బీజేపీ వాదమే భారత్ బాట

ABN , First Publish Date - 2020-11-17T05:39:31+05:30 IST

భారత దేశంలో ప్రభుత్వాల పనితీరు పై ప్రజలు తమ వ్యతిరేకత వెలిబుచ్చేందుకు ఎన్నికలు ఒక ప్రధాన సాధనం. అధికారంలో ఉన్నవారు పెడదోవ...

బీజేపీ వాదమే భారత్ బాట

ఒక రాజకీయ పక్ష సిద్ధాంతాన్ని ప్రజలు అర్థం చేసుకొని, అభిమానించి, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న శక్తులను ఓడించడం ఆ పార్టీకి సైద్ధాంతిక విజయం అవుతుంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కీలక నిర్ణయాల వెనుక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు గమనిస్తూ వస్తున్నారు. ప్రజల మనోభావాలకు సమీపంగా ఉన్న పార్టీ కనుకే బీజేపీ దేశమంతటా విస్తరించగలుగుతోంది.


భారత దేశంలో ప్రభుత్వాల పనితీరు పై ప్రజలు తమ వ్యతిరేకత వెలిబుచ్చేందుకు ఎన్నికలు ఒక ప్రధాన సాధనం. అధికారంలో ఉన్నవారు పెడదోవ పట్టినప్పుడల్లా వారు తమ ఓటు ద్వారా వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. ప్రజాగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు కుప్పకూలిన సందర్భాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత తట్టుకుని నిలబడ్డ ప్రభుత్వాలు, రోజురోజుకూ ప్రజాదరణ పెంచుకుంటున్న నాయకులు చాలా అరుదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ మాత్రమే ఈ విశిష్టమైన ఘనత దక్కుతుంది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా 59 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికలు ఈ విషయాన్ని నిరూపించాయి.


నిజానికి గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లోనే బిజెపి 2014లో గెలిచి నన్ని సీట్లు గెలుచుకుంటుందని అనేకమంది ఊహించలేదు. రాష్ట్రాల్లో కూడా బిజెపి రెండోసారి విజయం సాధించలేకపోవచ్చునని అంచనాలు వినిపించాయి. అయితే ఆ సార్వత్రక ఎన్నికల్లో గతంలో గెలిచిన సీట్ల కంటే అత్యధిక సీట్లు స్వాయత్తం చేసుకోవడంతో పాటు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్, ఢిల్లీ మొదలైన రాష్ట్రాల్లో బిజెపి వందకు వంద శాతం సీట్లు గెలుచుకుంది. అలాగే బిహార్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి తన సీట్ల సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. కొన్ని చోట్ల ఓట్ల శాతాన్ని 50 శాతం పైగా పెంచుకుంది. రాజకీయ పరిశీలకుల అంచనాలను, ఎగ్జిట్ పోల్స్ ను కూడా తలదన్నే ఫలితాలను బిజెపి సాధించగలిగింది.


