మూడు తరాల తెలంగాణ ఉద్యమ వారధి

ABN , First Publish Date - 2021-06-20T05:48:06+05:30 IST

ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సమాజం తన అస్తిత్వ పరిరక్షణ కోసం చేసిన పోరాటాల నుంచి పుట్టి, తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసినాడు. 1948 తరువాత అంటే హైదరాబాద్ సంస్థానం...

మూడు తరాల తెలంగాణ ఉద్యమ వారధి

ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సమాజం తన అస్తిత్వ పరిరక్షణ కోసం చేసిన పోరాటాల నుంచి పుట్టి, తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసినాడు. 1948 తరువాత అంటే హైదరాబాద్ సంస్థానం భారత్ దేశంలో విలీనం అయినంక జరిగిన అనేకానేక పరిణామాల ప్రభావం జయశంకర్ గారి మీద వున్నది. భారతదేశంలో భాగం అయిన తరువాత ఈ ప్రాంతాన్ని పరిపాలించే అధికారం స్థానికులకు దక్క లేదు. ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చిన అధికారుల సాయంతో కొంతకాలం మిలిటరీ, మరి కొంతకాలం అప్పటి భారతదేశ అధికారులు పరిపాలన చేసినారు. పాలనా యంత్రాంగాన్ని నడపడానికి ఆంధ్రా ప్రాంతం నుంచి తెచ్చిన అధికారులకు తెలంగాణపైన అవగాహన లేదు. తెలంగాణ ప్రజల పట్ల ప్రజాస్వామిక దృక్పథంతో వ్యవహరించలేదు. వారు ఇక్కడి వారిని భాష రాని, లోక జ్ఞానం లేని అనాగరికులని అనుకున్నారు. తెలంగాణ వారిని నాగరికులుగా తీర్చిదిద్దటానికే వచ్చామని పబ్లిగ్గానే అహంభావతో ప్రకటించారు. అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో బలమైన ముల్కీ ఉద్యమం నడిచింది. దాని ప్రభావంతో తెలంగాణలో స్వీయ అస్తిత్వ పరిరక్షణ కాంక్ష బలపడింది. ఆంధ్రా అధికారులు చేసిన అవమానకర వ్యాఖ్యలను భరించే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు. 


ఆంధ్రా ప్రాంత అధికారులు చేసిన అవమానకర వ్యాఖ్యలకు నిరసనగాను, అదే విధంగా ముల్కీ నియమాలకు విరుద్ధంగా దాదాపు 3000 మంది ప్రాంతేతరులను స్థానిక ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించడం వల్ల ఆత్మగౌరవ పరిరక్షణకై, నాన్-ముల్కీ గో బ్యాక్ అనే నినాదంతో, 1952లో విద్యార్థులు సంఘటితంగా, సమరశీలతతో ఒక పోరాటాన్ని నడిపినారు. ఈ ఉద్యమంతోనే జయశంకర్ సార్ రాజకీయ ఆరంగేట్రం జరిగింది. 


ఇక్కడ జయశంకర్ సారుకు ఎదురైన ఒక అనుభవం గురించి చెప్పాలి. 1952 సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లో ఒక ముల్కీ ర్యాలీ జరిగింది. దానిలో రాష్ట్ర వ్యాపితంగా వున్న ఉద్యమకారులందరూ పాల్గొనాలని అనుకున్నారు. ఆ ర్యాలీ పైన పోలీసులు కాల్పులు జరుపగా దాదాపు ఏడుగురు మరణించారు. దానిలో పాల్గొనడానికి జయశంకర్ గారు వరంగల్లు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కానీ బస్సు ఇంజను పాడై దారిలో నిలిచి పోయింది. అది రిపేర్ అయి హైదరాబాద్ చేరే సరికి కార్యక్రమం అయిపోయింది. సార్ ఈ ఉదంతాన్ని చాలాసార్లు మీటింగులలో ప్రస్తావించే వారు. ఆ కార్యక్రమంలో పాల్గొని ఉంటే బహుశా కాల్పుల్లో నేనూ చనిపోయేవాడినేమో, అట్లా జరిగితే తెలంగాణకు జరిగిన అన్యాయాలను చూడవలసిన అగత్యం తలెత్తక పోవును అని ఆవేదనతో చెప్పేవాడు. ఈ ఉద్యమం తరువాత సార్ తెలంగాణవాదిగా మారి పోయాడు. తదనంతర జీవితమంతా తెలంగాణ కోసం తన పాత్ర తాను పోషించినాడు. ఒక మనిషి ఒక లక్ష్యం కోసం జీవితమంతా నిలబడటం ఎంత కష్టమో. ఆయన మాత్రం అప్పటినుంచి తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలేదు. మూడు తరాల తెలంగాణ ఉద్యమానికి వారధిగా నిలిచినాడు. 


