ఫోన్‌ క్లీనింగ్‌కు బెస్ట్‌ యాప్స్‌

ABN , First Publish Date - 2020-11-28T09:17:28+05:30 IST

కొత్త ఫోన్‌ కొన్న కొన్ని రోజుల తరవాత మెల్ల మెల్లగా నెమ్మదించడం చాలామందికి అనుభవమే. దీనికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడు ఫోన్లో పేరుకుపోయే భారీ మొత్తంలో అనవసరమైన అప్లికేషన్స్‌,

ఫోన్‌ క్లీనింగ్‌కు బెస్ట్‌ యాప్స్‌

కొత్త ఫోన్‌ కొన్న కొన్ని రోజుల తరవాత మెల్ల మెల్లగా నెమ్మదించడం చాలామందికి అనుభవమే. దీనికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడు ఫోన్లో పేరుకుపోయే భారీ మొత్తంలో అనవసరమైన అప్లికేషన్స్‌, ఫైళ్లు, టెంపరరీ క్యాఛే! వాస్తవానికి ఫోన్‌ క్లీనింగ్‌ అప్లికేషన్స్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది చాలా వాటిని వాడే ఉంటారు. అలాగే ఫోన్‌తో పాటు అంతర్గతంగా కూడా ఇలాంటి సదుపాయాలు పొందుపరచి ఉంటాయి.


ఇప్పటివరకు మీరు వాడిన అధికశాతం అప్లికేషన్స్‌ క్లీనింగ్‌ పేరిట ఫోన్‌ మరింత నెమ్మదిగా పనిచేసే విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అందుకే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పరోక్షంగా చెప్పాలంటే అలాంటివి ‘ప్లేసిబో’ లాంటివి. కేవలం స్ర్కీన్‌పై మాత్రమే గ్రీన్‌ కలర్‌ చూపించి ఫోన్‌ వేగవంతమైనట్లు భ్రమింపజేస్తాయి. వాస్తవానికి ఫోన్‌ చాలా స్లో అవుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా మీ ఫోన్‌కి మరింత మెరుగైన పనితీరు అందించే ఉపయుక్తమైన ఆండ్రాయిడ్‌ క్లీనింగ్‌ అప్లికేషన్స్‌ ఇప్పుడు చూద్దాం.


Files by Google

దాదాపు ప్రతీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌తో పాటు అంతర్గతంగా ఒక ఫైల్‌ మేనేజర్‌ అప్లికేషన్‌ అందించే ఉంటుంది. అయితే గూగుల్‌ సంస్థ తయారు చేసిన ఈ ఊజీజ్ఛూట ఛడ ఎౌౌజజ్ఛూ అప్లికేషన్‌ పైకి చూడటానికి ఒక మామూలు ఫైల్‌ మేనేజర్‌ అప్లికేషన్‌ మాదిరిగా కనిపించినప్పటికీ, అది మరింత శక్తిమంతమైన సదుపాయాలు కలిగి ఉంటుంది. మీ ఫోన్లో అనవసరంగా పేరుకుపోయిన ఫైళ్ళు, డూప్లికేట్‌ ఫైళ్లు, చాలాకాలం నుంచి ఉపయోగించని అప్లికేషన్స్‌ని ఇది గుర్తించి వాటిని సులభంగా తొలగించడానికి అవకాశం కల్పిస్తుంది. సంబంధిత అంశాలు ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ లేదా మెమరీ కార్డులో ఎంత స్థలాన్ని ఆక్రమించాయి అన్నది కూడా ఇది వివరంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా భారీ మొత్తంలో స్థలాన్ని ఆక్రమించిన ఫైళ్లు, వీడియోలు వంటి వాటిని కూడా ఈ అప్లికేషన్‌ ద్వారా గుర్తించవచ్చు. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ ఫోన్లో తక్కువ మెమరీ ఉపయోగించుకుంటూ మెరుగైన ప్రయోజనం కల్పించే అప్లికేషన్‌ ఇది.


