కాలయాపనెందుకో?

ABN , First Publish Date - 2020-07-06T10:27:26+05:30 IST

విధుల్లో చేరిన ఏడు నెలల్లో ఖమ్మం కార్పొరేషన్‌ పాలనను ఓ గాడిన పెట్టేలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు కమిషనర్‌ అనురాగ్‌

కాలయాపనెందుకో?

ఖమ్మం కార్పొరేషన్‌ ఉద్యోగిపై దాడి జరిగి పక్షం రోజులు 

ఇప్పటికీ చర్యలకు ఉపక్రమించని అధికారులు

ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు

నెల్లూరు ఘటన నేపథ్యంలో స్థానిక ఉద్యోగుల్లో చర్చ


ఖమ్మం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): విధుల్లో చేరిన ఏడు నెలల్లో ఖమ్మం కార్పొరేషన్‌ పాలనను ఓ గాడిన పెట్టేలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు కమిషనర్‌ అనురాగ్‌ జయంతి. అంతేకాదు ఎలాంటి తప్పు జరిగినా సహించేదిలేదంటూ సంకేతాలు ఇస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే కార్పొరేషన్‌ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ చిన్న ఫైలు కూడా ముందుకు కదలకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కేవలం ఫైల్స్‌కి సంబంధించే కాదు ఉద్యోగులు కూడా ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, తప్పులు చేసినా వెంటనే క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించేవారన్న పేరు సంపాదించారు. అందులో భాగంగానే ఈ ఏడు నెలల కాలంలో 14 మంది ఉద్యోగులపై కొన్నాళ్లు సస్పెన్షన్‌ వేటు వేయడమే కాకుండా ముగ్గురు ఉద్యోగులను సరెండర్‌ చేశారు కూడా. కానీ గత నెల 16న కార్పొరేషన్‌లో ఉద్యోగుల కొట్లాట, దాడికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి జరిగి పదిహేను రోజులైనా సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కాగా ఇటీవల ఏపీలోని నెల్లూరు జిల్లా టూరిజం కార్యాలయంలో దాడిఘటన జరగడం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఆ ఘటనపై చర్యలకు ఆదేశించడం లాంటివి వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కార్పొరేషన్‌లో ఆవరణలో సీనియర్‌ అసిస్టెంట్‌పై జరిగిన దాడి ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది. 


రెండు వారాలైనా కానరాని చర్యలు..

కార్పొరేషన్‌లోని ఓ రెగ్యులర్‌ ఉద్యోగిపై కార్యాలయ ఆవరణంలోనే కొందరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు దాడిచేసిన ఘటన జరిగి పదిహేనురోజులైంది. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కానీ ఆ ఘటనకు సంబంధించి కార్పొరేషన్‌ ఉన్నతాధికారులతోపాటుగా, పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదులు అందాయి. అయినా ఇప్పటివరకు అటు కార్పొరేషన్‌ అధికారులు కానీ, ఇటు పోలీసు అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇదే అదనుగా కార్పొరేషన్‌లోని మిగిలిన ఉద్యోగులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇక పోలీసు శాఖకు దాడి జరిగిన రోజు సాయంత్రమే ఇరు వర్గాల వారు ఫిర్యాదులు చేయగా.. ఇప్పటికీ విచారణ చేస్తున్నామని చెప్పడం విశేషం. అదేరోజు దాడి వీడియోలు హల్‌చల్‌ చేసినా, మిగిలిన ఉద్యోగులను పిలిచి విచారణ చేసినా ఇంకా ఎఫ్‌ఐఆర్‌ చేయలేదని సమాచారం. 


కమిషనర్‌ చర్యల కోసం ఎదురుచూపు..

విచారణ పూర్తయిన తర్వాత కమిషనర్‌ ఎవరిపై చర్యలు తీసుకుంటారన్న విషయంపై కార్పొరేషన్‌ అధికారుల్లో చర్చ జరుగుతోంది. కాగా భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఎవరైనా వ్యక్తి ప్రభుత్వోద్యోగి విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిపై దౌర్జన్యం చేసినా, నేరపూరిత బలప్రయోగం చేసినా ... అట్టి ప్రభుత్వ ఉద్యోగి చట్టబద్ధంగా తన విధులను నిర్వర్తించుటలో ఇబ్బందులు కలిగించినా అట్టి వ్యక్తి రెండు సంవత్సరాల వరకు సాధారణ జైలుశిక్షకానీ, జరిమానా విధించే అవకాశం ఉంది. దానితోపాటుగా ప్రభుత్వ ఉద్యోగి దాడి చేసినట్టయితే సదరు అధికారిని సస్పెన్సన్‌ లేదా సరెండర్‌ చేసే అవకాశం, అదే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అయితే రిమూవల్‌ చేసే అధికారం ఉన్నతాధికారులకు ఉంది. కాగా ఇప్పటికైనా సంబంధిత దాడి ఘటనకు సంబంధించి చర్యలకు ఉపక్రమించాలని, తద్వారా మిగిలిన ఉద్యోగుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని కార్పోరేషన్‌ ఉద్యోగులు కోరుతున్నారు. 

Updated Date - 2020-07-06T10:27:26+05:30 IST