మోగిన నగారా

ABN , First Publish Date - 2021-01-24T08:40:39+05:30 IST

పంచాయతీ ఎన్నికల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శనివారం శ్రీకారం చుట్టింది. నాలుగు విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు గాను.

మోగిన నగారా

  • పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్‌ జారీ 
  • 11 జిల్లాల్లో 11 డివిజన్లలో నిర్వహణ
  • విజయనగరం, ప్రకాశం జిల్లాలకు మినహాయింపు
  • రేపు జిల్లాల్లో నోటీసులు
  • రేపటి నుంచి 27 వరకు నామినేషన్లు
  • ఫిబ్రవరి 5న పోలింగ్‌
  • 28న పత్రాలు, 29న అభ్యంతరాల పరిశీలన
  • 31న ఉపసంహరణకు తుది గడువు
  • ఉ.6.30-మధ్యాహ్నం 3.30 మధ్య
  • ఫిబ్రవరి 5న పోలింగ్‌
  • 4 గంటల నుంచి ఓట్ల లెక్కింప వెంటనే ఫలితాల వెల్లడి
  • తర్వాత ఉపసర్పంచ్‌ ఎన్నిక
  • అంతటితో తొలి దశ పూర్తి
  • ఈ నెల 29న రెండో దశకు నోటీసులు


అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శనివారం శ్రీకారం చుట్టింది. నాలుగు విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు గాను.. తొలి దశకు నోటిఫికేషన్‌ జారీచేసింది. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న  సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ ఎన్నికతో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ప్రకటించారు. జిల్లాల్లో సోమవారం (ఈ నెల 25న) రిటర్నింగ్‌ అధికారి  (ఆర్వో-కలెక్టర్‌) ఎన్నికల నోటీసు జారీచేస్తారు. అదే రోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 27న నామినేషన్ల దాఖలుకు తుదిగడువు. 28న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన, 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు, అనంతరం పోటీ ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల, ఫిబ్రవరి 5న పోలింగ్‌. ఈ ఎన్నికల కోసం పోలింగ్‌ గతంలో మాదిరిగా కాకుండా ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల మధ్య నిర్వహిస్తారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, దాని తర్వాత ఉపసర్పంచ్‌ ఎన్నికను పూర్తి చేస్తారు. తొలి విడత నుంచి విజయనగరం, ప్రకాశం జిల్లాలను మినహాయించారు. మిగతా 11 జిల్లాల్లో 11 రెవెన్యూ డివిజన్లలోని పంచాయతీల్లో తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది.


9న రెండో దశ పోలింగ్‌.. 

రెండో దశ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 29న జిల్లాల రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నోటీసులు విడుదల చేస్తారు. అదే రోజు నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన.. 2న వాటిపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన.. 3న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం.. 4న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు.. అనంతరం పోటీ ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య  పోలింగ్‌ నిర్వహిస్తారు. ఆ వెంటనే సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లు లెక్కించి.. ఫలితాలు వెల్లడిస్తారు. తర్వాత ఉపసర్పంచ్‌ ఎన్నికను పూర్తి చేస్తారు.


మూడో దశకు 2న నోటీసు..

మూడో దశ ఎన్నికల ప్రక్రియకు ఫిబ్రవరి 2న ఎన్నికల నోటీసులు జారీ అవుతాయి. అదే రోజు నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5న నామినేషన్లు పరిశీలిస్తారు. 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. 7న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 8న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు.  అనంతరం పోటీ ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 13 ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలు వెల్లడించి ఉపసర్పంచ్‌ ఎన్నికను పూర్తి చేస్తారు.


17న నాలుగో దశ పోలింగ్‌..

నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు ఫిబ్రవరి 6న ఆర్వోలు నోటీసులు విడుదల చేస్తారు. అదే రోజు నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ఉంటాయి. 11నఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 12న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 17న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య పోలింగ్‌ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లు లెక్కించి.. ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నికను పూర్తి చేస్తారు.


తొలి దశ పంచాయతీలు..

శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లోని అన్ని పంచాయతీలు.. టెక్కలి డివిజన్‌లో జలుమూరు మండలంలోని పంచాయతీలు.. పాలకొండ డివిజన్‌లో సరవకోట మండలంలోని పంచాయతీలు..


విశాఖపట్నం: విశాఖ రెవెన్యూ డివిజన్‌.


తూర్పు గోదావరి: అమలాపురం రెవెన్యూ డివిజన్‌.


పశ్చిమ గోదావరి: ఏలూరు డివిజన్‌.


కృష్ణా: నూజివీడు డివిజన్‌.


గుంటూరు: గుంటూరు రెవెన్యూ డివిజన్‌.


నెల్లూరు: నెల్లూరు రెవెన్యూ డివిజన్‌.


కర్నూలు: ఆదోని డివిజన్‌.


అనంతపురం: పెనుకొండ డివిజన్‌.


కడప: జమ్మలమడుగు డివిజన్‌లోని అన్ని పంచాయతీలు. చక్రాయపేట, ఎర్రగుంట్ల మండలాల్లోని పంచాయతీలు.


చిత్తూరు: తిరుపతి రెవెన్యూ డివిజన్‌

Updated Date - 2021-01-24T08:40:39+05:30 IST