Droid Optimize

గూగుల్‌ ప్లేస్టోర్‌లో భారీ మొత్తంలో వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్న అప్లికేషన్‌ ఇది. కొత్తవారు కూడా ఎలాంటి కష్టం లేకుండా సులభంగా ఉపయోగించగలిగే విధంగా దీని యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఉంటుంది. ఒకే ఒక్క బటన్‌ ట్యాప్‌ చేయడం ద్వారా అన్ని రకాల ప్రయోజనాలు పొందే సదుపాయం కూడా దీంట్లో ఉంటుంది. ఇలా బటన్‌ ట్యాప్‌ చేసినప్పుడు ఈ ఫోన్లో ఉండే క్యాఛే, బ్యాక్‌గ్రౌండ్లో రన్‌ అవుతున్న అప్లికేషన్స్‌, మీ ఫోన్లో అనవసరంగా పడిఉన్న ఫైల్స్‌ సులభంగా తొలగిపోతాయి. అంతేకాదు ‘గుడ్‌ నైట్‌ స్కెడ్యూలర్‌’ అనే సదుపాయాన్ని రాత్రి పడుకోబోయే ముందు ఎనేబుల్‌ చేసుకుంటే, మీరు నిద్రపోయే సమయంలో మీ ఫోన్‌ తక్కువ బ్యాటరీ వినియోగించుకునే విధంగా ఆప్టిమైజ్‌ అవుతుంది. అలాగే ఒకేసారి భారీ మొత్తంలో అనవసరమైన అప్లికేషన్స్‌ తొలగించే అవకాశం కూడా ఈ అప్‌ ద్వారా లభిస్తుంది. మిగతా అప్లికేషన్‌లతో పోలిస్తే ఇది చూడటానికి ఆకర్షణీయంగా కనిపించకపోయినప్పటికీ ఎవరైనా సులభంగా వాడగలిగే విధంగా ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌ క్లీనింగ్‌ సదుపాయాన్ని కూడా కలిగి ఉంటుంది.


ఈ విషయంలో జాగ్రత్త!

ఈ అప్లికేషన్స్‌ ముఖ్యమైన ఫైళ్లను, ఫోల్డర్లని తొలగించటం వరకు బాగానే పనిచేస్తాయి. అయితే వీటిలో ఉండే ఆటోమేటిక్‌ క్లీనింగ్‌ సదుపాయాలు అంత ప్రయోజనకరం కాదు. మొదట్లో చెప్పుకొన్నట్లు, ప్రస్తుతం రన్‌ అవుతున్న యాప్స్‌ని ఉన్నపళంగా బలవంతంగా క్లోజ్‌ చెయ్యడం ద్వారా చాలా పెద్ద మొత్తంలో మెమరీ ఖాళీ అయినట్లు కనిపిస్తుంది. కానీ, ఇలా చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో పోలిస్తే ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో మెమరీ నిర్వహణ చాలా శక్తిమంతంగా ఉంటుంది. అన్ని అప్లికేషన్స్‌ మెమరీలో ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోగా, అవి చాలా వేగంగా ఓపెన్‌ అవుతాయి. అలాగే బ్యాటరీ మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది. అలా కాకుండా ఈ అప్లికేషన్స్‌ లో ఉండే ర్యామ్‌ బూస్టర్‌ వంటి సదుపాయాలు వాడి, ప్రస్తుతం రన్‌ అవుతున్న అప్లికేషన్స్‌ని తొలగిస్తే, మళ్లీ వాటిని ఓపెన్‌ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది, తద్వారా బ్యాటరీ బ్యాకప్‌ కూడా తగ్గిపోతుంది. అందుకే ఎలాంటి సదుపాయాలు ఉపయోగకరమో వాటిని మాత్రమే వాడండి.


SD Maid

మీ ఫోన్‌లో ఖాళీగా పడి ఉన్న ఫైళ్లు, ఫోల్డర్లని గుర్తించి ఇది శుభ్రపరుస్తుంది. సహజంగా మనకు మనం అలాంటి వాటిని గుర్తించడానికి సాధ్యపడదు. ఏది ముఖ్యమైన ఫైలో, దేన్ని తొలగిస్తే ఎలాంటి సమస్య వస్తుందో మనకు పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి అలాంటి పనులను ఇలాంటి అప్లికేషన్లకు వదిలిపెట్టడం మంచిది. అలాగే మీ ఫోన్లో ఇన్‌స్టాల్‌ అయిన వివిధ అప్లికేషన్లకు సంబంధించిన డేటాబేస్‌లను ఆప్టిమైజ్‌ చేయటం ద్వారా అవి తక్కువ స్థలాన్ని ఆక్రమించుకునే విధంగా చేయడమే కాకుండా ఫోన్‌ మరింత వేగంగా పనిచేసే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫోన్లో ఉన్న స్టోరేజ్‌ని విశ్లేషించే స్టోరేజ్‌ అనాలసిస్‌, మాస్‌ అప్లికేషన్‌ రిమూవర్‌ వంటి ఇతర మాడ్యూల్స్‌ కూడా దీంట్లో లభిస్తుంటాయి.