నిజానికి నరేంద్రమోదీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతున్నదే కాని, ఆయన పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఎక్కడా కనిపించడం లేదని జాతీయ, అంతర్జాతీయ సంస్థల సర్వేల ప్రకారం స్పష్టమవుతోంది. కొవిడ్ -19తో దేశమంతటా ప్రజాజీవనం స్తంభించిపోయినా, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, అనేక జాతీయ, అంతర్జాతీయ సమస్యలు ఏర్పడినా మోదీ నాయకత్వంలో ప్రజల విశ్వాసం చెక్కు చెదరలేదు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడని ఒక సాహసోపేత నాయకుడిగా మోదీని ప్రజలు భావిస్తుండడమే అందుకు ప్రధాన కారణం. చూస్తున్నారు. అధికరణ 370 రద్దు, జమ్మూ-కశ్మీర్ విభజిన, త్రిపుల్ తలాఖ్, పౌరసత్వ సవరణ చట్టాలు, రక్షణరంగాన్ని పటిష్ఠం చేయడం, జీఎస్టీ అమలు వంటి వాటివి ఒక ఎత్తు అయితే జనధన్ యోజన, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ యోజన వంటి అనేక పథకాలతో ప్రజల విశ్వాసం చూరగొనడం మరో ఎత్తు. కరోనా సమయంలో పేదలను తక్షణం ఆదుకునేందుకు గరీబ్ కల్యాణ్ యోజన ప్రవేశపెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ క్రుంగిపోకుండా ఆత్మనిర్భర్ పేరుతో వరుసగా బలమైన ప్యాకేజీలను ప్రకటిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి చేయూతనివ్వడం, గ్రామాలను స్వయం సమృద్ధి చేసే కీలకమైన వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా  మోదీ తాను ప్రజలకు నిత్యం అండగా ఉంటానన్న సందేశాన్ని పంపగలిగారు. బిహార్‌లో ప్రధాని పాల్గొన్న సభల నిర్వాహకుడిగా ఈ వ్యాస రచయిత మోదీ పట్ల ప్రజానుకూలత ఎంత ప్రబలంగా ఉన్నదో ప్రత్యక్షంగా గ్రహించగలిగారు. కరోనా మూలంగా ఎన్ని కట్టుదిట్టమైన నిబంధనలు విధించినా వాటిని ఉల్లంఘించి మరీ జనం పెద్ద సంఖ్యలో మోదీ సభలకు హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు నరేంద్రమోదీకి నీరాజనాలు పట్టారు. ఎన్డీఏ గెలుచుకున్న 125 నియోజక వర్గాలలోని 99, పురుషుల కంటే మహిళలే పెద్ద సంఖ్యలో ఓటు వేయడం వల్ల లభించినవే. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత వారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళలను బిజెపికి నిశ్శబ్ద ఓటర్లుగా అభివర్ణించారు.


తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ కంచుకోట అయిన దుబ్బాకలో బిజెపి అభ్యర్థి గెలుపు సాధారణమైన పరిణామం కాదు. ఈ గెలుపు వెనుక బిజెపి, జాతీయ వాద శక్తులు గత కొన్నేళ్లుగా తెలంగాణలో జరుపుతున్న సంఘర్షణ ఉన్నదనడంలో అతిశయోక్తి లేదు. ఫలితాలకోసం చూడకుండా అహర్నిశలు నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతూనే, త్యాగాలు చేస్తూనే ముందుకు సాగడం బిజెపి తత్వం. ఈ విశిష్టతే బిజెపికి గత కొన్ని సంవత్సరాలుగా ఫలితాలను ఇస్తోంది.


ఇదే విషయాన్ని ప్రధానమంత్రి మోదీ బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలకు చెప్పారు. రెండుసీట్ల నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ చివరకు అధికారంలోకి వచ్చిన వైనాన్ని వివరించారు. దీని వెనుక బిజెపి కార్యకర్తల, జాతీయవాద శక్తుల అకుంఠిత శ్రమ, దీక్ష ఉన్నాయన్నారు. అంతేకాదు, బిజెపిలో వారసత్వ రాజకీయాలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఉండదు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ అనేక రాష్ట్రాల్లో వివిధ పార్టీలు వారసత్వ రాజకీయాలను అవలంభిస్తూ వ్యవస్థల్ని భ్రష్టుపట్టిస్తున్న తీరును మోదీ అనేక సందర్భాల్లో ఎండగట్టారు. ఇవాళ స్పష్టంగా కేంద్రంలో మోదీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రజల శ్రేయస్సు కోసం, వారి భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్ని అందరూ గమనిస్తున్నందువల్లే రోజురోజుకూ బిజెపి పట్ల ప్రజాభిమానం పెరిగి గతంలో ప్రాబల్యం లేని ప్రాంతాలకు విస్తరిస్తోంది.


