క్వారీ గోతిలో ఈతకు దిగి బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-01-27T06:49:37+05:30 IST

ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తోటి విద్యార్థులతో కలిసి సరదాగా ఈత కొడదామని వెళ్లిన విద్యార్థిని క్వారీ ఊబి బలిగొంది

క్వారీ గోతిలో ఈతకు దిగి బాలుడి మృతి
సాయి ప్రణవ్‌ మృతదేహం

అగనంపూడి, జనవరి 26: ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తోటి విద్యార్థులతో కలిసి సరదాగా ఈత కొడదామని వెళ్లిన విద్యార్థిని క్వారీ ఊబి బలిగొంది. దీంతో అగనంపూడి అండమాన్‌ కొండయ్యవలసలో తీవ్ర విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఈసంఘటనకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. జీవీఎంసీ 85వ వార్డు పరిధి అండమాన్‌ కొండయ్యవలసకు చెందిన రిటైర్డు ఆర్మీ ఉద్యోగి విందుల నరసింగరావు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కడియం బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఇతని భార్య లక్ష్మి, కుమారుడు సాయి ప్రణవ్‌(14), కమార్తె సాయి దీపక ఇక్కడ ఉంటున్నారు. ప్రణవ్‌ గొన్నవానిపాలెంలో గల ఏబీఎస్‌ పబ్లిక్‌ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం  పాఠశాలలో పతాకావిష్కరణ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లాడు. సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఇ-మర్రిపాలెం గంగవరం గ్రామాల మధ్యలో ఉన్న గ్రావెల్‌ క్వారీల  వద్దకు వెళ్లారు. అక్కడ గోతుల్లో ఈతకు దిగారు. క్వారీ తవ్వకాల్లో పెద్దపెద్ద గోతులు ఉండడంతో  నీరు నిల్వ ఉంది. లోతు తక్కువగా ఉందని భావించి, బాలలు ఈతకు దిగగా ప్రణవ్‌ ఊబిలో కూరుకుపోయి మృతి చెందాడు. దీంతో తోటి స్నేహితులు ఇంటికి సమాచారం ఇచ్చారు. ప్రణవ్‌ చదువుతోపాటు అన్నింటిలో చురుగ్గా ఉండేవాడు. ఇలా మృత్యువాతపడడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. దువ్వాడ  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని పోస్టుమార్టం  నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. ఈమేరకు దువ్వాడ సీఐ లక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-01-27T06:49:37+05:30 IST