డొంక కదులుతోంది!

ABN , First Publish Date - 2021-02-24T04:34:41+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కల్యాణలక్ష్మి అక్రమాల కేసులో తీగలాగే కొద్ది డొంక కదులుతోంది. హత్య కేసుతో బయటపడిన అక్రమాల బాగోతం కేసు తుది దశకు చేరుకోవడంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా యి. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో కదిలిన ప్రభు త్వం ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే.

డొంక కదులుతోంది!

తుది దశకు కల్యాణలక్ష్మి అక్రమాల కేసు

నిందితుల్లో కొంత మంది రెవెన్యూ ఉద్యోగులు

పోలీసు, రెవెన్యూ దర్యాప్తులకు కుదరని పొంతన

పూర్తిగా సైలెంటైన రాజకీయ నేతలు

అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కల్యాణలక్ష్మి అక్రమాల కేసులో తీగలాగే కొద్ది డొంక కదులుతోంది. హత్య కేసుతో బయటపడిన అక్రమాల బాగోతం కేసు తుది దశకు చేరుకోవడంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా యి. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో కదిలిన ప్రభు త్వం ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. సుమారుగా రూ.5కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు భావించిన పోలీసు, రెవెన్యూ అధికారులు వేర్వేరుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 111 అక్రమాలు జరిగాయని పోలీసులు తేల్చగా.. రెవెన్యూ అధికారులు మాత్రం 87 దరఖాస్తుల్లోనే అక్రమాలు జరిగాయని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.  పలువురు నేతలపై ఆరోపణలు రావడంతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో పనిచేసిన సీనియర్‌ అసిస్టెంట్‌ నదీమ్‌ను అరెస్టు చేసి జైలు కు పంపారు. అలాగే నేరడిగొండ తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ను తొలగించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇచ్చోడ మీ సేవ కేంద్రం నిర్వాహకులు సిందే అచ్చుత్‌, జాదవ్‌శ్రీనివాస్‌ హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైనట్లు తెలుస్తోంది. నిందితులతో పాటు మరికొంత మంది ఉద్యోగుల హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.   

రెవెన్యూ ఉద్యోగులు ఎవరు..?

కల్యాణలక్ష్మి అక్రమాల కేసులో కొంత మంది రెవెన్యూ ఉద్యోగులకు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పదిహేను మంది ఉద్యోగులను ప్రశ్నించిన పోలీసులు కొంత మందిని ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అక్రమాల చిట్ట పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. నదీంతో పాటు మరికొంత మంది ఉద్యోగులకు తెలిసే ఈ అక్రమదందా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన ఓ అధికారితో పాటు మరికొంత మందికి కల్యాణలక్ష్మి అక్రమాలతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు ఉద్యోగులతో పాటు మీ సేవ నిర్వాహకులను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే అక్రమార్కుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారనే సమాచారం లీక్‌ కావడంతో ఎవరై ఉంటారనే చర్చ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎవరి లెక్క వారిదే..

కల్యాణలక్ష్మి అక్రమాల కేసులో వేర్వేరుగా దర్యాప్తు జరిపిన పోలీసులు రెవెన్యూ అధికారులు ఎవరి లెక్క వారే చెబుతున్నారు. దీంతో ఎలాంటి పొంతన లేకుండా పోతోంది. పోలీసుల లెక్కల ప్రకారం గతంలోనే 111 లబ్ధిదారులు అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. మళ్లీ తాజాగా మరో 15 మంది నకిలీ లబ్ధిదారులు ఉంటారని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం 126 మంది లబ్ధిదారుల పెళ్లి సహాయం పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతుంది. ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అలాగే రెవెన్యూ అధికారులు చేపట్టిన దర్యాప్తులో ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజక వర్గాల్లో 87 మంది లబ్ధిదారుల దరఖాస్తులు నకిలీవని గుర్తించారు. అంటే దాదాపుగా 40కి పైగా అక్రమాలు తేడా రావడంతో గందరగోళ పరిస్థితికి దారి తీస్తోంది. మొత్తానికి రెవెన్యూ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు రావడంతో కొన్ని కేసులను తక్కువ చేసి చూపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  

నోరు మెదపని నేతలు..

ప్రధానంగా బోథ్‌ నియోజక వర్గంలో కల్యాణలక్ష్మి అక్రమాల బాగోతం బయట పడడంతో అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి మరీ.. మీరంటే మీరే అంటూ ఆరోపణలు చేసుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల చేతికి చిక్కిన అక్ర మాల జాబితాలో  అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతల పేర్లు వారి బంధువుల పేర్లు బయట పడడంతో అంతా సైలెంట్‌ అయిపోయారు. గత రెండు మూడు నెలల నుంచి దర్యాప్తు జరుగుతున్న ఏ ఒక్క నేత నోరు మెదపక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలపై ఆరోపణలు రావడంతో పార్టీ పెద్దలతో మాట్లాడి వారి పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2021-02-24T04:34:41+05:30 IST