1969 ఉద్యమం ప్రారంభం అయ్యే నాటికి ఆయన కాలేజీ లెక్చరర్ అయినాడు. ఆ వృత్తిలో వుంటూ తెలంగాణ కొరకు ఎట్లా పనిచేయాలో వారికి అర్థం కాలేదు. కొంతమంది లెక్చరర్లతో కలిసి అప్పటి ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ గారిని కలిసినారు. వారు కేవలం లెక్చరర్ల గురించి మాత్రమే కాదు మొత్తంగానే తెలంగాణ ఉద్యమంలో విద్యావంతుల కర్తవ్యాలను వివరిస్తూ మాట్లాడినారు. ప్రజలకు జీవిత అనుభవం నుంచి చాలా విషయాలు తెలుస్తాయి. అయితే ఆ పరిణామాలకు గల కారణాలు తెలియక పోవచ్చు. తాము చూస్తున్న పరిస్థితులు తలెత్తడానికి దారితీసిన కారకాలను తెలియజెప్పి ప్రజలను చైతన్యవంతులను చేయడమే మేధావుల బాధ్యత అని చెప్పి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ గారు వారిని కార్యోన్ముఖులను చేసినారు. తక్షణం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను బహిర్గతం చేస్తూ సెమినార్ జరిపి, ఆ సెమినార్లో వచ్చిన పరిశోధనా పత్రాలను పుస్తకంగా తెచ్చారు. అప్పటినుంచి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఎదిగారు. 


తొలి దశ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఆగిపోయిన తరువాత కూడా తెలంగాణ ఆకాంక్షను వీడకుండా దాన్ని బతికించడానికి ప్రయత్నించిన 69 ఉద్యమకారుల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా 1989 దాకా జయశంకర్ గారు కృషి చేసినారు. ప్రభుత్వ విధానాల వలన తెలంగాణకు ఏ నష్టం జరిగినా దానిపై ప్రభుత్వానికి ఉత్తరాలు రాసేవారు. 1989లో తెలంగాణ ప్రభాకర్ నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాదులో ఒక సదస్సు జరిగినది. దాని తరువాత జయశంకర్ సార్ వంటి 69 ఉద్యమకారులకు పని పెరిగింది. ఆ సదస్సు ఏర్పాటులో ఆయన తోడ్పాటు ఉన్నది. ఆ సభ ఇచ్చిన స్పూర్తితో అటు తరువాత తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకత పైన తెలంగాణలో చాలా సెమినార్లు, సదస్సులు జరిగాయి. నాకు తెలిసి వాటన్నింటిలో జయశంకర్ సార్ ముఖ్య అతిథి. అప్పుడు ఎక్కువ మంది హాజర్ అయ్యే వారు కాదు. కానీ తెలంగాణ ఉద్యమం బలపడటానికి ఉపయోగపడుతుందన్న ఆశతో సార్ వాటిల్లో పాల్గొని విషయాలు చెప్పేవారు. ఆయన తెలంగాణ వస్తుందన్న విశ్వాసంతో పని చేసినాడు. తెలంగాణాను సాధించాలన్న తపనతో తెలంగాణ అంతటా తిరిగినాడు. ఎక్కడు మీటింగు పెట్టినా, ఎవ్వరు ఏర్పాటు చేసినా హాజర్ అయి సందేశం ఇచ్చినాడు. ఆ కృషి వల్లనే మలి దశ రాష్ట్ర సాధన ఉద్యమం పురుడు పోసుకున్నది. ఆ ఉద్యమానికి జయశంకర్ సార్ ఊపిరి ఉన్నంత వరకు సిద్ధాంతకర్తగా నిలిచాడు. 


వరంగల్లులో 1996లో జయశంకర్ గారు, కేశవ రావు జాదవ్ గారు, భూపతి కృష్ణమూర్తి గారు కలిసి సంయుక్తంగా నవంబర్ ఒకటి నాడు – ప్రభుత్వం రాష్ట్రమంతటా ఆంధ్రప్రదేశ్ అవతరణదినం జరుపుతుండగా ఒక నిరసన సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు వేలాది మంది హాజర్ అయినారు. మలి దశ ఉద్యమ ఆవిర్భావానికి ఈ సభ నాంది అని చెప్పవచ్చు. అటు తరువాత అనేక సంఘాలు ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేయడం ప్రారంభించాయి. అట్లా ప్రజా ఉద్యమం విస్తరించడానికి ఒక వైపు కృషి చేస్తూనే మరొక వైపు తెలంగాణ ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణ సాధించడానికి దాదాపు నాకు తెలిసి తెలంగాణ నాయకులందరనీ కలిసినాడు. తెలంగాణ గురించి వారికి అవగాహన కల్పించినాడు. తెలంగాణ కోసం ఆర్ఎస్‌యూ నుండి ఆర్ఎస్ఎస్ దాకా ఎవరినైనా కలుస్తాను అని అనేవాడు. అట్లా వివిధ రకాల సంఘాలను కలువడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. 


తెలంగాణ రాష్ట్ర సాధనతో ఉద్యమకారుల కర్తవ్యం అయిపొదనే సార్ భావించినాడు. తెలంగాణ వచ్చే దాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం తప్పదని అనేక సభల్లో ఉద్యమ కార్యకర్తలకు హిత బోధ చేసినాడు. తెలంగాణ అభివృద్ధి కోసం సాగే పొరాటం మరింత దీర్ఘకాలం సాగుతుందని, మరింత కష్ట తరమైందని కూడా అన్నాడు. ఇవ్వాళ బతికి వుంటే తెలంగాణ అభివృద్ధి కోసం రాస్తూ, మాట్లాడుతూ ఎక్కడో ఒక దగ్గర తెలంగాణ నిర్మాణం కోసం సాగే పోరాటంలో కనిపించేవాడు.

ఎం. కోదండరామ్‌ (తెలంగాణ జన సమితి)

(రేపు ప్రొఫెసర్‌ జయశంకర్‌ పదవ వర్ధంతి)

Updated Date - 2021-06-20T05:48:06+05:30 IST