వధూవరులే పెద్దలై...

ABN , First Publish Date - 2021-09-05T05:14:36+05:30 IST

పెద్దలు కుదిర్చే వివాహాల్లో..

వధూవరులే పెద్దలై...

పెళ్లిళ్లలో తగ్గుతున్న కుటుంబ సభ్యుల పాత్ర

నేరుగా తనకేం కావాలో చెబుతున్న అబ్బాయిలు

తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్న అమ్మాయిలు

ఇష్టమైన రీతిలో పెళ్లి జరగాలని భావిస్తున్న నేటి తరం

మంచి పరిణామమేనని పలువురి అభిప్రాయం


గుంటూరు: గుంటూరుకు చెందిన సంపత్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. వయసు ముఫ్ఫై దాటింది.. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇంట్లో పెద్దలకు వయసు మీరడం, తనకూ సొంత అభిప్రాయాలు ఉండడంతో తానే పెద్దగా మారిపోయాడు. తనకేం కావాలో వధువు తరఫువారిని నేరుగా సంప్రదించి చెప్పాడు... పెళ్లి ఎలా జరగాలో కూడా తానే ప్లాన్‌ చేశాడు. గతంలో పెళ్లి తంతు అంతా పెద్దల చేతుల మీదుగా జరిగేదని, మారిన పరిస్థితుల కారణంగా వధూవరులే ఇప్పుడు పెళ్లి పెద్దల్లా వ్యవహరిస్తున్నారని.. పలువురు అభిప్రాయ పడుతున్నారు. 


పెద్దలు కుదిర్చే వివాహాల్లో ఇటీవల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో తమ బిడ్డల పెళ్లి కోసం పెద్దలే ముందుకు నడిచే వారు. ఆడపిల్లల తల్లిదండ్రులు, మేనమామ, రక్త సంబంధీకులు వెళ్లి వరుడి తరఫు వారు ఏం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకునేవారు. వరుడి తరఫు వారు కూడా.. తాము ఎంత ఆశిస్తోంది.. అమ్మాయి చదువు తదితర అంశాలపై చర్చించేవారు. వరుడు, వధువులతో నేరుగా మాట్లాడే పరిస్థితి తక్కువ సందర్భాల్లో ఉండేది. ఒక వేళ వరుడితో మాట్లాడాలని ప్రయత్నించినా మా ఇంట్లోవాళ్లతో మాట్లాడండి.. వారు చెప్పిందే ఫైనల్‌ అంటూ హుందాగా తప్పుకునేవారు.


వరుడు ఏమన్నా చెప్పదలచుకున్నా పెద్దల చేతే చెప్పించే వారు. కానీ ఇటీవల పరిణామాలు మారిపోయాయి. వరుడు తన పరిస్థితి, తన సంపాదన, తాను ఏం కోరుకుంటున్నాడో నేరుగా చెబుతున్నాడు. వధువుది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి.. అయితే కొద్దిగా తెరచాటు నుంచి జరుగుతోంది అంతే..! దీనిపై గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రధాన సామాజికవర్గాలకు వివాహ సంబంధాలు కుదిర్చే మధ్యవర్తులను సంప్రదించగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 65శాతం వివాహాల్లో నేరుగా వరుడు, వధువే మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అందుకు కారణాలను కూడా వెల్లడించారు.


వయసు పెరగడం..

గతంలో 90 శాతం మందికి వివాహాలు 25 ఏళ్ల లోపే పూర్తయ్యేయి. ఆ వయస్సు వారికి పరిస్థితులపై ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి నేరుగా మాట్లాడేవారు కాదు. ప్రస్తుతం వివాహ వయస్సు 30 సంవత్సరాలు అనేది సాధారణమైంది. ఈ వయసు వారు ఉద్యోగంలో స్థిరపడి.. సమాజ పరిస్థితులపై కాస్త అవగాహన ఏర్పడుతుంది. ఇదే సమయంలో కొంత మంది తల్లిదండ్రులు వృద్ధాప్యాయానికి చేరుకుంటున్నారు. దీంతో పెళ్లి విషయాల్లో వధూవరులే నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. చాలామంది సాఫ్ట్‌వేర్‌  ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వధువు తల్లిదండ్రులు అక్కడికే వెళ్లి నేరుగా అబ్బాయితో మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.


సొంత అభిప్రాయాలతో..

పెళ్లి ఎంత ఘనంగా చేసుకోవాలి.. ఎక్కడ చేయాలి, ఎవరెవరిని పిలవాలి.. ఏం వడ్డించాలి.. ఇలాంటి అంశాలను కూడా వధూవరులే నిర్ణయించుకుంటున్నారు. పెద్దల అభిప్రాయాలను గౌరవిస్తూనే.. తమకిష్టమైన రీతిలో పెళ్లి జరగాలని భావిస్తున్నారు చాలామంది. నేటి యువతలో వ్యక్తిత్వ వికాసం పెరగడం కూడా ఇందుకు కారణం. 


ఒక రకంగా మంచి పరిణామమే...

ఈ పరిణామం ఒక కోణంలో మంచే చేస్తుందని పలువురు అంటున్నారు. వరుడు/వధువు తమ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడం, వాటిని సాధించుకోవడం వలన అసంతృప్తి జాడలు తగ్గుతున్నాయని చెబుతున్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య త్వరగా అవగాహన రావడానికి దోహదపడుతున్నాయని భావిస్తున్నారు 


సమస్యలూ ఉన్నాయి.. 

ఈ పరిణామం కొన్ని సమస్యలు కూడా తెచ్చి పెడుతున్నట్టు, అదీ ముఖ్యంగా వరుడి తరఫు వారి నుంచే వస్తున్నట్లు తెలిపారు. వరుడు తరపు కుటుంబ సభ్యులు కొన్ని ఆశించడం సహజమని, అవి అందకపోవడం వల్ల వరుని కుటుంబసభ్యుల్లో అసంతృప్తి ఉంటుందని, అవి వివాహానంతరం వధువుపై చూపిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా అభిప్రాయ బేధాలు వచ్చినపుడు పెద్దలు కూడా వారి మధ్య జోక్యం చేసుకోవ డానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. 

Updated Date - 2021-09-05T05:14:36+05:30 IST