వాగులో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2021-10-27T04:21:31+05:30 IST

వాగులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతైన

వాగులో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
మృతులు పవన్‌కుమార్‌, విఠల్‌

  • పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు  అప్పగించిన పోలీసులు


 మొయినాబాద్‌: వాగులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం మృతదేహాలను వెలికితీసి వాగు సమీపంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మొయినాబాద్‌ మండలంలోని వెంకటాపూర్‌ ఈసీవాగు కత్వవద్ద సోమవారం సాయంత్రం ఈత కొట్టేందుకు మొయినాబాద్‌ మండలం సజ్జన్‌పల్లికి చెం దిన పవన్‌కుమార్‌(18), కామారెడ్డి జిల్లా పిట్లంకు చెం దిన విఠల్‌(విక్కీ)(22) వికారాబాద్‌ జిల్లా నాగసముందర్‌కు చెందిన ఆంజనేయులు ముగ్గురు యువకులు వెళ్లగా అందులో ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే.. నీటిలో మునిగి గల్లంతైన పవన్‌కుమార్‌, విఠల్‌ కోసం మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు గజ ఈతగాళ్లు వెతికినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మంగళవారం ఉదయం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం తెప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ముందుగా పవన్‌కుమార్‌, తరువాత విఠల్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. 


నాడు తండ్రీ.. నేడు కొడుకు

మగ దిక్కును కోల్పోయిన విఠల్‌ కుటుంబం

కామారెడ్డిజిల్లా పిట్లంకు చెందిన రుకుంబాయి నగేష్‌ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం. విఠల్‌ ఆరేళ్ల వయసులోనే తండ్రి నగేష్‌ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆరేళ్ల కొడుకు, మూడేళ్ల కూతురును తల్లి రుకుంబాయి కూలిపనులు చేస్తూ పెంచి పెద్ద చేసింది. విఠల్‌ ఐటీఐ చదివాడు. చేతికందిన కొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబం ఉన్న ఒక్క మగ దిక్కును కోల్పోయింది. తమకు ఎవరు దిక్కు దేవుడా... నా కొడుకుతోపాటు మమ్మల్నీ కూడా తీసుకెళ్లు అంటూ విఠల్‌ తల్లి, చెల్లి రోదనలు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించాయి. నాడు తండ్రి.. నేడు కొడుకు మృతిని తలుచుకుంటూ కుమిలి పోయారు.


ఘటనా స్థలం వద్దే పోస్టుమార్టం

వాగులోంచి వెలికి తీసిన మృతదేహాలకు ఘటనాస్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్తుపత్రి వైద్యుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతుల కుటుంబసభ్యులకు పోలీసులు మృతదేహాలను అప్పగించారు. పవన్‌కుమార్‌ అత్యక్రియలు సజ్జన్‌పల్లిలో నిర్వహించారు. విఠల్‌ మృతదేహాన్ని సొంతూరు పిట్లంకు తీసుకెళ్లారు. గాలింపు సమయంలో మొయినాబాద్‌ పోలీసులులతో పాటు చేవెళ్ల ఆర్డీవో వేణుమాదవ్‌రావు, తహసీల్దార్‌ అనితారెడ్డి, రెవెన్యూ సిబ్బంది అక్కడే ఉన్నారు.  కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్‌ రాజు తెలిపారు. 


ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

వెంకటాపూర్‌ ఈసీ వాగు వద్ద ఘటనాస్థలాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం సందర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఘటన ప్రాంతంలో చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌ సం బంధిత అధికారులకు సూచించారు. వీరితోపాటు సర్పంచులు మనోజ్‌కుమార్‌, జనార్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ రాంరెడ్డి, నాయకులు జయవంత్‌, గణేష్‌రెడ్డి, రహూష్‌ తదితరులు ఉన్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సజ్జన్‌పల్లి గ్రామంలో పవన్‌కుమార్‌ కుటుంబసభ్యులను పరా మర్శించారు. వారి కుటుంబసభ్యులకు రూ.10 వేలు అందజేశారు. మృతుల కుటుంబాకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్‌ చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర ఎస్సీసెల్‌ ఉపాధ్యక్షుడు షాబాద్‌ దర్శన్‌, పార్టీ మండల అధ్యక్షుడు మానయ్య, రవిందర్‌రెడ్డి, జనార్ధన్‌రావు ఉన్నారు. 



Updated Date - 2021-10-27T04:21:31+05:30 IST