ఉత్తమ దానం

ABN , First Publish Date - 2022-02-25T05:30:00+05:30 IST

‘కేవలం ప్రదర్శన కోసం సంపదను ఖర్చు చేసేవారు, అల్లా్‌హను, అంతిమ దినాన్నీ హృదయపూర్వకంగా విశ్వసించనివారు అల్లా్‌హకు అయిష్టులవుతారు’’

ఉత్తమ దానం

‘కేవలం ప్రదర్శన కోసం సంపదను ఖర్చు చేసేవారు, అల్లా్‌హను, అంతిమ దినాన్నీ హృదయపూర్వకంగా విశ్వసించనివారు అల్లా్‌హకు అయిష్టులవుతారు’’ అని చెబుతోంది దివ్య గ్రంథమైన ఖుర్‌ఆన్‌. ఈ మాటలతో స్ఫూర్తి చెందిన బనీ ఇస్రాయీల్‌ వంశంలోని ఒక వ్యక్తి ‘సదఖా’ (దానం) చెయ్యాలని అనుకున్నాడు. ఒక రోజు రాత్రివేళ అతను ఇంటి నుంచి బయలుదేరాడు. మధ్యలో తనకు కనబడిన ఒక వ్యక్తికి కొంత డబ్బు దానం చేసి, తిరిగి వచ్చాడు.


మర్నాడు ఉదయం అతను బజారుకు వెళ్ళినప్పుడు ‘‘ఎవరో ఒక వ్యక్తి దొంగకు దానం చేసి పోయాడట’’ అని నలుగురూ అనుకుంటూ ఉంటే విన్నాడు. తన దానం నిష్ఫలమయిందని బాధపడ్డాడు. ‘అంతా ఆయన (అల్లాహ్‌) కరుణే’ అని సమాధానపడ్డాడు. 


రెండవ రోజు రాత్రి అతను ఇంటి నుంచి బయలుదేరుతూ ‘ఈ రోజు అర్హత ఉన్నవారికి దానం  చెయ్యాలి’ అనుకున్నాడు. మధ్యలో ఒక స్త్రీ ఎదురయింది. ఆమెకు కొంత సొమ్ము దానం చేశాడు. మరుసటి రోజు ఉదయం బజారుకు వెళ్ళగా ‘‘ఎవరో ఒక వ్యక్తి వేశ్యకు దానం చేశాడట’’ అని ప్రజలు అనుకోవడం విన్నాడు. తన రెండో దానం కూడా నిష్ఫలం అయిందని చింతించాడు. ఈ సారైన అర్హత ఉన్న బీదవాడికి డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు. మూడో రోజు రాత్రి తనకు దారిలో తారసపడిన ఒక వ్యక్తికి దానం చేశాడు. తరువాతి రోజు బజారులో ‘‘ఎవరో ఒక వ్యక్తి ధనవంతుడికి దానం చేసి వెళ్ళాడట’’ అనే జనం మాటలు వినిపించాయి. తన దానం ఒక దొంగకు, వేశ్యకు, ధనవంతుడికి చేరడం వల్ల నిష్ప్రయోజనమైపోయిందని ఆవేదన చెందుతూ అతను నిద్రపోయాడు. అల్లాహ్‌ అతని స్వప్నంలో కనిపించి ఆ ముగ్గురికీ చేసిన దానం తనకు ప్రీతిపాత్రమయిందని చెప్పాడు.


అతని నుంచి రహస్య దానం స్వీకరించడం వల్ల... దాత ఔన్నత్యాన్ని గుర్తించిన దొంగ మనసులో మార్పు వచ్చింది. ఇంతకాలం తాను చేసిన పాపాలను అతను తలచుకున్నాడు. వాటికి పరిహారంగా అల్లా్‌హకు క్షమాపణ చెప్పుకున్నాడు. అదే విధంగా వేశ్య తన వృత్తిని మానుకొని, సన్మార్గంలో నడుచుకుంది. ధనవంతుడు లోభత్వాన్ని విడిచిపెట్టి, తన సంపదను అల్లాహ్‌ మార్గంలో ఖర్చు చేయడానికి సంసిద్ధుడయ్యాడు.


‘‘ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో చేసే దానమే ఉత్తమదానం’’ అని అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్‌ అనేవారు. ‘దేవుడు తన పేరుతో... నిండు మనసుతో చేసిన దానాన్నే చూస్తాడు కానీ, దానగ్రహీతల అర్హతలను చూడడు. దాత మనసులోని మంచి ఉద్దేశాన్ని దైవం గ్రహించి, పుణ్యఫలాలను వర్షిస్తాడు.


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-02-25T05:30:00+05:30 IST