సరిహద్దు బంద్‌

ABN , First Publish Date - 2020-04-24T09:46:59+05:30 IST

సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మహబూబాబాద్‌-సూర్యాపేట 365 జాతీ య రహదారి

సరిహద్దు బంద్‌

మానుకోట-సూర్యాపేట జిల్లాల 365 జాతీయ రహదారి మూసివేత

చెక్‌పోస్టులు, సరిహద్దు గ్రామాలను  సందర్శించిన కలెక్టర్‌, ఎస్పీ 

అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు


మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మహబూబాబాద్‌-సూర్యాపేట 365 జాతీ య రహదారి దంతాలపల్లి చెక్‌పోస్టు నుంచి తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేస్తూ జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. అలాగే మరిపెడ మండలం తానంచెర్ల, రాంపూర్‌, దంతాలపల్లి మండ లం వేములపల్లి కేంద్రాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు మార్గాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. డ్రోన్‌ కెమెరాలతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. 


కలెక్టర్‌, ఎస్పీ పర్యటన

సరిహద్దు చెక్‌పోస్టుల్లో విధుల నిర్వహణ, అధికారుల పనితీరును తెలుసుకోవడంతో పాటు సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు గురువారం కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో కలిసి సుమారు 4గంటల పాటు ఆయా ప్రాంతాలను సందర్శించారు. తానంచెర్ల చెక్‌పోస్టు నుంచి ఏపూర్‌కు 15 కిలోమీటర్లు, రాంపూర్‌ చెక్‌పోస్టు నుంచి చందుపట్ల 11 కిలోమీటర్లు, మరోపక్క దంతాలపల్లి మండలం వేములపల్లి నుంచి చందుపట్ల 13 కిలోమీటర్లు, పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి నుంచి వర్థమానుకోటకు 28 కిలోమీటర్ల దూరం ఉండడంతో పాటు ఆయా మార్గాల నుంచి మహబూబాబాద్‌ జిల్లాకు రాకపోకలు సాగించకుండా లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 


ఆర్‌ఎంపీలు చికిత్స చేస్తే చర్యలు

జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులతో పాటు గ్రామాలు, తండాలను సందర్శించిన కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరిహద్దు తండాలో సూర్యాపేట నుంచి ప్రజల రాకపోకలపై ఆరా తీశారు. సరిహద్దులో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలు, తండాల్లో గర్భిణుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే 102, 108 నెంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు. దగ్గరలోని మరిపెడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలుంటే అధికారులకు తెలిపాలన్నారు.


ఆర్‌ఎంపీలెవరూ చికిత్స చేయవద్దని ఆదేశించారు. చికిత్స చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధిహామీ పనులు సరిహద్దు గ్రామాల ప్రజలకు మినహాయింపు ఉండేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. జిల్లా సరిహద్దు గ్రామాల సూర్యాపేట జిల్లావాసులు నాటు వైద్యం నిమిత్తం కొండలాంటి ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం ఉందని, వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తూ అపరిచితులను రానివ్వకూడదని ఆధికారులను ఆదేశించారు.


ఎవ్వరినీ అనుమతించొద్దు..

జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి ఏ ఒక్కరినీ కూడా జిల్లాలోకి రానివ్వకూడదని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటాచలం, అధికారులు గౌరిశంకర్‌, గోవిందరావు, సతీ్‌షకుమార్‌, ఎంపీపీ ఉమామల్లారెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-04-24T09:46:59+05:30 IST