సమీపిస్తున్న సమ్మక్క జాతర

ABN , First Publish Date - 2022-01-21T03:58:02+05:30 IST

మంచిర్యాలలో ఈ సంవత్సరం సమ్మక్క- సారలమ్మ జాతర నిర్వహణ కత్తిమీద సాములా మారనుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జిల్లా కేంద్రంలోని గోదావరి వద్ద జాతర నిర్వహిస్తారు. జిల్లా నుంచేగాక చుట్టు పక్కల జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

సమీపిస్తున్న సమ్మక్క జాతర
నీట మునిగిన అమ్మవార్ల గద్దెలు

నిండుకుండను తలపిస్తున్న గోదావరి

నీట మునిగిన అమ్మవార్ల గద్దెలు

గడువు సమీపిస్తుండటంతో ప్రజల ఆందోళన 

మంచిర్యాల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాలలో ఈ సంవత్సరం సమ్మక్క- సారలమ్మ జాతర నిర్వహణ కత్తిమీద సాములా మారనుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జిల్లా కేంద్రంలోని గోదావరి వద్ద జాతర నిర్వహిస్తారు. జిల్లా నుంచేగాక చుట్టు పక్కల జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. దూర ప్రాంతాలకు చెందిన ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటు గోదావరి వద్ద బస చేస్తారు. టెంట్లు, గుడారాలు వేసుకొని జాతరలో వనదేవతలను దర్శించుకుంటారు. మూడు రోజుల అనంతరం తిరుగు పయనమవుతారు. జాతర సమయంలో గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారుతుంది. ఈ సంవత్సరం సమ్మక్క- సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు నిర్వహించేందుకు దేవాదాయశాఖతోపాటు జాతర నిర్వహణ కమిటీ  సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. 19న దేవతలు తిరిగి వనఃప్రవేశం చేస్తాయి. 

నీట మునిగిన గద్దెలు

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్‌ పంపింగ్‌ చేస్తుండటంతో గోదావరి ప్రస్తుతం నిండు కుండను తలపిస్తోంది. ఇరువైపులా ఒడ్ల వరకు నీరు నిలిచిపోయింది. పుష్కరఘాట్‌ మెట్ల వరకు నీరు ప్రవహిస్తోంది. గోదావరి ఒడ్డున నిర్మించిన సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు గద్దెలు పూర్తిగా నీటిలో మునిగి ఉన్నాయి. గద్దెల వరకు వెళ్లాలంటే నాటు పడవలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో జాతర నిర్వహణ ఎట్లా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జాతరకు 15 రోజుల గడువు ఉండటం, గోదావరిలో నిండుగా నీరు ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గోదావరిలో నీటిని తొలగించినా గద్దెల ప్రాంతం మొత్తం బురదమయంగా ఉంటుంది. అది పూర్తిగా ఆరేందుకు కనీసం వారం రోజులు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం నేలను చదును చేయడం, ఆ ప్రాంతమంతా ఉనుక, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, లైటింగ్‌, నీటి సరఫరా, విద్యుద్దీకరణ, టాయిలెట్ల నిర్మాణం,  మహిళలు బట్టలు మార్చుకొనే గదుల నిర్మాణం, స్టాల్స్‌ ఏర్పాటు, తదితర పనులు చేపట్టేందుకు కనీసం 10 రోజులైనా పడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జాతరకు ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

స్థలం ఎంపికలో జాప్యం

కరోనా ప్రభావం తగ్గుముఖం పడితే జాతర యథావిధిగా జరుగుతుంది. అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసే బదులు శాశ్వతంగా జాతర స్థలం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ పదేళ్లుగా వినిపిస్తున్నాయి. ప్రతిసారీ గోదావరిలో నీళ్లు నిండుగా ఉంటాయని, తెలిసికూడా స్థలం ఎంపిక చేయకపోవడం సబబు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు గతంలో జాతర కోసం 10 గుంటల స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఆచరణలోకి రాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శాశ్వత స్థలం లేని కారణంగా అప్పటికప్పుడు గోదావరిలో నీళ్లు తొలగించడం, పనులు హడావుడిగా చేపడుతుండటంతో భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఉండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇప్పటికైనా జాతర కోసం శాశ్వత స్థలం ఎంపిక చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

నేడు దుకాణాలకు వేలం

జాతర సమయంలో ఏర్పాటు చేసే వివిధ దుకాణాలను వేలం వేసేందుకు దేవాదాయశాఖ ఆఽధికారులు సమాయత్తమవుతున్నారు. ఈనెల 21న ఉదయం 11 గంటలకు గోదావరి తీరంలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి, బెల్లం, కోళ్లు, పులిహోర, లడ్డూ, శీతల పానియాలు, తై బజార్‌ వసూళ్ల కోసం వేలం నిర్వహించనున్నట్లు జాతర ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రవికుమార్‌ తెలిపారు. వేలంలో పాల్గొనే ఆసక్తిగల వారు రూ. 20వేలు డిపాజిట్‌ చేయాలని, ఒకవేళ కరోనా కారణంగా జాతరను రద్దు చేస్తే డిపాజిట్‌ చేసిన డబ్బు వాపస్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

గోదావరిలో నీళ్లు తొలగించాలి

నరెడ్ల శ్రీనివాస్‌, జాతర నిర్వహణ కమిటీ సభ్యుడు

జాతరకు కేవలం 15 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి నుంచే గోదావరిలో నీళ్లు తొలగించే ప్రక్రియను చేపట్టాలి. తడి ఆరేంత వరకు వారం రోజులైనా పడుతుంది. మిగతా ఏర్పాట్లు చేయడంలో హడావుడి పడాల్సి వస్తుంది. లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి, అవసరమైన పనులు ప్రారంభించాలి. 

Updated Date - 2022-01-21T03:58:02+05:30 IST