రెండేళ్ల క్రితం ఒకప్పుడు వామపక్షాల కంచుకోటగా ఉన్న త్రిపురలో మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని గద్దెదించి బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోదీ దాన్ని బిజెపి సైద్ధాంతిక విజయంగా అభివర్ణించారు. దేశంలో ఒక రాజకీయ పక్ష సిద్ధాంతాన్ని ప్రజలు అర్థం చేసుకోవడమే కాదు, అభిమానించి, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న శక్తులను ఓడించినప్పుడే అది ఆ పార్టీ సైద్ధాంతిక విజయంగా మారుతుంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కీలక నిర్ణయాల వెనుక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు గమనిస్తూ వస్తున్నారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ నిలబెట్టడం, సరిహద్దుల్లో దేశ సౌర్వభౌమాధికారాన్ని కాపాడేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవడం నుంచీ ఆర్థిక సిద్ధాంతాల వరకూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన విశిష్టతను నిలబెట్టుకుంటూ వస్తోంది. దేశ సంస్కృతీ, సంప్రదాయాలు, ప్రజల విశ్వాసాల విషయంలో రాజీపడకుండా పోరాడే విషయంలో భారతీయ జనతా పార్టీకి మించిన పార్టీ ఈ దేశంలో లేదని నిరూపిస్తూ వచ్చింది. ప్రజల మనోభావాలకు సమీపంగా ఉన్న పార్టీ కనుకే బిజెపి దేశమంతటా విస్తరించగలుగుతోంది.


త్రిపురలో బిజెపి ఎక్కడ గెలుస్తుందన్న వారే తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపికి అవకాశం లేదని యథాలాపంగా సిద్ధాంతాలు చేశారు. నిజానికి త్రిపుర ఒకప్పుడు వామపక్షాల కంచుకోట కావచ్చు. తెలంగాణ మాత్రం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కంచుకోట కాదు. తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, మాయ మాటలు చెప్పి, బూటకపు హామీలు, మతశక్తులతో మిలాఖత్ అయి కేసీఆర్ అధికారంలో ఇన్నాళ్లూ నిలవగలిగారు. అదే సమయంలో తెలుగుదేశం అస్తిత్వం కోల్పోవడం, కాంగ్రెస్ నాయకులు విశ్వసనీయత కోల్పోవడం కూడా టిఆర్ ఎస్ కు ప్రయోజనం చేకూర్చింది. విచిత్రమేమంటే గత ఆరు సంవత్సరాల్లోనూ తెలంగాణలో ఎటువంటి నిర్దిష్టమైన అభివృద్ధి సాధించకుండానే కేసీఆర్ అధికారంలో ఉన్నారు. కుటుంబ పాలనను ప్రవేశపెట్టినా, అడుగడుగునా అవినీతి కనపడుతున్నా, పదవులు అస్మదీయులకే పంచిపెట్టినా, హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామని ప్రగల్భాలు పలికి మురికివాడగా మార్చినా ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోవడం కేసీఆర్ కు వరంగా మారింది. కరోనా సమయంలో అనేక మంది దిక్కులేని మరణాలకు గురికావడం, ఉస్మానియా, గాంధీ వంటి ఆసుపత్రులు ఎటువంటి సౌకర్యాలు లేక మృత్యుకుహరాలుగా మారడం, మొన్నటి వర్షాలు, వరదలతో వందలాది కాలనీలు, బస్తీలు కొట్టుకుపోయి లక్షలాది ప్రజలు దుర్భర అవస్థకు గురి కావడంతో ప్రజలు కళ్లు తెరుచుకుంటున్నాయి. నిజానికి గత లోక్ సభ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ నాలుగు సీట్లు గెలుచుకోవడంతో ప్రజలు బిజెపిలో ప్రత్యామ్నాయం చూస్తున్నారని స్పష్టమైంది. దుబ్బాక అసెంబ్లీ కి జరిగిన ఉప ఎన్నికల ద్వారా ప్రజలు ఆయనకు స్వంత గడ్డలోనే పరాజయం అందించారు. ప్రజల మనోభావాలు స్పష్టం కావడంతో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి ద్విగుణీకృత ఉత్సాహంతో తలపడేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో ప్రజలు ఇప్పటికే బిజెపిని ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయించారన్న విషయం స్పష్టమైంది. బిజెపిని అధికార పక్షంగా మార్చే తరుణం కూడా ఎంతో దూరంలో లేదని వారికి బాగా తెలుసు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-11-17T05:39:31+05:30 IST