Abn logo
Sep 24 2021 @ 01:30AM

సెస్‌కు బకాయిల భారం

 -ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.255 కోట్లు   

  -విడుదల కాని నిధులు 

-2.56 లక్షల విద్యుత్‌ కనెక్షన్లతో అగ్రగామిగా సంస్థ

సిరిసిల్ల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గతంలో చీకటి పడితే నడవలేని పరిస్థితి. సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు పల్లెల్లోనూ అదే కష్టం. ఎక్కడో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఉండే అధికారులకు విద్యుత్‌ సమస్యలను చెప్పుకోలేని దుస్థితి. ఈ చీకట్లను తరిమి వేయాలని యాభై ఏళ్ల క్రితం సిరిసిల్ల ప్రజలందరూ ఒక్కటయ్యారు. విద్యుత్‌ సహకార సంఘాన్ని స్థాపించుకోవడానికి ముందుకొచ్చా రు. అక్టోబరు 31, 1970లో 4,720 మంది సభ్యులతో మొదలైన సెస్‌ (కో-ఆపరేటివ్‌ ఎలిక్ర్టిక్‌ సప్లయీస్‌ సొసైటీ) ఇప్పుడు రెండు లక్షల మంది సభ్యులతో దేశంలోనే అగ్రగామి సహకార విద్యుత్‌ సంస్థగా నిలిచింది. సంస్థ పరిధిలో మారుమూల పల్లెలోనూ విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మారుతు న్న కాలంతోపాటు ఆ వెలుగులకు అవినీతి తోడైంది. 

 మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలతో సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం సతమ తమవుతోంది. ఎన్‌పీడీసీఎల్‌ నుంచి యూనిట్‌ రూ.4.52 పైసలకు కొనుగోలు చేసి సిరిసిల్ల ప్రజల అవసరాలకు విద్యుత్‌  సరఫరా చేస్తోంది. ఇలా సరఫరా చేసిన చార్జీల్లో రూ.45.55 కోట్ల బకా యిలు వినియోగదారుల నుంచి రావాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మరో రూ. 255 కోట్ల బకాయిలు సెస్‌కు భారంగా మారాయి. సిరిసిల్లలోని 36 వేల మరమగ్గాలకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై విద్యుత్‌ సరఫరా చేస్తోంది. పారిశ్రామి కులు ప్రతి నెలా 50 శాతం బిల్లును చెల్లిస్తున్నారు. మరో 50 శాతం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. గడిచినా నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం పవర్‌లూం సబ్సిడీని విడుదల చేయడం లేదు. దీంతో రూ.60 కోట్లకు విద్యుత్‌ సబ్సిడీ బకాయిలు పేరుకు పోయాయి. దీనికి తోడు గ్రామ పంచాయతీ పరిధిలో స్ర్టీట్‌ లైట్లకు సంబంధించిన డబ్బులు రూ.150 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ కూడా రావా ల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సెస్‌ ఎన్‌పీడీసీఎల్‌కు బకాయి పడింది. బకాయిల భారంతో సతమతమ వుతున్న సెస్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.  

యాభై ఏళ్ల ప్రస్థానం 

 సిరిసిల్ల విద్యుత్‌ సరఫరా సహకార సంఘం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. వివిధ దేశాల నుంచి సెస్‌ పనితీరును అధ్యయనం చేయడానికి ప్రతినిధులు వస్తూనే ఉన్నారు.  ప్రస్తుతం వంద కోట్లకు పైగా ఆస్తులను సమకూర్చుకున్న సెస్‌ లాభాల బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. 1970 నవంబరులో అప్పటి సిరిసిల్ల, నేరేళ్ల నియోజకవర్గాల పరిధిలో సెస్‌ సేవలు మొదలయ్యాయి. 

1970లో కేవలం 46 గ్రామాలకు విద్యుత్‌ను అందిస్తే ప్రస్తుతం పూర్తి స్థాయిలో 173 గ్రామాలకు, 150 శివారు పల్లెలకు విద్యుత్‌ సేవలను అంది స్తోంది. 4,720 కనెక్షన్‌లతో ప్రారంభమై ప్రస్తుతం 2,56,959 కనెక్షన్లకు చేరుకుంది. ఇందులో వ్యవసాయ కనెక్షన్‌లు 71 వేల 543 ఉంటే గృహ అవసరాలకు లక్షా 60 వేల 867, కుటీర పరిశ్రమకు 5,752, ఎల్‌టీ పారిశ్రామిక కనెక్షన్‌లు 1341, పవర్‌లూం ఇతర పరిశ్రమల కనెక్షన్‌లు 13,409కు పెరిగాయి. మొదట్లో 132/33కేవీ సబ్‌స్టేషన్‌ ఉండేవి కావు.  ఇప్పుడు ఐదు సబ్‌స్టేషన్‌లను సమకూర్చుకుంది. 33/11కేవీ సబ్‌స్టేషన్‌ ఒకటి ఉంటే ప్రస్తుతం 71కి పెరిగాయి. 11 కేవీ ఫీడర్లు 227, మిక్స్‌డ్‌ 11 కేవీ ఫీడర్లు 161, వ్యవసాయ ఫీడర్లు 48 ఉన్నాయి. 11 కేవీ లైన్లు 6,147, ఎల్‌టీ లైన్లు 8,124కు పెరిగాయి. రాష్ట్రంలో ఏడు విద్యుత్‌ సహకార సంఘాలు ఏర్పడినా వాటిలో సెస్‌ మాత్ర మే అన్ని గ్రామాలను విద్యుదీకరించి అగ్రగామిగా నిలిచింది. ముఖ్యంగా ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో సహకారంతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా 24 నుంచి 48 గంటల్లోనే పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడానికి, పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్లను బాగు చేసుకోవడానికి ప్రత్యేకంగా సెస్‌కు వర్క్‌షాప్‌ ఉంది. గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థకు సంబంధించిన రుణం తీర్చడంతోపాటు  రూ.30 కోట్ల రుణం మంజూరు చేసింది. 

సిరిసిల్ల సెస్‌ వంద కోట్లకు పైగా ఆస్తులను సమకూర్చుకుంది. ఏటా రూ.14 కోట్ల నికర లాభంతో రూ.140 కోట్ల బడ్జెట్‌తో కొనసాగుతోంది. ఏ ప్రభు త్వం ఉన్నా సెస్‌ అవినీతి ఆరోపణల నిగ్గు తేలడం లేదు. దేశంలోనే సహకార రంగంలో అగ్రగామిగా నిలిచిన సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం పై అదే స్థాయిలో గత పాలకవర్గాల తీరుతో అవినీతి ముద్ర పడింది. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడం తో  కలెక్టర్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.