసన బాట పట్టారు.


రెండేళ్ల కిందట నియామకం 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయాలను(2019 అక్టోబరు2) అందుబాటులోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా 778 సచివాలయాలను ఏర్పాటుచేసింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టి 11 శాఖలకు సంబంధించి సహాయకులను నియమించింది. రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌గా పేర్కొని అంతవరకూ రూ.15,000 వేతనంగా అందించనున్నట్టు ప్రకటించింది. దీంతో బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివిన విద్యార్థులు సైతం సచివాలయ కొలువులు దక్కించుకున్నారు. ఈ ఏడాది అక్టోబరుతో వీరి ప్రొబేషనరీ పీరియడ్‌ పూర్తికానుంది. అయితే ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తొలుత వీరి పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ రాజ్‌ శాఖకు అప్పగించారు. జీతాలకు సంబంధించి డ్రాఫ్టింగ్‌, సెలవుల మంజూరు బాధ్యతను పంచాయతీ కార్యదర్శులు చూశారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి ప్రభుత్వం ఆ బాధ్యతలను వీఆర్వోలకు బదలాయించింది. దీనికితోడు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంట్‌ పరీక్షలను తప్పనిసరి చేసింది. దీనిపై కొంత వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కొంత వరకూ మినహాయింపు ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వం వారికి మరిన్ని బాధ్యతలను అప్పగించింది. సంక్షేమ పథకాలు, పౌరసేవల బాధ్యతలతో సచివాలయ ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని స్థానిక అధికారులు సచివాలయ ఉద్యోగులపై మోపుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగాల్లో కొనసాగడంపై పునరాలోచనలో పడ్డారు.


అప్పుడే చదువు పూర్తిచేసి...

సచివాలయ ఉద్యోగులు అందరూ 30 సంవత్సరాల్లోపు వయసున్న వారే. అప్పుడే ఇంజనీరింగ్‌, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ పూర్తిచేసిన వారు సచివాలయ ఉద్యోగాలు దక్కించుకున్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో వేలాది రూపాయల జీతాలు వచ్చే అవకాశమున్నా ప్రభుత్వ కొలువుగా భావించి సచివాలయాల్లో చేరిపోయారు. తీరా ఇక్కడకు వచ్చిన తరువాత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. జీతం చూస్తే రూ.15,000 కానీ దానికి మించిన పని చేయాల్సి వస్తోంది. సచివాలయాల్లో సరైన వసతులు సైతం లేవు. ఏదో ఊహించుకొని వస్తే..ఏదో జరిగిందన్న అత్మనూన్యతా భావం వారిని వెంటాడుతూ వస్తోంది.  


నైపుణ్య శిక్షణేదీ? 

మహిళా చైల్డ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు (మహిళా పోలీసులు), ఎనర్జీ అసిస్టెంట్‌ (లైన్‌మెన్‌-2)లది వింత పరిస్థితి. ఇటీవలే మహిళా పోలీసులను పోలీస్‌ శాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొన్నిరకాల బాధ్యతలను అప్పగించింది. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను మోపింది. కానిస్టేబుల్‌తో సమానంగా విధులను అప్పగించింది. దీనిపై మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భర్తీచేసినప్పుడు ఒకలా చెప్పి..ఇప్పుడు అదనపు బాధ్యతలు ఎలా అప్పగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎనీర్జీ అసిస్టెంట్‌ (లైన్‌మెన్‌-2)లది వింత పరిస్థితి. ఐటీఐ, ఎలక్ర్టీషియన్‌ పూర్తిచేసిన వారిని లైన్‌మెన్లుగా ఎంపిక చేశారు. సచివాలయాల్లో వీరిని నియమించారు. వీరిపై పర్యవేక్షణ బాధ్యతలను విద్యుత్‌ శాఖ లైన్‌మెన్లకు అప్పగించారు. వీరికి ఎటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వకపోగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ శాఖ అధికారులు వీరితోనే ప్రమాదకర పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇన్ని ఒత్తిడిల మధ్య అన్నివిభాగాలకు చెందిన సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణలో సవాళ్లు ఎదుర్కొంటున్నారు.


Updated Date - 2021-08-25T05:00:11+05:30 IST