మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2022-08-12T05:56:41+05:30 IST

మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి

మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి
కొణిజర్లలో యాత్ర నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క

స్వాతంత్య్ర పోరాట యోధుల స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర పాలన 

ఆజాదీకా గౌరవ్‌యాత్రలో భట్టి విక్రమార్క ధ్వజం

రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం

కొణిజర్ల/ఖమ్మం సంక్షేమ విభాగం, ఆగస్టు 11: మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలని, స్వాతంత్య్ర పోరాట యోధుల స్ఫూర్తిగా భిన్నంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. జిల్లాలో ఆయన చేపట్టిన ఆజాదీకా గౌరవ్‌యాత్ర గురువారం  ఖమ్మం నియోజకవర్గంలోని గోపాలపురంలో కార్పొరేటర్‌ సైదులునాయక్‌ నివాసం నుంచి ఆజాదికా గౌరవ్‌యాత్రను భట్టి ప్రారంబించారు. అంతకుముందు కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఎండీ జావీద్‌ అధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు భట్టి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. అనంతరం తనికెళ్ల, కొణిజర్ల మీదుగా పల్లిపాడు చేరుకున్న భట్టికి కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తనికెళ్లలో పలువురు భట్టి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరగా.. భట్టి సతీమణి నందిని తనికెళ్ల వద్ద బోనం ఎత్తుకుని, కోలాటం ఆడి మహిళలను ఉత్సాహ పరిచారు. అనంతరం కొణిజర్ల కూడలిలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీ విధానం స్వాతంత్య్ర స్ఫూర్తికి భిన్నంగా సాగుతోందని, బీజేపీ మతాల పేరుతో చిచ్చు పెడుతోందని, దేశంలో పుట్టిన ప్రతీ పౌరుడు భారతీయుడేనని, మతాల పేరుతో విడగొట్టొద్దని హితవు పలికారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. ఇంతవరకూ రైతులకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలని, లేదంటే పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నాయకులు పోట్ల నాగేశ్వరరావు, దొబ్బల సౌజన్య, ఖమ్మం నగర అధ్యక్షుడు జావీద్‌, నియోజకవర్గ నాయకులు బాలాజీ, రాందాస్‌ నాయక్‌, మండల ఇనచార్జ్‌ నారాయణరావు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-12T05:56:41+05:30 IST