రచయిత ఆత్మఘోష

ABN , First Publish Date - 2020-06-29T10:52:24+05:30 IST

శీర్షికలో వున్న ‘రచయిత’ అన్న పదాన్ని బహు వచనంగా ఉద్దేశించకపోతే, ఈ ప్రస్తావన పత్రికాముఖంగా తేవలసిన అవసరం ఉండేది కాదు. అంతమాత్రాన ఆ అంశానికేమంత ప్రాధా న్యత వుంది, అంతకంటే ఎంతో ఎక్కువ జనబాహు ళ్యానికి సంబంధించిన ఎన్నో...

రచయిత ఆత్మఘోష

శీర్షికలో వున్న ‘రచయిత’ అన్న పదాన్ని బహు వచనంగా ఉద్దేశించకపోతే, ఈ ప్రస్తావన పత్రికాముఖంగా తేవలసిన అవసరం ఉండేది కాదు. అంతమాత్రాన ఆ అంశానికేమంత ప్రాధా న్యత వుంది, అంతకంటే ఎంతో ఎక్కువ జనబాహు ళ్యానికి సంబంధించిన ఎన్నో సమస్యలున్నాయి కదా, అనవచ్చు. నిజమే. పరోక్ష ప్రభావం చూసే సాహి త్యం కన్నా ప్రజలెదుర్కొంటున్న ప్రత్యక్ష సమస్యలే ముఖ్యమైనవి. అయితే, సమాజ గమనంలో మంచి మార్పు రావడానికి సాహిత్యం తోడ్పడుతుందన్న నమ్మకం ఇంకా వుంది కను కనే ఈ ప్రస్తావన. అటువంటి మార్పు రావడానికి ఎటువంటి  సాహిత్యం అవసరమో చెప్పేదే విమర్శ. విమర్శ సాహిత్యావస రమూ, సామాజికావసరమూ కూడా. 


విమర్శకు మొదటి దశ ఒకటి వుంటుంది. అది సాహిత్యం చదివిన పాఠకుడు తనకు తాను ఒక అభిప్రాయం ఏర్పరచుకో వడం. దాని పరిమితి తనకు నచ్చిందో లేదో చెప్పే వ్యక్తిగత స్థాయిలో వుంటుంది. చదివిన వాళ్ళందరి అవగాహనా విమర్శ స్థాయిలో వుండదు. కానీ ఈ స్థాయిలో (నచ్చిందీ లేనిదీ చెప్పేంత) మాత్రం వుంటుంది. విమర్శ వద్దనడం అంటే సాహిత్యాన్ని వ్యక్తిగత స్థాయికి కుదించడం అవుతుంది కానీ ఆ చర్చ ఇప్పుడొద్దు. విమర్శ వచ్చే పరిస్థితి లేకపోతే, ఈ మాత్రపు గౌరవాన్నయినా సాహిత్యానికి ఇవ్వాలి. అదీ లేకపోతే? లేక అదీ చెప్పే ఓపికో తీరికో లేని నిర్లక్ష్యమే వుంటే? ఈ చివరి రెండు ప్రశ్నలూ వెయ్య డానికి నా అనుభవమే కారణం. ఇది నా ఒక్కడి అనుభవమే కాదనీ, ఎందరో రచయితల అనుభవ మేననీ తెలుసు. ఎందరో రచయితల అనుభవమైన ప్పుడు నీ అనుభవాన్నే ఎందుకు చెబుతున్నట్టు... అనవచ్చు. ఆ ప్రశ్నే నా జవాబు. నా అనుభవమే అందరి అనుభవమూ కనుకనే చెబుతున్నాను. 


‘‘ఫలానా మీ రచన చదవాలనుంది, ఎక్కడ దొరు కుతుంది?’’ అని ఫోన్‌ పలకరింపు వస్తుంది. ‘‘చాలా రోజులుగా వెతుకుతున్నాను, ఏ బుక్‌ షాపులోనూ కనిపించలేదు’’ అన్న పులకరింపూ వస్తుంది. ఆ ఫలానా రచన విడిగా దొరకదనీ, ఆ మధ్య ప్రచురించిన నా రచనల సంకలనంలో మాత్రమే ఉందనీ చెబుతాను. ఆ మాట చెబుతున్నప్పుడే, మూసిన బీరువా నిండా వున్న నా సంకలనం కళ్ళకు కనిపిస్తుంది. నా కళ్ళకేకాక, ఇంకోరి కళ్ళకూ కనిపిస్తే మంచిదే కదా... అనిపిస్తుంది. అలా ఇంకోరికి, ఇంకోరికి... ముప్ఫైమందికి ఆ పుస్తకం చేరింది. అంతమందిలో కొంతమంది నుంచీ ‘‘పుస్తకం అందింది, థ్యాంక్స్‌’’ అన్న మాట అందింది. మరికొద్ది మంది నుంచీ ‘‘తీరిక దొరి కినప్పుడల్లా చదువుతాను’’ అన్న హామీ అందింది. వీరిలో ‘‘పుస్తకం ఎక్కడా దొరకలేదు’’ అన్నవాళ్ళున్నారు. పుస్తకం దొరికాక తీరిక దొరకాలి! పుస్తకం పంపించాం, తీరికనెలా పంపిస్తాం? ఒకరిద్దరు మాత్రం బాగా పొగిడారు. ఈ ప్రతిస్పందన చూశాక ఇంకెవరైనా పుస్తకం కావాలని అడిగితే పంపాలా? వద్దా? వాటిని నా వద్దే ఉంచుకోవడమెందుకు? పంపడం మాత్రం ఎందుకు? ఇవీ ప్రశ్నలు. 


అయినా తెలుగు భాషే వద్దంటున్నప్పుడు, సాహిత్యం చదివేవాళ్ళులేరని ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు? ‘ఏడుపు’ అంటే, ‘అరణ్యరోదన’ అనే మాట జ్ఞాపకం వస్తోంది. అరణ్యంలో ఎంత ఏడ్చినా వినేవాళ్ళుండ రని దానర్థం. ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తాం. వినే వాళ్ళు లేరని ఆగదు, మనం ఆపుకోనూలేం. ఇపుడు నా ఏడుపు కూడా అటువంటిదే.  

ఽ పి. రామకృష్ణ

79951 96133


Updated Date - 2020-06-29T10:52:24+05:30 IST