జింకల అందాలు.. ప్రకృతి సోయగాలు

ABN , First Publish Date - 2022-05-29T05:46:34+05:30 IST

జింకల అందాలు.. ప్రకృతి సోయగాలు

జింకల అందాలు.. ప్రకృతి సోయగాలు
శామీర్‌పేటలో జింక పార్కులోని జింకలు


  • సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్న జింకల పార్కులు 
  • మేడ్చల్‌ జిల్లా నారపల్లి, శామీర్‌పేటల్లో ఏర్పాటు 
  • పార్కుకు సమీపంలో మైమరపిస్తున్న శామీర్‌పేట్‌ చెరువు అందాలు
  • ఉల్లాసం పంచుతున్న పక్షుల కిలకిలారావాలు 
  • నగరం నుంచి వారంతాల్లో భారీగా పర్యాటకులు
  • రెండు పార్కుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం
  • సంతతి వృద్ధితో అమ్రాబాద్‌, కాగజ్‌నగర్‌ అడవులకు జింకల తరలింపు

రక్షిత అటవీ ప్రాంతాలు అంతరించిన నేపథ్యంలో వన్యప్రాణులను సంరక్షించేందుకు అర్బన్‌ ఫారెస్ట్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగాంగానే ఏళ్ల కిందనే నగరానికి సమీపంలోని నారపల్లి, శామీర్‌పేట ప్రాంతాల్లో జింకల పార్కులను అభివృద్ధి చేశారు. అటవీ శాఖ పర్యవేక్షణలో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ పార్కుల్లో జింకలు, దుప్పులు, లేళ్లు తదితర వన్యప్రాణుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. సంఖ్య పెరిగిన చోట్ల నుంచి రాష్ట్రంలోని ఇతర అభయారణ్యాలకూ జింకలను తరలిస్తున్నారు. జింకల పార్కుల్లోని వృక్షాలు వందల రకాల పక్షులకు ఆవాసాలుగా మారాయి. వివిధ పక్షులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

మేడ్చల్‌, మే 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అడవులు అంతరిస్తుండడంతో వన్య ప్రాణులకు నిలువ నీడలేక లేకుండా పోయింది. జింకలు, లేళ్లు, ఏనుగు తదితర వన్య ప్రాణులు, పులులు, సింహాలు, చిరుత పులి వంటి క్రూరమృగాలు, రకరకాల పక్షులు జూపార్కులు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో తప్ప వేరేచోట్ల కన్పించడం లేదు. పట్టణీకరణతో అడవులు అంతరిస్తున్నాయి. దీంతో వన్యప్రాణులు, పక్షులు, జంతువుల సంతతీ తగ్గింది. ఈ పరిణామాల నేపథ్యంలో అటవీశాఖ వన్యప్రాణుల సంరక్షణకు కంకణం కట్టుకుంది. దీనిలో భాగంగానే మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట, నారపల్లి జింకల పార్కులు, హరిణి కేంద్రాలు జంతువులతో పాటు చూసే వారికీ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మేడ్చల్‌, నాగారం, శామీర్‌పేటల్లో ఆక్సిజన్‌ పార్కులు, శామీర్‌పేట, నారపల్లి జింకల పార్కులు పర్యాటక అందాన్ని పంచుతున్నాయి.

అటవీశాఖ పర్యవేక్షణలో రెండు జింకల పార్కులు

1975లో శామీర్‌పేట మండల పెద్దచెరువు శివారులో 28హెక్టార్ల వైశాల్యంలో జింకల పార్కును ఏర్పాటు చేశారు. 1982లో ఉప్పల్‌ పరిధిలోని నారపల్లిలో రహదారి పక్కన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు 10హెక్టార్లలో జింకల పార్కును ప్రారంభించారు. ఈ పార్కుకు స్వయంగా ఆయన రెండు జింకలనూ బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ పార్కులో వందపైగా జింకలున్నాయి. శామీర్‌పేట పార్కులో 71 జింకలు ఉన్నాయి. నారపల్లి జింకల హరిణి పార్కుకు సందర్శకులు, పర్యాటకుల ద్వారా నెలకు రూ.3లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. అదే శామీర్‌పేట జింకల పార్కుకు రూ.30వేల వరకు ఆదాయం వస్తోంది.

