కథకుల దారిదీపం

ABN , First Publish Date - 2022-01-17T06:03:46+05:30 IST

చాసో పేరు విననివారు తెలుగు సారస్వతంలో వుండరనుకుంటాను. కథలు రాసేవాళ్ళయితే ఆయన కథలు కొన్నైనా చదివుంటారు. ‘వాయులీనం’, ‘కుంకుడాకు’, ‘పరబ్రహ్మము’, ‘ఎంపు’, ‘ఏలూరెళ్ళాలి’, ‘జంక్షన్‌లో బడ్డీ’, ‘బండపాటు’ వంటి కథలు...

కథకుల దారిదీపం

చాసో పేరు విననివారు తెలుగు సారస్వతంలో వుండరనుకుంటాను. కథలు రాసేవాళ్ళయితే ఆయన కథలు కొన్నైనా చదివుంటారు. ‘వాయులీనం’, ‘కుంకుడాకు’, ‘పరబ్రహ్మము’, ‘ఎంపు’, ‘ఏలూరెళ్ళాలి’, ‘జంక్షన్‌లో బడ్డీ’, ‘బండపాటు’ వంటి కథలు ఏవో ఒక సంకలనాల్లో తారసపడే వుంటాయి. ఇవన్నీ చిక్కటి ప్లాటు, పాయింటు వున్న కథలు. ఈ కథలలోని వస్తు, శిల్పాల సమన్వయం, కథను నడిపిన చాసో ప్రజ్ఞ - వీటన్నిటిపై ఎంతోమంది సాహితీ విమర్శకులు సవివరమైన విమర్శనం సాహిత్యానికందించారు. విమర్శకులెంత అరటిపండు ఒలిచిపెట్టినట్లు విశ్లేషించి చూపినా గాఢమైన జీవితాంశమున్న ఇటువంటి కథలను చాసో రాసినంత శిల్పసమన్వితంగా అలవోకగా రాయడం బహుశా కొందరికే సాధ్యపడవచ్చు. చిక్కటి ప్లాటు, పాయింటు దొరికితే ఏ కథారచయిత అయినా ఏదో పాట్లుపడి శిల్ప పరిపుష్టంగానో, లోపభూయిష్టంగానో కథ రాసేస్తాడు.


ఎటువంటి ప్లాటు, పాయింటు కనిపించకుండా చాలా సునాయాసంగా కథలు రాయొచ్చుననిపించే కథలనూ చాసో రాశారు. అట్లా అనిపించడము ఆ కథలకున్న లక్షణం వల్ల మాత్రమే. అలా అనిపించిన చాసో కథలన్నీ ‘నేను’ పాత్రతో చెప్పించిన ఉత్తమ పురుష కథలే. వీటిలో ‘బబ్బబ్బా’, ‘దుమ్ములగుండె’, ‘ఊహా ఊర్వశి’, ‘ఏలూరెళ్ళాలి’, ‘బొండుమల్లెలు’, ‘చిన్నాజీ’, ‘ఆవిష్కరణ’, ‘ఊళ్ళోవానలేదు’, ‘కప్ప’, ‘వజ్రహస్తం’.


‘ఏలూరెళ్ళాలి’ మినహా తక్కిన కథల్లో చదువరులకు ఏ ప్లాటూ కనిపించదు. పాయింటు కూడా వుండదు. ‘నేను’ పాత్ర చాలా అలవోకగా, ఆషామాషీగా తన సంగతులేవో చెప్పుకు పోతున్నట్లుంటుంది. చాసో అన్ని కథల్లోనూ కథ చెప్పడంలో ఈ ఆషామాషీ గుణం వుంటుంది గానీ, ఈ ఉత్తమ పురుష కథల్లో ఇది మరింత ఎక్కువగా వుంటుంది. పాఠకులు కథ చదివినట్లు వుండదు. ఎన్నాళ్ళకో కలిసిన స్నేహితుడు లోకాభిరామాయణం చెబుతుంటే విన్నట్లుంటుంది.


