ఉత్తమ పంచాయతీ పెదలబుడు

ABN , First Publish Date - 2021-04-16T05:36:13+05:30 IST

జిల్లాలోని అరకులోయ మండలం పెదల బుడు పంచాయతీ వరుసగా రెండో ఏడాది కూడా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ స్వశక్తీకరణ్‌ పురస్కారానికి ఎంపికైంది.

ఉత్తమ పంచాయతీ పెదలబుడు
పెదలబుడులో ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్‌ట్యాంకు

వరుసగా రెండోసారి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ స్వశక్తీకరణ్‌ పురస్కారానికి ఎంపిక

ఈ నెల 24న ఢిల్లీలో పురస్కార ప్రదానం

పంచాయతీని దత్తత తీసుకున్న అప్పటి సీఎం చంద్రబాబు

రూ.50 కోట్లతో సమగ్ర అభివృద్ధి, సంక్షేమం



అరకులోయ, ఏప్రిల్‌ 15: జిల్లాలోని అరకులోయ మండలం పెదల బుడు పంచాయతీ వరుసగా రెండో ఏడాది కూడా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ స్వశక్తీకరణ్‌ పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారానికి రాష్ట్రంలో ఏడు పంచాయతీలు ఎంపికవ్వగా వాటిలో పెదలబుడు ఒకటి కావడం విశేషం. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకునేందుకు రావాలంటూ కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ నుంచి లేఖ వచ్చినట్టు పెదలబుడు పంచాయతీ కార్యదర్శి శేఖర్‌బాబు తెలిపారు.  తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెదలబుడు మేజర్‌ పంచాయతీని సమగ్రంగా అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దడానికి దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. సుమారు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ప్రజలకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అర్హులకు పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఈ పంచాయతీ పరిధిలో మొత్తం 21 గ్రామాలు వుండగా, అన్నిచోట్ల తాగునీటి కోసం ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించి, ప్రతి ఇంటికీ కొళాయిలను ఏర్పాటు చేశారు. గ్రామాల మధ్య రవాణా సదుపాయాన్ని మెరుగుపరచడానికి తారురోడ్లు వేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించారు. సామాజిక భవనాలు, గ్రంథాలయం, అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించారు. పంట భూములకు సాగునీటి సౌకర్యం కోసం చెక్‌డ్యామ్‌లు నిర్మించి, కాలువలు తవ్వించారు. చెత్త నుంచి సంపద తయారీకేంద్రాలు ఏర్పాటుచేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త పాఠశాలలను ఏర్పాటుచేశారు. పెదలబుడు పంచాయతీ పరిధిలో వున్న పర్యాటక కేంద్రం అరకులోయలో సుమారు రూ.24 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, సెంటర్‌ లైటింగ్‌, బ్యూటిఫికేషన్‌ పనులు చేపట్టారు. 

అర్హులందరికీ పక్కా ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరుచేశారు. ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు, అర్హులకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, ప్రతి కుటుంబానికి దీపం పథకం కింద వంట గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరుచేశారు. నిరుద్యోగ యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా ప్రతి ఇంటికీ కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌, ఫోన్‌ సౌకర్యం కల్పించారు. 


రెండేళ్లలో రెండో అవార్డు

తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు 2017-18వ సంవత్సరంలో పెదలబుడు పంచాయతీ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ స్వశక్తీకరణ్‌ పురస్కారానికి ఎంపికైంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లఖ్‌నవులో కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అప్పటి సర్పంచ్‌ సమర్డి గులాబీ, పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు హాజరై పురస్కారాన్ని, అవార్డు కింద రూ.15 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. మళ్లీ 2019-20 సంవత్సరానికి కూడా ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. 


చాలా ఆనందంగా ఉంది

కె.శేఖర్‌బాబు, పంచాయతీ కార్యదర్శి, పెదలబుడు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ సంస్థలకు 16 అవార్డులు ప్రకటించడం, వాటిలో పెదలబుడు పంచాయతీ వుండడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 24వ తేదీన ఢిలీలో అవార్డు అందుకోవడానికి రావాలని ఆహ్వానం అందింది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఒక్కరే హాజరుకావాలని ఉంది. సర్పంచ్‌, కార్యదర్శిలో ఎవరు హాజరు కావాలన్నది జిల్లా పంచాయతీ అధికారి నిర్ణయం తీసుకుంటారు.

Updated Date - 2021-04-16T05:36:13+05:30 IST