cricket Secrets: వీళ్లెప్పుడూ గీత దాటలేదు..

ABN , First Publish Date - 2021-05-05T05:21:58+05:30 IST

క్రికెట్ అంటే జెంటిల్ మేన్ గేమ్ అంటుంటారు. అయితే ఆ క్రికెట్‌లో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు బ్యాట్స్‌మన్ తప్పు చేస్తే, మరికొన్ని సార్లు, బౌలర్లు, ఫీల్డర్లు కూడా తప్పులు..

cricket Secrets: వీళ్లెప్పుడూ గీత దాటలేదు..

క్రికెట్ అంటే జెంటిల్ మేన్ గేమ్ అంటుంటారు. అయితే ఆ క్రికెట్‌లో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు బ్యాట్స్‌మన్ తప్పు చేస్తే, మరికొన్ని సార్లు, బౌలర్లు, ఫీల్డర్లు కూడా తప్పులు చేస్తుంటారు. అయితే బౌలర్లు చేసే ప్రధానమైన తప్పు నోబాల్ వేయడం. నోబాల్ క్రికెట్లో ఎన్నోసార్లు ఆట గతినే మార్చేసింది. ఎంతో బౌలర్లు ఒక్క నోబాల్‌తో తమ కెరీర్లోనే డిజాస్టర్ పెర్ఫార్మెన్స్‌లు చేశారు. దీంతో వారి కెరీర్లే ముగిసిన సందర్భాలున్నాయి. అయితే తమ కెరీర్లో ఒక్క నోబాల్ కూడా వేయని బౌలర్లూ ఉన్నారని మీకు తెలుసా..? అది కూడా ఏదో ఒకటి, రెండు మ్యాచ్‌లు కాదు. ఏకంగా సుదీర్ఘ కెరీర్లో క్రికెట్ ఆడి కూడా ఒక్క నోబాల్ వేయడి గ్రేట్ క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


లాన్స్ గిబ్స్:

వెస్టిండీస్ లెజెండరీ ఆటగాడు లాన్స్ గిబ్స్ తన కెరీర్లో ఒక్క నోబాల్ కూడా వేయలేదు. స్పిన్ బౌలర్‌గా బరిలోకి దిగిన గిబ్స్.. 79 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 300 వికెట్ల మార్కును చేరుకున్న తొలి స్పిన్నర్ ఇతడే. అన్ని వికెట్లు తీసినా.. అన్ని బంతులు వేసినా ఇక్కసారి కూడా గిబ్స్ గీత దాటలేదు.


డెన్నిస్ లిల్లీ:

డెన్నిస్ లిల్లీ.. ఈ పేరు క్రికెట్ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెట్లో అత్యంత క్రమశిక్షణ గల ఫాస్ట్ బౌలర్ లిల్లీ. ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ అయిన కూడా ఒక్క నోబాల్ వేయలేదు. అంతర్జాతీయ కెరీర్‌లో 70 టెస్టులు, 63 వన్డే మ్యాచ్‌లు ఆడిన లిల్లీ.. టెస్టుల్లో 355 వికెట్లు, వన్డేల్లో 103 వికెట్లు తీశాడు. అయినా ఒక్కసారి కూడా నోబాల్ వేయలేదు.


కపిల్ దేవ్:

భారత క్రికెట్‌ను ప్రపంచ వేదికపై మెరిపించిన కెప్టెన్ మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్. దేశానికి తొలి వన్డే వరల్డ్ కప్ అందించి తన పేరును భారత క్రికెట్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. కపిల్ కూడా తన కెరీర్ మొత్తంలో ఒక్క నోబాల్ కూడా వేయలేదు. మొత్తం 131 టెస్టులు, 225 వన్డే మ్యాచ్‌లు ఆడిన కపిల్ ఒక్కసారి కూడా గీత దాటలేదు. అంటే అతడి కెరీర్‌లో ఎప్పుడూ నో-బాల్‌ అనే మాటే వేయలేదు. మరి అప్పటివరకు ప్రపంచం ఏమాత్రం పట్టించుకోని భారత జట్టును జగజ్జేతగా నిలిపిన కెప్టెన్ అంటే ఆ మాత్రం క్రమశిక్షణ ఉండాలి మరి.


ఇయాన్ బోతం:

ఇంగ్లండ్‌కు చెందిన గొప్ప ఆల్ రౌండర్లలో ఇయాన్ బోథం ముందు వరుసలో ఉంటాడు. బోథం తన 16 సంవత్సరాల క్రికెట్ కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయలేదు. ఇంగ్లాండ్ తరఫున ఏకంగా 102 టెస్టులు, 116 వన్డేలు ఆడిన ఇయాన్.. టెస్టుల్లో 383 వికెట్లు, వన్డేల్లో 145 వికెట్లు తీశాడు. అయినా ఒక్క సారి కూడా గీత దాటలేదు.


ఇమ్రాన్ ఖాన్:

పాకిస్తాన్ లెజెండ్, ప్రస్తుతం ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లలో ఒకడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తన కెరీర్లో 88 టెస్టులు, 175 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఇమ్రాన్.. టెస్టుల్లో 362 వికెట్లు, వన్డేల్లో 182 వికెట్లు తీశాడు. అయినా తన కెరీర్లో ఒక్క నోబాల్ కూడా వేయలేదు.

Updated Date - 2021-05-05T05:21:58+05:30 IST