‘బబ్బబ్బా’ కథ చదివితే చాసో చిన్ననాటి ముచ్చట్లు తెలుస్తాయి. అందులోనే ఆయన ఎలా పెరిగాడో, పేదలపట్ల ఆయన దృష్టి ఏమిటో, పేదల సావాసంతో రూపొందిన ఆయన స్వభావం ఏమిటో తెలుస్తుంది. బబ్బబ్బబ్బబ్బా.... అనే శబ్దం నోట్లో చేయిమండ పెట్టుకొని అరిచే లయబద్దమైన కేక. ఉత్సాహంగా వేసే ఈల వంటిదే ఇది. కర్నూలు, కడప జిల్లాల్లో ఒకప్పుడు సినిమా థియేటర్లలో తమ అభిమాన హీరో తెరమీదకు రాగానే నేల, బెంచి తరగతుల నుండి ఈలలు, ఈ ‘బబ్బబ్బబ్బబ్బా’లు మారుమోగేవి. ఈ కథ కూడా అటువంటిదే. తన చిన్ననాట, తన విరోధి గుంపుకన్నా పైస్థాయిలో నిలబడి వారిని ఉడికించాలనుకున్న ‘నేను’ పాత్ర, యెదిరిపక్షం కన్నా దిగువమెట్టులో వుండాల్సి వచ్చి, యెదిరివారి బ్బబ్బబ్బా...లను బరించాల్సి వస్తుంది. చాసో ఈ కథను చాలా సునాయాసంగా తన చిన్ననాటి ముచ్చట్లను వినిపించినట్లు నడుపుతాడు. ఉత్తమ పురుషలో చెప్పిన కథలన్నీ ఇంతే సునాయాసంగా చెబుతాడు. ఈ కథలు రాయడం నిజంగా అంత సునాయాసమా?


నిజానికి ఇలాంటివి రచించడం అంత సులభం కాదంటాడు రారా. ‘‘కావాలంటే ఎవరైనా ‘చిన్నాజీ’ లాంటి కథ రాయడానికి ప్రయత్నించి చూడండి, తెలుస్తుంది’’ - అంటాడు రారా ఒక సందర్భంలో. ‘చిన్నాజీ’లో కథ రాయాలని కూర్చున్న కథకుడు, కథరాయడం మానుకొని చిన్నాజీ (ఐదేళ్ళ పాప)తో గడిపేందుకు నిర్ణయించుకోవడమే కథ. కథ చివరలో - ‘‘చిన్నాజీతో ఐదు నిమిషాలు, షేక్స్‌పియర్‌ కామెడీలో రసవంతమైన ఐదు అంకాలపాటి చెయ్యవూ?’’ - ఇది చివరి వాక్యం.


కథలో చాసో ఏమి చెప్పారని ఎవరైనా ప్రశ్నిస్తే, ఆ చివరివాక్యమే జవాబు. చాలదూ!


‘మాతృధర్మం’ కథ హృద్యంగా, కవితాత్మకంగా చెప్పిన ఒక పిట్టల కథ. ఒక పిట్ట పురుగులను వేటాడడం, పుంజు పిట్టతో కలిసి సరస సయ్యాటలాడడం, గుడ్లమీద పొదగడం, ప్రకృతి బీభత్సంలో చెట్టు నేలకొరిగి గూడు చెదిరిపోయి గుడ్లు చితికిపోవడం, పుంజుపిట్టను డేగ తన్నుకుపోవడం, మిగిలిన ఒక గుడ్డును మాత్రం పొదిగి, బయటికి వచ్చిన పుంజుపిల్లకు రెక్కలు వచ్చిన తర్వాత అదే పుంజుపిల్లతో పురుగుల వేటకు వెళ్లడం కథ. ఉల్లాసంగా మొదలై, మధ్యలో విషాదాత్మకమై, అది మరచి తిరిగి తన నిత్యజీవన స్రవంతిలోకి ఎగిరిపోయిన పిట్టకథ. చాలా హృద్యమైన కథ.


మాతృత్వం, ఆదరణ, ప్రేమ - ఇవి కరువైన స్త్రీ వీటికోసం గీత దాటిన సందర్భాలను చాసో ఎప్పుడూ నిరసించలేదు. అట్లాంటి కథల్లో అనివార్యంగా చెప్పాల్సిన రంకు గురించి రాయడానికి చాసో ఎన్నడూ సంకోచించలేదు. సాంప్రదాయవాదులకు భయపడలేదు. 1940లలోనే ఇటువంటి ఇతివృత్తాలతో ‘బదిలీ’, ‘ఏలూరెళ్ళాలి’, ‘లేడీ కరుణాకరం’, ‘కవలలు’ లాంటి కథలు రాసిన గట్స్‌ వున్న రచయిత చాసో. అలాగని కేవలం కామవాంఛతోనే రంకు చేయడాన్ని చాసో ఎప్పుడూ కథాలక్ష్యంగా చేసుకోలేదు. 


