Abn logo
Sep 28 2021 @ 02:43AM

రాష్ట్రంలో బంద్‌ సంపూర్ణం

  • రోడ్డెక్కిన టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, రైతు సంఘాలు
  • మద్దతిచ్చిన అధికార పార్టీ.. కొత్త సాగు చట్టాల రద్దుకు పట్టు
  • పట్టణాలు నిర్మానుష్యం.. డిపోకే ఆర్టీసీ బస్సులు
  • సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. వాణిజ్య, విద్యాసంస్థలు మూత


(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌)

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు, పలు పార్టీలు సోమవారం దేశవ్యాప్తంగా చేపట్టిన ‘భారత్‌ బంద్‌’ రాష్ట్రంలో సంపూర్ణంగా నిర్వహించారు. ఈ బంద్‌కు ప్రభుత్వం కూడా మద్దతు తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనికితోడు ఓ వైపు వర్షం మరో వైపు బంద్‌ కారణంగా వాణిజ్య సముదాయాలు కూడా మూతబడ్డాయి. దీంతో నగరాలు, పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బంద్‌ ప్రభావం కనిపించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, రైతు సంఘాల నేతలు నిరసనకారులతో కలిసి నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీలో సైతం ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.


దీంతో పాడేరు, అరకు ఇతర మన్యం ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగా మారాయి. విశాఖలో ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ, వామపక్షాలు స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమకారులతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. బ్రాండిక్స్‌ బస్సులను అడ్డుకున్న నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కొన్ని గంటలపాటు మహిళా ఉద్యోగులు బస్సుల్లోనే కూర్చుని వర్షంలో ఇబ్బంది పడ్డారు. విజయవాడలో బస్టాండ్‌ వద్ద వామపక్షాలు నిరసనకు దిగాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకరంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఒంగోలులో కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో ఆత్మకూరు బస్టాండ్‌ వరకు టీడీపీ పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించింది. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో కోటిరెడ్డి సెంటర్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. తిరుపతిలో టీడీపీ, వామపక్షాలు ఎక్కడికక్కడ నిరసనకు దిగాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బస్సులు బస్టాండ్లకే పరిమితమయ్యాయి. అయితే, తిరుమలకు వెళ్లే భక్తుల వాహనాలను ఆందోళనకారులు వదిలిపెట్టారు. అనంతపురం బస్టాండ్‌ వద్ద సీపీఎం, ఇతర సంఘాల నేతలు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దేశ సంపదను కొందరి చేతుల్లో పెట్టాలనే కుట్ర చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఈ బంద్‌తో అయినా కనువిప్పు కలగాలని వ్యాఖ్యానించారు. కర్నూలులో టీడీపీ, వామపక్షాలు ఉదయాన్నే రోడ్డెక్కాయి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ ఆయా పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు.


కేంద్రం అవలంభిస్తున్న విధానాల వల్ల దేశ సంపద కార్పొరేట్‌ వ్యక్తులకు చేరుతోందని ఆరోపించారు. విద్యుత్‌, కార్మిక చట్టాల సవరణ బిల్లులు వెనక్కి తీసుకోవాలని, కార్మికులను యాజమాన్యాలకు కట్టుబానిసలుగా మార్చే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపును నిరసించాయి. భారత్‌ బంద్‌కు లారీ యజమానుల సంఘం మద్దతు తెలిపింది. అయితే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వం సెలవు ప్రకటించడం, ఉదయం నుంచే వర్షం కురుస్తుండటంతో పట్టణాలన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. పశ్చిమ గోదావరిలో తుఫాను ప్రభావంతో జోరున వర్షం కురుస్తున్నా రెట్టించిన ఉత్సాహంతో కార్మికులు, కర్షకులు కదం తొక్కారు. ఐదు వేల మంది జూట్‌ మిల్లు కార్మికులు, 2 వేల మంది హమాలీలు, 500 మంది మున్సిపల్‌ కార్మికలు బంద్‌లో పాల్గొన్నారు. 


అనంతపురం కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు గొర్రుతో రోడ్డుపై దున్ని నిరసన వ్యక్తం చేశారు. చంద్రదండు  ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 


ప్రకాశం జిల్లా ఒంగోలులో కర్నూలు రోడ్డు ప్లైఓవర్‌ బ్రిడ్జి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

 

శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి బి. కృష్ణమూర్తి, సీపీఐ, బీజేపీ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. 


కడప జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, రైతు సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు బంద్‌లో పాల్గొన్నాయి. కోటిరెడ్టి సర్కిల్‌లో టీడీపీ నేతలు కబడ్డీ ఆడగా, కాంగ్రెస్‌ నాయకులు క్రికెట్‌ ఆడి నిరసన వ్యక్తం చేశారు.  


కర్నూలులో ఆటో యూనియన్లు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. ఆదోనిలో నిరుద్యోగులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. 


నెల్లూరు జిల్లాలో టీడీపీ శ్రేణులు మోటారు బైక్‌ ర్యాలీలు నిర్వహించగా, వామపక్షాలు ఎడ్లబండ్లను లాగుతూ పెట్రో ధరలపై నిరసన వ్యక్తం చేశాయి.   


విజయవాడలో ఉదయం 6 గంటల నుంచే బంద్‌ మొదలైంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, ఏపీ రైతు సంఘాల కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు.  


తూర్పుగోదావరి జిల్లాలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీస్‌ బంద్‌కు మద్దతు ప్రకటించింది. బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, పోస్టల్‌ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేశారు. కాకినాడ పోర్టును కూడా అఖిలపక్ష నేతలు మూయించారు. 


విశాఖపట్నం జిల్లాలో జోరువానను సైతం లెక్కచేయకుండా వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలతోపాటు కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు బంద్‌లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.