Abn logo
Sep 26 2021 @ 23:55PM

మంచినీళ్లపేటలో ‘అల’జడి!

ఈదుకుంటు బయటపడిన మత్స్యకారలు

- బోటు బోల్తా పడి ఆరుగురు మత్స్యకారులు గల్లంతు.. 

- క్షేమంగా తీరానికి చేరిన ఐదుగురు

- మరొకరి కోసం గాలింపు

వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 26 : గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో అలల ఉధృతికి సముద్రంలో బోటు బోల్తా పడింది. ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఐదుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలోని మత్స్యకార కుటుంబాల్లో అలజడి రేగింది. వివరాల్లోకి వెళితే.. 

మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వంక నాయకన్న, వంక చిరంజీవి, పిట్ట హేమారావు, కొండ భీమారావు, ఎలుకుల పాపారావు, బుంగ మోహనరావులు రెండు రోజుల కిందట కొత్తబోటు కొనుగోలు చేసేందుకు సముద్ర మార్గం ద్వారా పడవపై పారాదీప్‌ వైపు వెళ్లారు. ఆదివారం తిరిగి వస్తుండగా.. గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో అక్కుపల్లి సముద్రతీరంలో అలల ఉధృతికి బోటు బోల్తాపడింది. ఈ విషయాన్ని పిట్ట హేమారావు గ్రామస్థులకు ఫోన్‌ద్వారా తెలిపారు. తర్వాత ఆయన ఫోన్‌ రింగ్‌ అవుతున్నా.. స్పందించడం లేదు. దీంతో వారంతా గల్లంతై ఉంటారని గ్రామస్థులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు సహాయకచర్యల కోసం విపత్తుల నిర్వహణ, ఫిషరీష్‌, నేవి అధికారులతో మాట్లాడారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు వివరించారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఐదుగురు సుమారు పది.. పదిహేను మైళ్లు ఈదుకుంటూ క్షేమంగా తీరానికి చేరుకున్నారు. ఎలుకుల పాపారావు, వంక చిరంజీవులు ముందుగా మందస మండలంలోని గంగువాడ తీరానికి చేరుకున్నట్లు మంత్రి అప్పలరాజు కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొండ భీమారావు వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి తీరానికి చేరాడు. రాత్రి 8 గంటల సమయంలో పిట్ట హేమారావు బైపలి-అక్కుపల్లి తీరానికి చేరుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో వంక నాయకన్న గాయాలతో మంచినీళ్లపేట తీరానికి చేరుకున్నాడు. బోటు ఫ్యాన్‌ తగలడంతో సముద్రంలోనే గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించారు. మోహనరావు ఆచూకీ లభ్యం కాలేదు. ఆయన కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అక్కుపల్లి మాజీ సర్పంచ్‌ లండ రామలింగం.. ఒడ్డుకు చేరుకున్న బాధిత మత్స్యకారులను కలిసి మాట్లాడారు. అనంతరం వారితో మంత్రి అప్పలరాజుకు పోన్‌ చేసి మాట్లాడించారు. తాము అతికష్టం మీద సముద్రంలో ఈదుకుంటు ఒడ్డుకు చేరామని వారు తెలిపారు. తీరానికి చేరుకున్న బాధిత మత్స్యకారులకు పలాస ఆసుపత్రికి తరలించి, వైద్యసేవలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ఘటనతో మంచినీళ్లపేటలో అలజడి రేగింది. ఐదుగురు క్షేమంగా ఒడ్డుకు చేరినా.. మరొకరి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మత్స్యకారులంతా ఆందోళన చెందుతున్నారు. 

 

మత్స్యకారులను కాపాడండి 

- ఎంపీ రామ్మోహన్‌నాయుడు 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి : సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను కాపాడాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోస్టుగార్డు డీజీని కోరారు. వారిని సురక్షితంగా తీరానికి చేర్చేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్‌ కారణంగా హెలికాఫ్టర్‌ ద్వారా లేదా.. మరబోట్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.