Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 22 Jan 2022 00:13:04 IST

విజృంభిస్తున్న మహమ్మారి

twitter-iconwatsapp-iconfb-icon
విజృంభిస్తున్న మహమ్మారిమాస్కుల్లేకుండా కడప నగరంలో విద్యార్థులు

ప్రజల్లో కనిపించని భయం

మాస్కులు లేకుండా రోడ్లపైకి జనం

24 గంటల్లో 649 కేసులు నమోదు

పది రోజుల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,315 

ఒకరు మృతి

2,774 మంది ఇంట్లోనే ఉంటూ చికిత్స


కరోనా మొదటి దశ సమయంలో ఎక్కడో జిల్లా సరిహద్దులో ఒక కేసు నమోదైతే.. వామ్మో కరోనా..! అని భయంతో వణికిపోయారు. తాజాగా కరోనా అంటే భయం పోయిందో.. రెండు డోసులు టీకాలు వేసుకున్నాం.. పాజిటివ్‌ వచ్చినా అదే తగ్గిపోతుందిలే అనే నిర్లక్ష్యమో.. కానీ మహ మ్మారి శరవేగంగా విజృంభిస్తున్నా జనంలో ఏమాత్రం భయం కనిపించడం లేదు. థర్డ్‌వేవ్‌ జిల్లా అంతటా వ్యాపించింది. పచ్చని గ్రామసీమల్లో సైతం కరోనా మకాం వేసింది. పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో 3,315 కేసులు నమోదు కాగా.. ఒకరు మృత్యువాత పడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన మేరకు 24 గంటల్లో 649 కేసులు కొత్తగా నమోద య్యాయి. వైద్యులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, గురువులు, ప్రజా ప్రతినిధులు.. అన్ని వర్గాల జనం మహమ్మారి బారిన పడుతున్నారు. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కడప, రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, బద్వేలు, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు ఇలా అన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 24 గంటల్లో 3,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 649 మందికి పాజిటివ్‌ వచ్చింది. 20.13 శాతం మంది కరోనా బారిన పడ్డారు. అంటే.. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వంద మంది పరీక్షలు చేయించుకుంటే సరాసరి 20 మందికి వైరస్‌ ఉన్నట్లు రిపోర్టు వస్తోంది. లక్షణాలు ఉన్నా ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా మెడికల్‌ దుకాణాల్లో ఇచ్చే మెడిసిన వాడుతున్న బాధితులు వేల సంఖ్యలో ఉంటారని వైద్యులే అంటున్నారు. మందులు వాడితే తగ్గిపోతుందని నిర్లక్ష్యం వద్దని, కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్‌ రిపోర్టు వస్తే కనీసం వారం రోజులు హోం ఐసోలేషనలో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలని అంటున్నారు. పరిస్థితి అదుపులో లేదని భావిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.


ప్రజల్లో కనిపించని భయం

జనవరి ఒకటో తారీఖు నుంచే పాజిటివ్‌ కేసులు నమోదైనా వారం రోజులుగా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఈ నెల 12వ తేది నుంచి పది రోజుల్లో 3,315 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఒకరు మాత్రమే మృతి చెందారు. ఆ వ్యక్తి కూడా కరోనా వైరస్‌ సహా ఇతర జబ్బులతో బాధపడుతూ మృత్యువాత పడ్డారని వైద్యులు పేర్కొన్నారు. 2,774 మంది బాధితులు హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు. 73 మంది కొవిడ్‌-19 ఆస్పత్రిల్లో చికిత్స పొందుతుంటే.. 16 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నారు. 236 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని వైద్య అధికారులు పేర్కొన్నారు. గడిచిన పది రోజుల్లో కరోనా కేసులను పరిశీలిస్తే సగటున రోజుకు 330 మంది వైరస్‌ బారిన పడుతున్నారు. అయినా.. జనంలో ఎక్కడా భయం కనిపించడం లేదు. జాతర్లు, దేవర్లు, ఉరుసులు, శుభ కార్యక్రమాలకు యథేచ్ఛగా హాజరవుతున్నారు. రద్దీ ప్రదేశాల్లో పరిశీలిస్తే చాలా మంది మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారు. అంతేకాదు.. పాజిటివ్‌ బాధితుల పట్ల నిఘా లేకపోవడం వల్ల వారు కూడా బయట తిరుగుతున్నారు. వారి నుంచి ఇతరులకు వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. థర్డ్‌వేవ్‌ తగ్గే వరకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు పేర్కొంటున్నారు.


ఆస్పత్రుల్లో సౌకర్యాలు

వివరాలు కొవిడ్‌ ఆస్పత్రులు     కొవిడ్‌ కేర్‌ సెంటర్లు  మొత్తం

ఆక్సిజన బెడ్స్‌ 978          --            978

నాన ఆక్సిజన బెడ్స్‌ 540        2,680        3,220

చికిత్స పొందుతున్నది 73            --            73


పది రోజుల్లో నమోదైన కరోనా కేసులు

తేది        కేసులు

12 42

13 174

14 236

15 377

16 173

17 295

18 202

19 482

20 685

21 649

------------------

మొత్తం 3,315


నిర్లక్ష్యం వద్దు

- డాక్టరు పి.రామారావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, రిమ్స్‌, కడప

కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. ఆస్పత్రుల్లో చేరకుండానే ఇంట్లోనే చికిత్స పొందుతూ జనం కోలుకుంటున్నారు. అయితే.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌ ఉంటే కనీసం పది రోజులు హోం ఐసోలేషనలో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదు. వచ్చినా మాస్క్‌ తప్పనిసరి. నిత్యం శానిటైజేషన చేసుకోవాలి. ఇంటికి చేరగానే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. జనం రద్దీగా ఉండే జాతర్లు, ఉరుసులు, వివాహాలకు దూరంగా ఉండడం ఉత్తమం. వైద్యుల సూచన మేరకు మెడిసిన వినియోగించాలి.

విజృంభిస్తున్న మహమ్మారిమాస్కుల్లేకుండా బస్సుకోసం ఎదురుచూస్తున్న జనం


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.