‘ఏలూరెళ్ళాలి’ నాకు ఇష్టమైన కథ. ఇందులో ఒక వయస్సు మళ్లిన ఆడిటర్‌కు ఎండవ భార్యగా వచ్చిన మాణిక్యమ్మ, 30-35 యేళ్ళ వయస్సులో 20 యేళ్ళ వయసున్న ‘నేను’ పాత్రను ఆకర్షించి ముగ్గులోకి దింపుతుంది. అప్పుడామెది కామవాంఛే. అది ఆమె శరీరానికి సుఖమిచ్చింది. అయితే ఆ తరువాత ఆమెకు జీవితాంతం రెండు గొప్ప ఆనందాలను ఇచ్చింది ఆ శారీరక బంధమే. కథకుడితో ఒక కొడుకును కంటుంది. ఆ కొడుకే లేకపోయుంటే, భర్త చనిపోయిన తరువాత ఆమె మరుదులు ఆమెను ముండమోయిచ్చి మూలన కూర్చో బెట్టిందురు (ఈ మాటలు మాణిక్యమ్మవే). అట్లా మూలన కూర్చోవాల్సిన మాణిక్యమ్మకు వంశోద్ధారకుడైన కొడుకు వాటాగా ఆస్తి చేతికొచ్చి, తానొక వ్యక్తిత్వం వున్న మనిషిగా మనగలుగుతోంది. ఈ కథలో ఆమె ఒకప్పుడు చేసిన రంకు నిందించాల్సినది కాదు. ఈ కథ రైల్లో ప్రారంభమవుతుంది. రైల్లో బెర్తుపై నిద్రపోతున్న కథకుడిని, మాణిక్యమ్మ ఒకరకమైన అధికారయుతమైన చనువుతో నిద్రలేపడంతో కథ మొదలవుతుంది. కథకుడు ఆమెను గుర్తు పట్టలేకపోతే, తనే గుర్తు చేస్తుంది. రైలు దిగుతూ కథకుడ్ని ఒకసారి ఏలూరు వచ్చిపొమ్మంటుంది. కథకుడు ‘ఏలూరెళ్ళాలి’ అనుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ కథను 1940లలో రాయడానికి రచయితకు, అచ్చేయడానికి సంపాదకుడికి గట్స్‌ వుండాలి మరి. లీగల్‌ బంధాలలో శృంగారం ఎంత శృతిమించినా సరసకథల పేరుతో వేసేవాళ్ళున్నారు గానీ, ఇల్లీగల్‌ బంధాలలో ఎంత సామాజికత వున్నా వేసేవారు ఇప్పటికీ లేరంటే అతిశయోక్తి కాదు.


ఈ దేశ సమాజంలో 80 శాతం జనుల్లోని రోగాలు, కుతంత్రాలు, కృత్రిమాలు, పెళ్లిళ్లు, పురుళ్ళు, అప్పులు, ఆస్తులకోసం పాట్లు తోపాటు రంకులూ... ఇలా సామాన్య జీవితాలన్నింటినీ చాసో సమర్థవంతంగా తెలుగు సారస్వతంలోకి తీసుకువచ్చాడు. కథను ఎంత లాఘవంగా, ఎంత సునాయాసంగా తీసుకుపోవాలో చాసో కథలు చదివితే తెలుస్తుంది. సంభాషణలు సుదీర్ఘంగా వుండవు. అసలు ఒక వాక్యానికి మించి వుండని సందర్భాలే ఎక్కువ. ఆ మాటకొస్తే ఆ వాక్యం కూడా తెగ్గొట్టినట్లు మర్మంగా అనిపిస్తుంది. సంభాషణలు ముందుకు పోయేకొద్దీ మర్మం విడిపోతూ అర్థం బట్టబయలవుతూ పోతుంది.

‘‘నాకేటుంది?’’

‘‘ఉన్నదే’’

‘‘ఉంటే తగువేమి?’’

