గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2022-08-13T06:59:09+05:30 IST

గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం
సుర్దేపల్లి బ్రిడ్జి వద్ద ధర్నా చేస్తున్న మృతుడి బంధువులు

న్యాయం చేయాలని డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 

ప్రదీప్‌ కుటుంబీకుల ధర్నా

నేలకొండపల్లి/ ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 12 : చేపలు పట్టేందుకు వాగుకు వెళ్లి గల్లంతైన వ్యక్తిని రక్షించేందుకు వచ్చిన డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యుల్లో ఇద్దరు కూడా ప్రమాదంలో చిక్కుకున్న సంఘటన తెలిసిందే. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి బ్రిడ్జికమ్‌చెక్‌డ్యాం వద్ద గురువారం జరిగిన ఈ సంఘటనలో పగడాల రంజిత్‌(25) మృతదేహం శుక్రవారం రామచంద్రాపురం సమీపంలోని వాగులో లభ్యమైంది. ఇక రంజిత్‌ను వెతకటానికి ఖమ్మం నుంచి వచ్చి గల్లంతైన డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రదీప్‌(35), వెంకటే్‌షలు(32)ల్లో వెంకటేష్‌ మృతదేహం గురువారమే దొరకగా, ప్రదీప్‌ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. అయితే తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహం లభ్యమైన బ్రిడ్జి వద్దనే ప్రదీప్‌ కుటుంబసభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. స్పష్టమైనహామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించటానికి అంగీకరించేది లేదని వారు భీష్మించారు. కొంత సేపు ధర్నా చేసిన అనంతరం ఖమ్మం రూరల్‌ సీఐ సంఘటనా స్ధలానికి చేరుకుని వారితో మాట్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అంతకు ముందు తహసీల్దార్‌ దారా ప్రసాద్‌, ఎంపీడీవో జమలారెడ్డి పరిస్ధితిని సమీక్షించారు.


జిల్లా ఆసుపత్రి మార్చురీ వద్ద విపక్షాల ఆందోళన

కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గల్లంతైన వ్యక్తిని వెతికేందుకు వెళ్లి.. అదే వాగులో మునిగి మరణించిన డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రదీప్‌, వెంకటేశ్వర్లు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఖమ్మం జిల్లా ఆసుపత్రి మార్చురీ వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎఫ్‌టీయూ, ఐనటీయూసీ సంఘాలు ఆ కార్మికుల కుటుంబాల పక్షాన ధర్నా చేశారు. ఈ సందర్భంగా  సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నానాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత, ప్రజాపంఽథా జిల్లా కార్యదర్శి గోగిన పల్లి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని నరేందర్‌ తదితరులు మాట్లాడుతూ  కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంతో కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. గతంలోనూ వాటర్‌ ట్యాంకును శుభ్రం చేస్తూ పైపులో పడి ఓ కార్మికుడు మృతి చెందాడని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధర్నా విషయం తెలుసుకున్న కలెక్టర్‌ చేసిన సూచనలమేరకు కార్పొరేషన్‌ మేయర్‌ పునుకొల్లు నీరజ, ఆర్డీవో రవీంద్రనాథ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని అఖిలపక్ష నాయకులతో చర్చించారు. మృతి చెందిన ఒక్కో కార్మికుడికి రూ.7లక్షల పరిహారం అందిస్తామని అందులో రూ.5లక్షలు మునిసిపాలిటీ తరపున, మరో రూ.2లక్షలు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తరపున అందిస్తామని, దీంతో పాటు మృతుల కుటుంబానికి ఇంటిస్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరసనలో తుమ్మా విష్ణువర్థన, మందా వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఎం.జయరాజు, బీజీ క్లెమెంట్‌,  వెంకన్న, వై విక్రం, బందెల వెంకయ్య, జనక శ్రీను, దొడ్డా నర్సింహారావుపద్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T06:59:09+05:30 IST