అగ్నిపథ్‌తో సైన్యం బలహీనం

ABN , First Publish Date - 2022-06-23T07:37:27+05:30 IST

కేంద్రప్రభుత్వం అగ్నిపథ్‌తో సాయుధ దళాలను బలహీనపరుస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సాగు చట్టాల్లాగే ఈ పథకాన్ని కూడా ప్రధాని మోదీ ఉపసంహరించాల్సి వస్తుందన్నారు.

అగ్నిపథ్‌తో సైన్యం బలహీనం

యుద్ధం వస్తే దీని ఫలితం కనిపిస్తుంది.. సాగు చట్టాల్లాగే దీన్నీ ఉపసంహరించాల్సిందే


రద్దుకు 27న దేశవ్యాప్త ఆందోళన: రాహుల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 22: కేంద్రప్రభుత్వం అగ్నిపథ్‌తో సాయుధ దళాలను బలహీనపరుస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సాగు చట్టాల్లాగే ఈ పథకాన్ని కూడా ప్రధాని మోదీ ఉపసంహరించాల్సి వస్తుందన్నారు. ఐదు రోజుల ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణను ఎదుర్కొన్న రాహుల్‌ గాంధీకి సంఘీభావం తెలిపేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం ఢిల్లీలోని పార్టీ ప్రధానకార్యాలయానికి తరలివచ్చారు.  వారిని ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగిస్తూ ఈడీ విచారణ అనేది ముఖ్యమైన విషయం కాదని, యువత ఉద్యోగాలకు సంబంధించినదే అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. ‘‘యువతకు ఉద్యోగాలు కల్పించలేని ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు ఈ దేశాన్ని ప్రధాని మోదీ అప్పగించేశారు. చివరికి సాయుధ దళాల్లో చేరే అవకాశాన్ని కూడా యువతకు మూసేశారు. ఇప్పుడు సాయుధ దళాల్లో పనిచేసిన తర్వాత ఉద్యోగం రాదని గ్యారెంటీగా చెప్పగలను. చైనా సైన్యం మన భూభాగాన్ని వెయ్యి చదరపు కిలోమీటర్లకుపైగా ఆక్రమించింది. మన సైన్యాన్ని బలోపేతం చేయాల్సి ఉండగా ప్రభుత్వం దాన్ని బలహీనం చేస్తోంది. దీని ఫలితం యుద్ధం వచ్చినప్పుడు తప్పక కనిపిస్తుంది. సాగు చట్టాలను మోదీ వెనక్కి తీసుకుంటారని అప్పుడు చెప్పాను. అగ్నిపథ్‌నూ మోదీ వెనక్కి తీసుకుంటారని ఇప్పుడు చెబుతున్నా. అదే జరుగుతుంది. దేశానికీ, సైన్యానికీ ప్రభుత్వం చేస్తున్న ఈ ‘కొత్త ద్రోహాన్ని’ రద్దు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ కలిసికట్టుగా పోరాడుతుంది’’ అన్నారు. 


నా సహనంపై ఈడీ ఆశ్చర్యం..

ఈడీ విచారణ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు రాహుల్‌ ధన్యవాదాలు తెలిపారు. విచారణ సందర్భంగా తన సహనం, ఓర్పుపై ఈడీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ‘‘ఎంత ప్రశ్నించినా అలసిపోకుండా ఎలా ఉండగలుగుతున్నారని ఈడీ అధికారులు నన్ను ప్రశ్నించారు. నేను విపశ్యనధ్యానం చేస్తుంటానని రెండో కారణాన్ని వారికి చెప్పా. కానీ అసలు కారణం ఏమిటంటే పార్టీ కార్యకర్తలంతా మానసికంగా నాతోనే విచారణ గదిలో ఉన్నారు’’ అన్నారు. కాగా, అగ్నిపథ్‌ రద్దు కోసం ఈనెల 27న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్టు కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. అగ్నిపథ్‌ పథకం అమలయితే దేశాన్ని నిరుద్యోగ వరద ముంచెత్తుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ మీడియాకు చెప్పారు. అగ్నివీరులు నాలుగేళ్ల తరువాత ‘మాజీ సైనికోద్యోగి’ అన్న పేరుతో ఎలాంటి నైపుణ్యాలు లేని వ్యక్తులుగా మిగిలిపోతారన్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతో కార్పొరేట్‌ గొంతులు అగ్నివీరులకు ఉపాధి కల్పిస్తామంటున్నాయని, ఇప్పటికే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వందలాది మాజీ సైనికోద్యోగులకు ఈ ప్రకటనను వర్తింప చేయగలవా అని మొయిలీ ప్రశ్నించారు.


ఇప్పుడే విచారణకు రాలేను.. ఈడీకి సోనియా 

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో విచారణకు ఇప్పుడే హాజరుకాలేనని, తాను పూర్తిగా కోలుకునే వరకు విచారణను వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఈ విజ్ఞప్తిపై ఈడీ సమ్మతించింది. అయితే, తదుపరి విచారణ ఎప్పుడన్నది ఇంకా స్పష్టం చేయలేదు. గత కొంతకాలంగా కొవిడ్‌ అనంతర సమస్యలకు చికిత్స పొందిన సోనియా సోమవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి ఇంటికి చేరారు. ఈడీ అధికారులు పంపిన సమన్ల మేరకు గురువారం ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది.

Updated Date - 2022-06-23T07:37:27+05:30 IST