‘‘ఆ బియ్యమన్నీ వొగ్గేస్తావూ?’’

‘‘వొట్టికెళ్ళు. మాట తిరిగితే వొట్టు’’

ముష్టివాళ్ళ ఆర్థిక రహస్యం చెప్పిన ‘ఎంపు’ కథలో ఈ సంభాషణ ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతి కథలోనూ సంభాషణలు కొండమీద నుండి గులకరాళ్ళమీద నీళ్ళు దొర్లిపోయినట్లు దొర్లిపోతుంటాయి. ఎక్కడా చదువరిని నిలబెట్టవు.

సంభాషణలు రాయడం అంతసుళువా? కానేకాదు. రాస్తే తెలుస్తుంది.

చాసో కథల్లోని సంభాషణల్లో అనేకచోట్ల చమత్కారం తొంగి చూస్తుంటుంది.

‘‘ఎక్కడికో వెళుతున్నట్టున్నారు. నేను ఎదురొస్తున్నాను కదా! మంచి శకునం’’ మార్జొరీ.

‘‘మీ శకునం మంచిది కాదు’’ అన్నాడు కోటేశ్వరరావు

‘‘నాకన్నా మంచి ముత్తైదువ వుంటుందా?’’ అన్నాది మార్జొరీ.

‘‘క్రైస్తవులు ఐదువలు కాదు’’ పక్కనున్న ఎమిలమ్మ అర్థాన్ని లాగింది.

‘‘అదేం కాదు. మార్జొరీ అన్న పేరులోంచి రాకూడని ధ్వని వస్తుంది. మంచి శకునం కాదు’’ అన్నాడు.

‘‘అమ్మో! నన్ను మార్జాలం అంటావా? పిలవండి మీ ఆవిణ్ణి చెబుతాను’’ అన్నాది మార్జొరీ.

బతుకులో బాధలున్నా, వాటికి అలవాటుపడిన దిగువ తరగతి వాళ్ళ సరసోక్తులివి. తన భార్యను మహిళల కోఆపరేటివ్‌ స్టోర్స్‌కు కార్యదర్శిని చేస్తామంటే, అదొద్దు అందులో గుమస్తాపని ఇస్తే చాలు అని అడిగే ‘చన్నీళ్ళు’ కథలోవి ఈ సంభాషణలు.


కథ ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపులే కాదు - కథ చివరివాక్యం చమక్కుమనిపించి, చురుక్కుమని తగిలేలా రాయడం చాసోను చూసే నేర్చుకోవాలి.


‘కలిగున్న అమ్మ కార్యదర్శి అవుతుంది’ అన్నాడు కోటేశ్వరరావు (చన్నీళ్ళు), ‘జ్ఞాపకంగా వుంటుంది లెండి’ అన్నాది రాజ్యం (వాయులీనం), ‘శారద మహాపతివ్రత’ (లేడీ కరుణాకరం), ‘గోడమీంచి ఎగిరి పెద్ద రాబందు లాగా నూరు రెక్కలతో కిందికి దిగుతూ బరువుగా వచ్చిపడ్డాది. ఆంధ్రరాజుల మిలిటరీ భోజనశాల యొక్క మధ్యాహ్నపు ఎంగిలాకుల కట్ట’ (పరబ్రహ్మము). - ఇవి చాసో కథల్లోని ముగింపు వాక్యాలు మచ్చుకు కొన్ని మాత్రమే.


చాసోను చదువకుండా, అధ్యయనం చేయకుండా కథలు రాసేవాళ్లెవరైనా వున్నారంటే, అవి చిక్కటి కథలోఓటికథలో సందేహపడాల్సిందే. ఆ సంగతి విమర్శకులు తేల్చాల్సిందే. కథను పటిష్టంగా చిక్కగా ఎట్లా నడపాలో గుర్తించాలంటే చాసోను చదవాలి. చదవడం కాదు ఆయన కథలను అధ్యయనం చేయాలి. తెలుగు కథకులకు దారిదీపాలుగా నిలిచిన పది పన్నెండుమంది మహారచయితల్లో చాగంటి సోమయాజులు ఒకరు.

(నేడు చాసో జయంతి)

పాలగిరి విశ్వప్రసాద్‌

98665 11616


Updated Date - 2022-01-17T06:03:46+05:30 IST