Abn logo
Mar 31 2021 @ 00:19AM

బెంగాల్ నిర్ణయమే భారత్‌ భవిష్యత్తు

భారతదేశం ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, పార్టీ ఆఫీసు బేరర్లతోపాటు పాతిక మందికి పైగా కేంద్రమంత్రులు పూర్తిగా బెంగాల్ పై తమ దృష్టిని కేంద్రీకరించారు. దేశంలోని బిజెపి నేతలు, రాష్ట్రాల మంత్రులు, కార్యకర్తలకు కూడా బెంగాల్‌లో పనిని అప్పజెప్పారు. ఎవరు ఏ పని చేయాలో, ఏ బూత్‌పై దృష్టి కేంద్రీకరించాలో ఢిల్లీ నుంచే నిర్ణయిస్తున్నారు. బెంగాల్‌లో బిజెపికి పెద్దగా కార్యకర్తల బలం ఇంకా ఏర్పడకపోయినా మొత్తం దేశంలోని బిజెపి బలగం అక్కడ మోహరించింది. వీరిని ఎదుర్కొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే రంగంలో కనపడుతున్నారు. ఆమె కుడిభుజాలుగా ఉన్న ముకుల్ రాయ్, సువేందు అధికారితో సహా అనేక మంది తృణమూల్ నేతల్ని బిజెపి తమ వైపు ఆకర్షించగా, మమతా బెనర్జీ విరిగిన కాలుతో వీల్ చైర్‌లో కూర్చుని ప్రచారం చేయాల్సి వస్తోంది. బెంగాలీలు పూర్తిగా తనకు మద్దతు నిచ్చి బిజెపి దాడిని ఎదుర్కొని తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటారని మమతా బెనర్జీ బలంగా విశ్వసిస్తున్నారు. మరో వైపు హిందూ ఓటర్లు తమ వైపు సంఘటితమై హిందూ జాతీయ వాదానికి ప్రతీకగా బిజెపిని గుర్తిస్తారని నరేంద్రమోదీ భావిస్తున్నారు. ఒకరకంగా ఇది ప్రాంతీయ అస్తిత్వ వాదానికీ బిజెపి ప్రచారం చేస్తున్న హిందూ జాతీయ వాదానికీ మధ్య పోరుగా పరిణమిస్తోంది. ఈ రెండింటి మధ్య ఏది గెలుస్తుందన్న దానిపైనే భారత దేశ భవిష్యత్ రాజకీయాల తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు.


అయితే ఈ రెండు భావనల మధ్య నిర్ణయాత్మకమైన అంశాలు లేకపోలేదు. మమతా బెనర్జీ పదేళ్ల పాలన పట్ల ప్రజా వ్యతిరేకత పూర్తిగా లేదని చెప్పేందుకు ఆస్కారం లేదు. స్థానిక నేతలు, అధికారులపైనే ప్రజల ఆగ్రహం కాని మమతా బెనర్జీపై ప్రజల అభిమానం తగ్గలేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి వారు అంటున్నప్పటికీ ఒక ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకతను తక్కువ అంచనా వేయలేము. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత కూడా గతంలో కంటే విస్పష్టంగానే కనిపిస్తోంది. రైతులు, కార్మికులు, ప్రభుత్వోద్యోగులు, మధ్యతరగతి, గృహిణులు, యువత మోదీ పట్ల భ్రమలు కోల్పోయిన వైనం కూడా కనిపిస్తోనే ఉన్నది. మోదీ తనకు తానే ఇప్పుడు దేశమంతా విస్తరించినందువల్ల కేవలం జాతీయ ఎన్నికల్లోనే ఆయన పట్ల వ్యతిరేకత ప్రతిఫలిస్తుందని అనుకోవడానికి వీలు లేదు. మంచైనా, చెడైనా మోదీకి ఆపాదించేందుకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ వీలున్నది. మోదీ పట్ల వ్యతిరేకత పశ్చిమ బెంగాల్‌లో ప్రతిఫలిస్తుందా, లేక మమతా బెనర్జీ పట్ల వ్యతిరేకత కూడా ఉన్నందువల్ల రెండు వ్యతిరేకతలు తటస్థంగా మారుతాయా చూడాల్సి ఉన్నది. మరో వైపు గత ఎన్నికల్లో వామపక్షాలు క్షీణించిన స్థానాల్లో బిజెపి పుంజుకున్నది. ఇప్పుడు వామపక్షాలు- కాంగ్రెస్- ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఎంతో కొంత బలం పుంజుకుంటున్నందువల్ల మమతా బెనర్జీ పట్ల వ్యతిరేకత వల్ల బిజెపి పూర్తిగా లాభపడకుండా అడ్డుకోగలుగుతామని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లాంటి మేధావులు చెబుతున్నారు.


పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ప్రభంజనం వీస్తోందని, తాము 200 సీట్ల దాకా గెలుచుకుంటామని, మొదటి దశ పోలింగ్ జరిగిన 30 సీట్లలో 26 సీట్లు తమకే దక్కుతాయని అమిత్ షా ప్రచారం మధ్యలో ఢిల్లీ వచ్చి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారంటేనే బిజెపి ఊపు పట్ల దేశ వ్యాప్తంగా ఒక అభిప్రాయం కలిగించేందుకేనన్న విషయం స్పష్టమవుతోంది. ఈ ఊపు వాపా, బలుపా అని చెప్పేందుకు ఇప్పుడే ఏ కొలమానాలు లేవు. కాని ఎన్నికల మధ్యలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజులు బంగ్లాదేశ్ వెళ్లి ఆ దేశ స్వర్ణ జయంతి, బంగ్లా జాతిపిత ముజిబుర్ రహ్మాన్ శతజయంత్యుత్సవాల్లో పాల్గొన్నారంటేనే పశ్చిమ బెంగాల్‌కు ఆయన ఎంత ప్రాధాన్యత నిచ్చారో అర్థమవుతోంది. నిజానికి ఆయన ఢిల్లీ నుంచే వీడియో ద్వారా ఒక మహా ప్రసంగాన్ని పంపవచ్చు. భారత దేశంలోనే కాక, బంగ్లాదేశ్‌లో కూడా కరోనా ప్రబలుతున్న సమయంలో ఆయన దాదాపు 15 నెలల తర్వాత తన మొట్టమొదటి పర్యటనను ఆ దేశంలో జరిపేందుకు ఎన్నికల రాజకీయాలు తప్ప బృహత్తర కారణాలు ఏమీ లేవు. కుదుర్చుకున్న గొప్ప ఒప్పందాలు కూడా ఏమీ లేవు. రెండు రోజులు బంగ్లాదేశ్‌లో గడిపిన నరేంద్రమోదీ ప్రధానంగా అక్కడ ఒరకడిలోని మతువా మందిరానికి వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశ విభజన తర్వాత మతువాలు లేదా నామశూద్రులుగా పేరొందిన అనేకమంది షెడ్యూల్డు కులాల వారు పశ్చిమ బెంగాల్‌కు వలస వచ్చారు. బంగ్లాదేశ్‌లోనే మతువాలు కోటిమంది ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో మూడున్నర కోట్లమంది ఉంటారని అంచనా. మతువాలను మెప్పిస్తే కనీసం 30 నుంచి 50 నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని మోదీకి తెలుసు. జంగల్ మహల్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న బంగ్లాదేశీ శరణార్థులను, ముఖ్యంగా మతువాలను తమ వైపుకు తిప్పుకునేందుకు గత కొన్నేళ్లుగా బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు పరాకాష్ట నరేంద్రమోదీ బంగ్లాదేశ్‌లో వారి మందిరాన్ని సందర్శించడం. ఒక్క సీటునైనా వదులుకోకుండా బిజెపి చెమటోడుస్తుందని, అన్ని వ్యూహాలను అమలు పరుస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటనలో మతువా మందిరాన్ని సందర్శించడం ద్వారా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, కమిషన్ దాన్ని పట్టించుకుంటుందని భావించడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది.


