మాట్లాడుతున్న చంద్రనాయక్
వెదురుకుప్పం, మే 20: గ్రామీణ కళలను, కళాకారులను విస్మరించిన ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని ఏపీ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ హెచ్చరించారు. శుక్రవారం పచ్చికాపల్లంలోని మహాభారతం మిట్ట ఆవరణలో ఏపీ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు గుర్రప్ప అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గ్రామీణ వృత్తి, జానపద కళలకు జీవం పోసే కళాకారులను ప్రోత్సహిస్తే అక్కడ సమాజం సస్యశ్యామలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ సినిమాల ప్రభావం, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామీణ కళా రూపాలు అంతరించిపోతున్నాయని, కళాకారుల జీవితాలు మసకబారుతున్నాయని అన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో కళాకారులకు అవకాశం కల్పించి, ప్రోత్సహిం చాలని కోరారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎస్.నాగరాజు, కుమార్రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.