Viral: పెళ్లి బ్యానర్‌పై వివాదాస్పద ఫొటో.. ‘కాళీ’ పోస్టర్‌పై వివాదం చల్లారక ముందే..

ABN , First Publish Date - 2022-07-07T20:13:03+05:30 IST

‘కాళీ’ మాత (Kali Poster Controversy) సిగరెట్ కాల్చుతున్నట్టుగా దర్శకురాలు లీనా మణిమేఖలై (Leena Manimekalai) విడుదల చేసిన పోస్టర్‌పై వివాదం ఇంకా చల్లారక ముందే..

Viral: పెళ్లి బ్యానర్‌పై వివాదాస్పద ఫొటో.. ‘కాళీ’ పోస్టర్‌పై వివాదం చల్లారక ముందే..

కన్యాకుమారి: ‘కాళీ’ మాత (Kali Poster Controversy) సిగరెట్ కాల్చుతున్నట్టుగా దర్శకురాలు లీనా మణిమేఖలై (Leena Manimekalai) విడుదల చేసిన పోస్టర్‌పై వివాదం ఇంకా చల్లారక ముందే మరో హిందూ దైవానికి సంబంధించిన బ్యానర్ కలకలం రేపింది. పరమ శివుడు సిగరెట్ వెలిగించుకున్నట్టుగా (Lord Shiva Lighting a Cigarrette) ఉన్న బ్యానర్ సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా (Viral) మారింది. ఈ బ్యానర్ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో (Kanyakumari District) ఏర్పాటు చేసిందిగా గుర్తించారు. ఈ బ్యానర్ ఏర్పాటు చేసిన వ్యక్తులను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిచి హెచ్చరించారు. బ్యానర్‌పై వివాదం తలెత్తడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయి హిందూ సంఘాలు భగ్గుమనడంతో పోలీసులు ఆ బ్యానర్‌ను తొలగించారు. ఈ ఘటన కన్యాకుమారి జిల్లా తింగళ్ నగర్ సమీపంలోని ఆరోగ్యపురం ప్రాంతంలో వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం ఓ జంట ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి కొడుకు ప్రతీష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ అతని స్నేహితులు వధూవరులు ఉన్న ఫొటోతో బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్‌లో అతని స్నేహితుల ఫొటోలు కూడా ఉన్నాయి. వీటితో పాటు శివుడి ఫొటోలను కూడా బ్యానర్‌పై ప్రింట్ చేశారు. పరమ శివుడు సిగరెట్ వెలిగించుకున్నట్టుగా ఉన్న ఫొటో కూడా ముద్రించడంతో పెను దుమారం రేగింది.



ఇదిలా ఉంటే.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఫిలిం మేకర్‌  లీనా మణిమేఖలై పోస్ట్‌ చేసిన కాళీ మాత పోస్టర్‌ ట్వీట్‌ను.. ట్విటర్‌ భారత్‌లో కనపడకుండా చేసింది. స్వలింగ సంపర్కుల జెండా నేపథ్యంలో కాళీ మాత పాత్రలో లీనా ధూమపానం చేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన లీగల్‌ డిమాండ్‌ మేరకు ఆ పోస్టును భారత్‌లో కనపడకుండా చేసినట్లుగా ట్విటర్‌ పేర్కొంది. మరోవైపు.. కెనడాలోని హిందూ సంఘాల నాయకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ చిత్రానికి సంబంధించి రెచ్చగొట్టే విధంగా ఉన్న అన్ని రకాల సమాచారాన్నీ తొలగించాల్సిందిగా భారత హై కమిషన్‌ కెనడా అధికారులను కోరింది. దీంతో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిలిపివేసినట్లు కెనాలోని ఆగాఖాన్‌ మ్యూజియం ప్రకటించింది. హిందువుల మనోభావాలను కించపరిచినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.



కాగా.. ‘కాళీ మాత మధుమాంసాలు స్వీకరించే దేవతగానే నాకు తెలుసు’ అంటూ వ్యాఖ్యానించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై భోపాల్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. రామ్‌చంద్ర అనే చాయ్‌వాలా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దాఖలు చేశారు. ఇక, ఆమెను అరెస్టు చేయాలంటూ పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. 10 రోజుల్లోగా పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తామని బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి హెచ్చరించారు. అయితే.. కాళీ మాత భక్తురాలిగా బీజేపీ నేతల గూండాగిరీకి భయపడనని మహువా మొయిత్రా తేల్చిచెప్పారు. ఆమె ట్వీట్‌పై విమర్శలు వస్తుండడంతో ఈ వివాదం నుంచి దూరం జరిగేందుకు టీఎంసీ ప్రయత్నించింది. అవి ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలని, వాటిని పార్టీ సమర్థించట్లేదని తెలిపింది.

Updated Date - 2022-07-07T20:13:03+05:30 IST