చేపల వేటకు వెళ్లి... తిరిగిరాని లోకాలకు!

ABN , First Publish Date - 2021-06-19T05:19:19+05:30 IST

చేపల వేటకు వెళ్లొస్తానని కుటంబ సభ్యులకు చెప్పిన ఆ మత్స్యకారుడు.. తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. కెరటాల తాకిడికి తెప్ప బోల్తా పడగా.. ఊపిరాడక సముద్రంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు. వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేటలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ కూన గోవిందరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

చేపల వేటకు వెళ్లి... తిరిగిరాని లోకాలకు!
త్రినాథ్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

- తెప్పబోల్తాపడి మత్స్యకారుడి మృతి

- హుకుంపేటలో విషాద ఛాయలు

వజ్రపుకొత్తూరు, జూన్‌ 18: చేపల వేటకు వెళ్లొస్తానని కుటంబ సభ్యులకు చెప్పిన ఆ మత్స్యకారుడు.. తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. కెరటాల తాకిడికి తెప్ప బోల్తా పడగా.. ఊపిరాడక సముద్రంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు. వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేటలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ కూన గోవిందరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  సముద్రంలో తెప్పబోల్తా పడి హుకుంపేటకు చెందిన కొమర త్రినాథ్‌(63) మృతిచెందాడు. గ్రామానికి చెందిన నారాయణ, చోడిపల్లి దానయ్యలతో త్రినాథ్‌ శుక్రవారం వేకువజామున 4.30 గంటల సమయంలో చేపల వేటకు వెళ్లాడు. కొంత సేపటి తర్వాత సముద్రంలో అలల తాకిడి పెరిగింది. కెరటాల ఉధృతికి వారు పయనిస్తున్న తెప్ప బోల్తా పడింది. దీంతో తెప్పపై ఉన్న ముగ్గురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. కొమర త్రినాథ్‌ కెరటాల్లో చిక్కుకొని ఊపిరాడక అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఒడ్డుకు చేరుకొని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. చేపల వేటకు వెళ్లొస్తానని చెప్పి.. ఇలా విగతజీవిగా మారాడంటూ బోరున విలపించారు. ఈ సంఘటనపై మృతుని కుమారుడు కొమర రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ రమణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు. 

Updated Date - 2021-06-19T05:19:19+05:30 IST