పెద్ద చెరువు చెంత పక్షుల కిలకిలారావాలు

జింకల పార్కు శామీర్‌పేట్‌ చెరువుకు ఆనుకొని ఉంది. పెద్ద చెరువు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. రాజీవ్‌ హైవే పక్కనే ఉంది. దీంతో పర్యాటకులు ఇక్కడ ఆగి చెరువు అందాల్ని తిలకిస్తున్నారు. చెరువు దగ్గరున్న అమ్మవారి ఆలయం వద్ద ప్రతీ వారం భక్తులు బోనాలు సమర్పిస్తారు. అనంతరం విందు భోజనాలు ఆరగిస్తారు. వారాంతాల్లో పర్యాటకులు శామీర్‌పేటలోని రిసార్ట్స్‌కు వస్తుంటారు. ఈక్రమంలో పర్యటకులు జింకల పార్కును సందర్శిస్తారు. చెరువు, జింకల పార్కు, పక్షుల సంరక్షణ కేంద్రంతో ఇక్కడ ప్రకృతి రమణీయతకు పర్యాటకులు ముగ్ధులవుతున్నారు. జింకలపార్కు, చెరువు పరిసరాల్లో 150 రకాలు పక్షులు కన్పిస్తున్నాయి. ఇక్కడ పక్షులు, 28 హెక్టార్ల వైశాల్యంలో అనేకానేక వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

జింకల పార్కు అభివృద్ధికి రూ.5కోట్లు

పర్యాటకులకు నాలుగున్నరేళ్లుగా జింకల పార్కు ఆహ్లాదాన్ని పంచుతోంది. పార్కు విస్తీర్ణం సైతం పెద్దగానే ఉంది. అయితే ఈ పార్కు 4.07హెక్టర్లలోనే విస్తరించడంతో పర్యాటకులు జింకలను చూసి వెనుదిరుగుతున్నారు. ఇంత పెద్ద విస్తీర్ణంలో వివిధ పర్యాటక ఆసక్తి పనులు చేపడితే మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. నగరానికి 35కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న శామీర్‌పేట జింకల పార్కును మరింత అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకులు రెట్టింపయ్యే అవకాశం ఉంది. పిల్లాపాపలతో వచ్చినా ఉండేలా వివిధ వసతులు, తినుబండారాల దుకాణలు నెలకొల్పాల్సి ఉంది. పార్కులోని  వ్యూపాయంట్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తే మరింత మంది పర్యాటకులు వచ్చే ఆస్కారం ఉంది. అటవీశాఖ రాష్ట్ర అధికారి శాంతకుమారి ఇటీవలి కాలంలో శామీర్‌పేటలోని జింకల పార్కును సందర్శించారు. సందర్శకుల కల్పించాల్సిన సౌకర్యాలు, జింకల సంతతి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఫారెస్ట్‌ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. దీంతో జిల్లా అటవీ శాఖ అధికారులు వివిధ అభివృద్ధి పనులకు రూ.ఐదు కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అయితే ఈ స్థలం రెవెన్యూ శాఖ పరిధిలో ఉందని, అటవీ శాఖ కోట్లు వెచ్చించి జింకల పార్కును అభివృద్ధి చేస్తే భవిష్యత్తుతో పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందిగ్ధంలో అటవీశాఖ అధికారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థలాన్ని పూర్తిగా అటవీ శాఖకు బదిలీ చేస్తే అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు అవకాశం ఉందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. మేడ్చల్‌ జిల్లాలో 1,280 హెక్టార్లలో అడవులను అభివృద్ధి చేస్తున్న అటవీశాఖ జింకల పార్కునూ సందర్శకులకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.  వన్యప్రాణులు సంరక్షణతో పాటు పర్యాటక శోభ కూడా వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Updated Date - 2022-05-29T05:46:34+05:30 IST