బార్లు ఓపెన్‌..కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తెరిచేందుకు అనుమతి

ABN , First Publish Date - 2020-09-26T10:21:11+05:30 IST

రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు తిరిగి తెరుచుకోవడానికి అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌

బార్లు ఓపెన్‌..కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తెరిచేందుకు అనుమతి

వరంగల్‌ అర్బన్‌ క్రైం, సెప్టెంబరు 25: రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు తిరిగి తెరుచుకోవడానికి అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌-19 నిబంధనలతో కూడిన జీవోను విడుదల చేశారు. బార్లలో ఉదయం, సాయంత్రం రెండుసార్లు శానిటైజేషన్‌ చేయాలని సూచించారు. బార్లకు వచ్చే వారిని ప్రధానద్వారం వద్దే థర్మల్‌ స్కానింగ్‌ చేయాలని, జ్వరం, అస్వస్థతకు గురైనవారిని లోనికి అనుమతించొద్దని తెలిపారు. బార్‌ లోపల ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ తప్పకుండా మాస్క్‌లు, శానిటైజర్లు వాడేలా చూడాలని జీవోలో పేర్కొన్నారు. బార్‌ షాపుల్లో పనిచేసేవారు తప్పకుండా మాస్క్‌ ధరించి, శానిటైజర్‌ వాడాలని వెల్లడించారు. బార్‌లో గుంపులుగా ఉండకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. బార్‌కు వచ్చి మద్యం సేవించి వెళ్లిన ప్రతీ వ్యక్తి కూర్చున్న ప్రదేశంలో శానిటైజేషన్‌ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా బార్ల అనుమతి రద్దు చేయనున్నట్లు సోమేశ్‌కుమార్‌ హెచ్చరించారు. 

Updated Date - 2020-09-26T10:21:11+05:30 IST