CCleaner

డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు వాడుతున్న వినియోగదారులకు సుదీర్ఘకాలంగా సుపరిచితమైన అప్లికేషన్‌ ఇది. అదే సంస్థ నుంచి ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం వాడుతున్న వినియోగదారులకు విడుదలైన వెర్షన్‌ కూడా ఫోన్‌ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. మీ ఫోన్‌లో మీకు తెలీకుండా భారీ మొత్తంలో స్థలాన్ని ఆక్రమిస్తూ ఫోన్‌ నెమ్మది కావడానికి కారణమవుతున్న ఫైళ్లను ఇది సులభంగా గుర్తించి మీకు తెలియజేస్తుంది. అలాగే వివిధ అప్లికేషన్ల క్యాఛేని శుభ్రపరచడం, అనేక రకాల అప్లికేషన్స్‌ తొలగించిన తరవాత, వాటికి సంబంధించి ఖాళీగా ఉన్న ఫోల్డర్లని తొలగించడం, వివిధ అప్లికేషన్లలో ఇంతకుముందు ఓపెన్‌ చేసిన ఫైళ్ల హిస్టరీని తొలగించడం వంటి వివిధ రకాల సదుపాయాలు ఈ యాప్‌లో లభిస్తాయి. ఒకేసారి మనకు అనవసరమైన అప్లికేషన్స్‌ అన్నింటినీ భారీ మొత్తంలో సెలక్ట్‌ చేసుకొని అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకునే అవకాశం కూడా దీనిలో లభిస్తుంది. ఈ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు మీ ఫోనుకు సంబంధించి ప్రస్తుతం లభిస్తున్న సీపీయు, ర్యామ్‌, ేస్పస్‌ వంటి వివరాలను కూడా చూపిస్తుంది దీంట్లో ఉచితం, సబ్‌స్ర్కిప్షన్‌ ఆధారంగా పనిచేసే వెర్షన్లు 

లభిస్తున్నాయి.


All-In-One Toolbox

అనవసరమైన ఫైళ్ళను ఫోన్‌ నుంచి తొలగించడం ఒక్కటే కాదు.. అనేక ఇతర అంశాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించవలసి ఉంటుంది. సరిగ్గా అలాంటి అవసరం కోసమే ఈ అప్లికేషన్‌ పనికొస్తుంది. ఇది మీ సిపియు టెంపరేచర్‌ గమనిస్తుంది, మీ ఫోన్‌ మరింత వేగంగా బూటింగ్‌ అయ్యేవిధంగా సెట్టింగ్స్‌ మారుస్తుంది, మీ వైఫై నెట్‌ వర్క్‌కి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తుంది. అనవసరమైన అప్లికేషన్స్‌ తొలగించటానికి, బ్యాటరీని మరింత ఆదా చేయడానికి సంబంధించిన ఆప్షన్స్‌ కూడా దీంట్లో    లభిస్తుంటాయి. ‘బూస్ట్‌’ అనే సదుపాయం ద్వారా మీ సిస్టమ్‌ క్యాఛేని తొలగించడంతో పాటు, బ్యాక్‌గ్రౌండ్‌ అప్లికేషన్స్‌ని కూడా బలవంతంగా క్లోజ్‌ చేసుకోవచ్చు. అన్ని రకాల టూల్స్‌తో కూడిన సమగ్రమైన అప్లికేషన్‌గా దీన్ని భావించవచ్చు. ఇది కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉచిత, పెయిడ్‌ వెర్షన్లుగా అందుబాటులో ఉంది.


Norton Clean

ప్రముఖ యాంటీ వైరస్‌ సంస్థ నార్టన్‌ స్వయంగా విడుదల చేసిన అప్లికేషన్‌ ఇది. దీని ద్వారా మీ ఫోన్లో అనవసరంగా పడి ఉన్న ఫైళ్ళను తొలగించడమే కాకుండా, వివిధ అప్లికేషన్లను సులభంగా మేనేజ్‌ చేయవచ్చు. అన్ని రకాల అప్లికేషన్లకు సంబంధించి జంక్‌ ఫైళ్లని శుభ్రపరచవచ్చు. ఇది పూర్తిగా ఉచితంగా లభించే అప్లికేషన్‌. అయితే దీంట్లో ప్రాథమికమైన సదుపాయాలు తప్పించి పెద్దగా శక్తిమంతమైన ఫీచర్లు ఉండవు.

నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar

Updated Date - 2020-11-28T09:17:28+05:30 IST