పశ్చిమ బెంగాల్‌లో కొన్ని సీట్లకోసం నరేంద్రమోదీ బంగ్లాదేశ్ వెళ్లడం వల్ల ఆయన లక్ష్యం ఎంతమేరకు నెరవేరుతుందో చెప్పలేం కాని బంగ్లాదేశ్‌లో మాత్రం ఆయన తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. మోదీ పర్యటన సందర్భంగా జరిగిన నిరసన ప్రదర్శనలను అణిచివేసేందుకు బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాలను దించాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ అంతటా అనేక చోట్ల జరిగిన హింసాకాండలో పదిమంది మరణించారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. నిరసన ప్రదర్శనల్లో జనాన్ని సేకరించకుండా ఉండేందుకు ఫేస్‌బుక్పై ఆంక్షలు విధించారు. మోదీ బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టేందుకు వారం రోజులముందునుంచే రాజధాని ఢాకాలో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. ఢాకా యూనివర్సిటీ కూడా రణరంగంగా మారింది. బంగ్లాదేశ్‌ను ఒక లౌకికవాద దేశంగా మార్చేందుకు కలలుకన్న ముజిబుర్ రహ్మాన్ శతజయంతి ఉత్సవాలకు మోదీని ఆహ్వానించడం సరైన నిర్ణయం కాదని యూనివర్సిటీ అధ్యాపకులు, మేధావులు ప్రకటనలు జారీ చేశారు. ఒకవైపు భారత్‌లో బంగ్లాదేశీయుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ, సరిహద్దుల్లో హతమారుస్తూ, శిబిరాలకు తరలిస్తూ ఉంటే మోదీని ఆహ్వానించడమేమిటని వారు ప్రశ్నించారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని దేశానికి పట్టిన చెదలుగా అమిత్ షా అభివర్ణించడం అక్కడ తీవ్ర విమర్శలను రేకెత్తించిది. ఈ పరిస్థితుల్లో ‘మేము ఒక దేశ ప్రధానిని పిలిచాము కాని ఒక వ్యక్తిని కాదు..’ అని బంగ్లాదేశ్ మంత్రి, అధికార పార్టీ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్ స్పష్టం చేయాల్సి వచ్చింది. ‘సరిహద్దుల్లో జరుగుతున్న ఘటనలను నిలిపివేయండి’ అని స్వయంగా హసీనా ప్రధానమంత్రి మోదీని అభ్యర్థించారు. నిజానికి పౌరసత్వ చట్టం, ఢిల్లీ అల్లర్ల తర్వాత పలువురు బంగ్లాదేశీ మంత్రులు భారత్‌లో తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. సంయుక్త నదీ జలాల కమిషన్ సమావేశాలకు కూడా బంగ్లా ప్రతినిధులు రాలేదు.


ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారంలోకి రాగలుగుతున్నారు. ప్రతిపక్షాలు బలహీనం కావడం ఇందుకు కారణం, ప్రతిసారీ ఎన్నికలు వివాదాలు, తీవ్రంగా హింసాకాండ, భారీ రిగ్గింగ్, ప్రతిపక్ష నేతల్ని భయభ్రాంతుల్ని చేయడం మధ్యనే జరుగుతున్నాయి. 2014లో ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించడంతో సగం సీట్లలో హసీనా ఎలాంటి పోటీ లేకుండా గెలిచారు. 2019 ఎన్నికల్లో 300 సీట్లలో ఆమె 288 సీట్లు సాధించారు. బంగ్లాదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా బూటకమని అంతర్జాతీయ సంస్థలు అభివర్ణించాయి. పత్రికా స్వేచ్ఛను కాలరాచి, పార్లమెంటరీ ప్రమాణాలను దిగజార్చి, ప్రతిపక్షాలను భయభ్రాంతుల్ని చేసి అక్రమ హత్యలు, ప్రత్యర్థులను అదృశ్యం చేయడం ద్వారా గెలిచారని, క్రిందిస్థాయి ఉద్యమాలను పాశవికంగా అణిచివేశారని న్యూయార్క్ టైమ్స్, ఎకనామిస్ట్ పత్రికలు వ్యాఖ్యానించాయి. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా విజయానికీ, భారత్‌లో మోదీ సాధిస్తున్న విజయాలకూ పోలిక ఉన్నదని చెప్పడానికి వీలు లేదు కాని, పశ్చిమ బెంగాల్‌తో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత భారత్ కూడా బంగ్లాదేశ్ మార్గంలో పయనిస్తుందా అని అంచనా వేయడానికి అవకాశం ఉన్నది.

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Advertisement