Abn logo
Sep 23 2021 @ 23:43PM

నేడు కేంద్ర బృందం రాక

ఉపాధిహామీ పనుల గురించి వివరిస్తున్న డ్వామా పీడీ కూర్మారావు

- ఏడు మండలాల్లో ఉపాధి పనుల పరిశీలన

- ఐదు రోజులపాటు పర్యటన

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 23: జిల్లాకు శుక్రవారం కేంద్ర బృందం రానుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించనుంది. జి.సిగడాం, లావేరు, పోలాకి, రణస్థలం, సంతబొమ్మాళి, నరసన్నపేట, కోటబొమ్మాళి మండలాల్లో ఐదు రోజుల పాటు పర్యటించనుంది. ఈ బృందంలో నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌, కమిషనర్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, సీనియర్‌ ఆడిట్‌ అధికారి ఎంకే గోయల్‌, ఎన్‌ఐ ఆర్‌డీ కన్సల్టెంట్‌ బీఎన్‌ రావు, సభ్యులు కిరణ్మయి, ఆనంద్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ బ్రహ్మంలు ఉన్నారు. వీరంతా 2018 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి నెల వరకు జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ పనులను తనిఖీ చేస్తారు. ఏమైనా అక్రమాలు జరిగితే వెలికితీయనున్నారు.  వేతనదారులు, అధికారులతో మాట్లాడి పనుల వివరాలు తెలుసుకోనున్నారు. 


మానవ వనరులను వినియోగించుకోవాలి 

ఉపాధిహామీ పథకంలో మానవవనరులను వినియోగించుకుంటూ స్థిరాస్తులను సృష్టించాలని కేంద్ర బృందానికి చెందిన సీనియర్‌ ఆడిట్‌ అధికారి ఎంకే గోయల్‌ తెలిపారు. గురువారం డీఎల్‌ఆర్సీ కార్యాలయంలో జిల్లా ఉపాధి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉపాధి పథకంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే పథకం ముఖ్య ఉద్దేశ్యమన్నది అందరూ గ్రహించాలని చెప్పారు. ప్రతికుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించాలని... అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. డ్వామా పీడీ కూర్మారావు మాట్లాడుతూ.. జిల్లాలో 8.47 లక్షల వేతనదారులు ఉన్నట్లు తెలిపారు.  వీరికి 99.93 శాతం చెల్లింపులను సకాలంలో చేస్తున్నట్లు వివరించారు. జీఐఎస్‌ శాటిలైట్‌ మ్యాప్‌ ద్వారా జలవనరుల పనులను గుర్తించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీడీలు రోజారాణి, అప్పలనాయుడు, కేంద్ర బృంద సభ్యులు పాల్గొన్నారు.