Abn logo
Sep 20 2021 @ 23:54PM

రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షం

వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వి.విజయరామరాజు

కలెక్టర్‌ విజయరామరాజు


కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 20: రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ వి.విజయరామరాజు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ (ఆర్బీకే) ఎం.గౌతమితో పాటు రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలను అందిస్తోందన్నారు. ప్రతి రైతు సాగు చేసే పంటల వివరాలను ఈ-క్రాపింగ్‌ నమోదు చేయించుకునేలా వ్యవసాయాధికారులు, గ్రామీణ వ్యవసాయ సహాయకులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వ్యవసాయ సలహామండలి బోర్డు సమావేశాలకు సంబంధిత అధికారులు విధిగా హాజరై ఫైనాన్షియల్‌, నాన్‌ ఫైనాన్షియల్‌ వివరాలను వేర్వేరుగా నివేదికలు ఇవ్వాలన్నారు. సీజన్ల వారీగా సాగుచేసే పంటలు, వాటిని ఆశించే చీడ పీడలు, తెగుళ్ల నివారణ, ఆయా పైర్లకు అందాల్సిన పోషక విలువులు, ఎరువుల వాడకంపై ముందస్తుగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యుడు అంబటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు ముంగిళ్లలోనే వారు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహామండలి బోర్డు సభ్యులు బలరామిరెడ్డి, ప్రకృతి వ్వవసాయం ఏడీ నాగరాజు, సెరికల్చర్‌ డీడీ రాజశేఖర్‌ రెడ్డి, ఉద్యాన శాఖ డీడీ వజ్రశ్రీ, పశుసంవర్థక శాక జేడీ సత్యప్రకాష్‌, అధికారులు శోభావాలంటీనా, విజయ విహారి తదితరులు పాల్గొన్నారు.