భారం.. భరించలేం!

ABN , First Publish Date - 2022-08-20T09:13:20+05:30 IST

ఉపాధ్యాయులకు ముఖ హాజరు పరికరాలు ఇచ్చే అంశంపై వైసీపీ సర్కారు చేతులెత్తేసింది. టీచర్లు సొంత ఫోన్లలోనే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని హాజరు వేయాలని స్పష్టం చేసింది.

భారం.. భరించలేం!

టీచర్ల ముఖహాజరు పరికరాలపై చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం 

బడికి పది వేలు భరించలేక పాట్లు.. యాప్‌ రూపకల్పనతోనే సరి 

అత్యాధునిక విధానమంటూ ప్రచారం.. బయోమెట్రిక్‌, ఐరిస్‌ మూలకు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు ముఖ హాజరు పరికరాలు ఇచ్చే అంశంపై వైసీపీ సర్కారు చేతులెత్తేసింది. టీచర్లు సొంత ఫోన్లలోనే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని హాజరు వేయాలని స్పష్టం చేసింది. కావాలంటే కొత్త ఫోన్‌ కొనుగోలు కోసం అడ్వాన్స్‌ ఇచ్చి ఆ తర్వాత వారి జీతంలో మినహాయించుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉచిత సలహా ఇచ్చారు. రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వం డివైజ్‌లు కొని ఇవ్వడం జరగని పని అని తేల్చేశారు. ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడకుండానే టీచర్లకు ఆన్‌లైన్‌ హాజరు అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకు ఏం చేయాలన్న కసరత్తు నుంచి పుట్టిందే వ్యక్తిగత ఫోన్లతో ముఖ హాజరు విధానం. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు తీసుకొచ్చిన కొత్త యాప్‌ను అత్యాధునికమైనదిగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. విద్యారంగం, ‘నాడు-నేడు’కు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటూ ఒక్కో పాఠశాలకు రూ.పది వేలు భరించలేక పరికరాలు ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ముఖ హాజరుకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వం డివైజ్‌లు ఇస్తే ఏ తరహా హాజరుకైనా సిద్ధమని ఉపాధ్యాయులు స్పష్టంగా చెబుతున్నా ఈ విషయంలో అడుగు ముందుకు వేయలేక నానా పాట్లు పడుతోంది. ఇప్పటికే పాఠశాలల్లో గతంలో ఇచ్చిన బయోమెట్రిక్‌ యంత్రాలు, ఐరిస్‌ ట్యాబ్‌లను మూలన పడేసి, అప్పట్లో చేసిన రూ.కోట్ల ఖర్చును నిరుపయోగంగా మార్చింది. తమ సొంత ఫోన్లలో హాజరు వద్దని టీచర్లు మొత్తుకుంటున్నా పాఠశాల విద్యాశాఖ చెవికెక్కడం లేదు. ఇప్పటికే ఉన్నవాటిని ఎందుకు వినియోగించడం లేదనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, కొత్త విధానం అంటూ సమర్థించుకుంటోంది. 


పాఠశాలలకు రెండు పరికరాలు

2016కు ముందు పాఠశాలల్లో మాన్యువల్‌ హాజరు విధానం అమల్లో ఉండేది. అప్పటి టీడీపీ ప్రభుత్వం బయోమెట్రిక్‌, ఐరిస్‌ తరహా హాజరును ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 45వేల పాఠశాలలకు బయోమెట్రిక్‌ యంత్రం, ట్యాబ్‌, అందులోకి సిమ్‌కార్డు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వాటినే వినియోగించారు. కరోనా కారణంగా పాఠశాలలు సక్రమంగా నడవకపోవడంతో ఆ పరికరాలు మూలకు చేరాయి. ఆ తర్వాత బడులు పూర్తిస్థాయిలో తెరుచుకున్నా బయోమెట్రిక్‌, ఐరిస్‌ యంత్రాలు పనిచేయకపోవడంతో తిరిగి మాన్యువల్‌ హాజరునే అమలు చేశారు. తిరిగి ఆన్‌లైన్‌ హాజరు ప్రవేశపెట్టాలని ప్రయత్నించినా నిర్వహణ భారంతో వెనక్కి తగ్గారు. అప్పటి నిర్వహణ సంస్థకు బకాయిలు చెల్లించకపోవడం కూడా దీనికి ఓ కారణమనే వాదన కూడా ఉంది. ఈ అంశంలో నయాపైసా ఖర్చు చేయడం ఇష్టంలేని ప్రభుత్వం ముఖ హాజరు అంటూ కొత్త యాప్‌ను రూపొందించింది. ఇందులో యాప్‌ తయారీ, సర్వర్‌ నిర్వహణ భారం మాత్రమే ప్రభుత్వంపై పడుతుంది. డివైజ్‌ల కొనుగోలు, వాటికి ఇంటర్నెర్‌ చార్జీలు, నిర్వహణ వ్యయం అంతా ఆదా అవుతున్నాయి. 


అందుకే టీచర్లు డివైజ్‌లు ఇవ్వాలని ఎంత గగ్గోలు పెడుతున్నా సర్కారు ససేమిరా అంటోంది. కొత్త పరికరాలు కొనాలంటే ఒక్కో పాఠశాలకు రూ.పదివేలు ఖర్చు అవుతుందని మొన్నటి ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో స్వయంగా విద్యాశాఖ మంత్రే చెప్పారు. అంటే 45వేల పాఠశాలలకు రూ.45 కోట్లు అవుతుంది. ఒకవేళ డివైజ్‌లు కొనుగోలు చేసినా అవి మూడేళ్లు దాటి పనిచేయవని, పైగా వాటి నిర్వహణకు ప్రతినెలా డబ్బు కట్టాలని అసలు విషయాన్ని బయటపెట్టారు. అంటే ఆర్థికభారం మోయలేకే ముఖ హాజరు తెచ్చామని పరోక్షంగా చెప్పేశారు. విద్యారంగానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రభుత్వం రూ.45కోట్ల కోసం ఎందుకు వెనకడుగు వేస్తోందని సంఘాలు నిలదీస్తున్నాయి. ప్రభుత్వం భారం తప్పించుకోవడానికి దాన్ని టీచర్లపై మోపుతారా అని ప్రశ్నిస్తున్నాయి. 


ఫోన్‌ నిండా యాప్‌లే 

విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు, బియ్యం, బాత్‌రూమ్‌ల ఫొటోలు, బేస్‌లైన్‌ పరీక్ష... ఇలా ఉపాధ్యాయులు ఇప్పటికే ఐదారు అధికారిక యాప్‌లు వినియోగిస్తున్నారు. విద్యార్థుల హాజరు  యాప్‌లో ఎక్కువ పేర్లు ఉండటంతో మెమొరీ ఎక్కువగా వినియోగమవుతోంది. ఇన్ని యాప్‌లు వాడటంతో కేవలం పాఠశాల కోసమే ఫోన్‌ వాడుతున్నట్లుగా ఉందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ముఖ హాజరు యాప్‌ తప్పనిసరిగా వాడాల్సిందేనని పట్టుబడితే ప్రతి ఉపాధ్యాయుడు వ్యక్తిగత అవసరాలకు మరొక ఫోన్‌ కొనుక్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

Updated Date - 2022-08-20T09:13:20+05:30 IST